చందమామ నీడలో...

భూమి నుంచే పుట్టుకొని వచ్చి ఉండొచ్చు. భూమికి ఉపగ్రహమే కావొచ్చు. అయితేనేం? మన వాతావరణం, కాలాల దగ్గర్నుంచి జీవుల మనుగడ వరకూ చంద్రుడి ప్రభావం పెద్దదే.  కొన్ని జీవులకు దిక్సూచిగా, పువ్వులకు పరాగ సంపర్క కారకుడిగానే కాదు..

Updated : 28 Sep 2022 11:45 IST

భూమి నుంచే పుట్టుకొని వచ్చి ఉండొచ్చు. భూమికి ఉపగ్రహమే కావొచ్చు. అయితేనేం? మన వాతావరణం, కాలాల దగ్గర్నుంచి జీవుల మనుగడ వరకూ చంద్రుడి ప్రభావం పెద్దదే.  కొన్ని జీవులకు దిక్సూచిగా, పువ్వులకు పరాగ సంపర్క కారకుడిగానే కాదు.. గ్రహశకలాల తాకిడి నుంచి భూమిని కాపాడే రక్షకుడిగానూ నిలుస్తున్నాడు. అంతటి చందమామ గొప్పతనాన్ని తెలుసుకోకపోతే ఎలా?

ఏటా దూరంగా..
చూడటానికి మనకు చంద్రుడు ఎప్పుడూ ఒకే దూరంలో ఉన్నట్టు కనిపిస్తుంటాడు. కానీ ఇది మన భావనే. భూమి చుట్టూ చంద్రుడు తిరిగే కక్ష్య వృత్తాకారంలో ఉండదు. కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. అందువల్ల భూమి, చంద్రుడి మధ్య దూరం ఎప్పుడూ ఒకేలా ఉండదు. భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు 3,62,600 కి.మీ., అతి దూరంగా వెళ్లినప్పుడు 4,05,400 కి.మీ. దూరంలో ఉంటాడు. అంటే 42,800 కి.మీ. తేడా ఉంటుందన్నమాట. మరోవైపు చందమామ భూమి నుంచి ఏటా సగటున 3.8 సెం.మీ. (1.5 అంగుళాలు) దూరంగా జరిగిపోతోంది. దీనికి కారణం అల ప్రభావమే (టైడ్‌ ఎఫెక్ట్‌). చంద్రుడు తన గురుత్వాకర్షణ శక్తితో సముద్రాలను, మహా సముద్రాలను ఆకర్షిస్తుంటాడు. దీని మూలంగానే ఆటుపోట్లు సంభవిస్తుంటాయి. ఇందులో సూర్యుడి పాత్ర కూడా ఉంటుందనుకోండి. చంద్రుడి ప్రభావం ఒక్క అలల మీదే కాదు, భూమి ఉపరితలం (క్రస్ట్‌) మీదా పడుతుంది. కాకపోతే ద్రవాలతో పోలిస్తే భూమి ఉపరితలం అంతగా సాగదు కాబట్టి మనకేమీ తెలియదు. భూమి-చంద్రుడి అక్షంతో పాటు ఈ ప్రభావాలతో ఘర్షణ పుట్టుకొస్తుంది. ఫలితంగా వేడి రూపంలో శక్తి చెదిరిపోతుంది. ఇది చంద్రుడు, భూమి రెండింటి కక్ష్యల సమతుల్యత మీద ప్రభావం చూపుతుంది. దీంతో భూమి భ్రమణ వేగం ప్రతి వందేళ్లకు 2 మిల్లీసెకండ్ల చొప్పున తగ్గుతోంది. అలాగే భూమి నుంచి చంద్రుడు ఏటా ఒకటిన్నర అంగుళం (3.8 సెం.మీ.) చొప్పున దూరంగా జరుగుతున్నాడు కూడా.

ఎలా కొలుస్తారు?
భూమి నుంచి చందమామ దూరంగా జరుగుతున్న విషయాన్ని, అదీ అంత కచ్చితంగా ఎలా కొలుస్తారు? మన మీద ఎలాంటి ప్రభావం చూపని, మనకేమాత్రం తెలియని ఈ స్వల్ప తేడాను గుర్తించటానికి లేజర్‌ రిఫ్లెక్టర్లు ఉపయోగపడుతున్నాయి. అపోలో వ్యోమనౌకల ద్వారా వెళ్లిన అమెరికా వ్యోమగాములు చంద్రుడి మీద వాటిని నెలకొల్పారు. సోవియట్‌ యూనియన్‌ పంపించిన లునోకాడ్‌ రోవర్లతోనూ వీటిని స్థాపించి ఉండొచ్చు. భూమి మీద అబ్జర్వేటరీ నుంచి లేజర్‌ పుంజాన్ని రిఫ్లెక్టర్ల మీదికి ప్రసరింపజేసి, అక్కడ్నుంచి కాంతి తిరిగి రావటానికి పట్టే సమయాన్ని బట్టి దూరాన్ని లెక్కిస్తారు. కాంతి సెకండుకు 3లక్షల కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది కదా. దీని ప్రకారం చంద్రుడి నుంచి కాంతి ప్రతిఫలించటానికి 2 సెకండ్ల కన్నా కాస్త ఎక్కువ సమయం పడుతుంది. దీని ఆధారంగానే రెండింటి మధ్య దూరాన్ని కచ్చితంగా లెక్కించగలుగుతున్నారు. చంద్రుడు దూరంగా జరిగితేనేం? నిజానికి భూమి మీద దీని ప్రభావం చాలా తక్కువే. అయినా ఖగోళ శాస్త్రవేత్తలు ఊరుకుంటారా? మున్ముందు ఎలాంటి ప్రభావం పడుతుందో అంచనా వేయకుండా ఉంటారా? చంద్రుడు ఇలాగే దూరంగా పోతుంటే.. 60 కోట్ల సంవత్సరాల తర్వాత సంపూర్ణ సూర్య గ్రహణాలు ఏర్పడకపోవచ్చు. ఎందుకంటే అప్పటికి సూర్యుడిని చంద్రుడు పూర్తిగా మూయలేనంత దూరం జరిగిపోవచ్చు.

‘చందమామ రావే, జాబిల్లి రావే’ అని పాట పాడి పిలుచుకుంటాం. చంద్రుడిని చూపించి పిల్లలకు బువ్వ తినిపిస్తాం. వెన్నెల రాత్రుల్లో ప్రణయ విహారాలూ చేస్తుంటాం. జాబిల్లి ప్రేరణతో పుట్టుకొచ్చిన కవిత్వం, కావ్యాలకు లెక్కేలేదు. నిత్యం కళలను మార్చుకుంటూ.. పౌర్ణమికి నిండు వెన్నెల కురిపిస్తూ, అమావాస్యకు కటిక చీకటిని ప్రసాదిస్తూ అనుక్షణం మన జీవితాన్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఆశలు, ఆకాంక్షలకే కాదు సృజనాత్మకతను వెలికితీయటానికీ చంద్రుడు అనాదిగా మన వెన్నంటే వస్తున్నాడు. నాగరికతల వికాసానికి సాక్షిగానూ నిలుస్తూ వస్తున్నాడు. కానీ ఏటా భూమి నుంచి సుమారు 1.5 అంగుళాల దూరం జరిగిపోతున్నాడు. ఇది చాలా చాలా తక్కువే అయినా.. దీని ప్రభావం మనకు కనిపించనిదే అయినా కోట్లాది సంవత్సరాల తర్వాత ఏదో ఒకనాడు భారీ అనర్థం సంభవించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చంద్రుడు మన భూమికి చేస్తున్న మేలు అంతా ఇంతా కాదు. చంద్రుడు లేకపోతే రాత్రిపూట వెన్నెల కురవక పోవటం ఒక్కటే కాదు.. భూమి మీద వాతావరణం, జీవుల మనుగడ కూడా కష్టమైపోయేది. విశ్వం భావనే సంపూర్ణంగా మారిపోయి ఉండేది. జీవజాతుల పురోగతి మందగించి ఉండేది. మన రుతువుల క్రమం, అలల మీద వినోద క్రీడలు.. కనువిందు చేసే సూర్య గ్రహణం, భూమి చరిత్ర నిక్షిప్తం వంటివన్నీ చంద్రుడితో ముడిపడినవే.


అలలు కరవు!
చంద్రుడు లేకపోతే కొట్టొచ్చినట్టు కనిపించే మొట్టమొదటి మార్పు సముద్రపు అలలు ఏర్పడకపోవటం. ఇవి ఏర్పడటానికి, సముద్రంలో ఆటుపోట్లకు ప్రధాన కారణం చంద్రుడే మరి. నేల మీద ప్రాణుల పుట్టుకకు ఒకరకంగా ఈ ఆటుపోట్లే కారణమని చెప్పినా అతిశయోక్తి కాదేమో. సముద్రపు అలలు వెనక్కి మళ్లిపోయాక, తీరాన మిగిలిపోయిన నీటిలోని ప్రాణులు నేల మీద మనుగడ సాగించటానికి అలవడి ఉండొచ్చు. అలా నీటిలోంచి బయటకు వచ్చిన జీవులే చివరికి మానవ పరిణామక్రమానికీ దారితీసి ఉండొచ్చన్నది ఒక భావన. చంద్రుడు లేకపోతే ప్రస్తుతం ఎగిసిపడే అలల సైజులో సుమారు 33% తగ్గిపోతుంది. దీంతో అలల ప్రాంతాల్లో నివసించే పీతలు, నత్తలు, ఆల్చిప్పల వంటి ప్రాణుల జీవనం అతలాకుతలమైపోతుంది. సముద్రపు ఆహార చట్రమే మారిపోతుంది. ఫలితంగా మొత్తం తీర ప్రాంత వ్యవస్థే ప్రమాదంలో పడుతుంది. దీంతో సముద్రంలోని, నేల మీది ప్రాణుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. రాత్రిపూట ఆహారం దొరక్కపోవటం వల్ల వేటాడే జంతువులూ అంతర్థానం కావొచ్చు.

* భూమి వాతావరణం తీరుతెన్నుల మీదా అలలు కీలక ప్రభావం చూపుతాయి. చల్లటి ఆర్కిటిక్‌ నీటిని, ఉష్ణప్రాంతాల వేడి నీటిని సముద్ర ప్రవాహాలు కలిపేస్తుంటాయి. వాతావరణం సమతులంగా ఉండటానికిది అత్యవసరం. ఈ సముద్ర ప్రవాహాలను సృష్టించటంలో అలలదే ప్రధాన పాత్ర. చంద్రుడు, అలలు లేకపోయినట్టయితే భూమి మీద అత్యధిక వేడి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. అదే సమయంలో అతి చల్లటి ప్రాంతాల్లో బాగా పడిపోతాయి. ఇది మొత్తంగా జీవుల ఉనికికే ప్రమాదం తెచ్చిపెడుతుంది.

భూమి అక్షం స్థిరంగా..
మన భూమి 23.5 డిగ్రీల అక్షం వద్ద తనచుట్టూ తాను తిరుగుతుంటుంది. ఇది చంద్రుడి కక్ష్య, అతడి గురుత్వాకర్షణ చలవే. ఒకవేళ చంద్రుడు లేనట్టయితే భూమి అక్షం 10 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్యలో ఊగిసలాడుతుంది. అప్పుడు ఉష్ణోగ్రతల తీరుతెన్నులు సమూలంగా మారిపోతాయి. భూమధ్యరేఖ అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రాంతంగా, ధ్రువాలు అతి చల్లటి ప్రాంతాలుగా ఉండవు. మంచు చరియలు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగిపోతాయి. ఒకప్పుడు భూమి అక్షం 1 నుంచి 2 డిగ్రీల మేరకు మారిపోయిందని, ఇదే క్రమంగా మంచు యుగానికి దారితీసి ఉండొచ్చన్నది పరిశోధకుల నమ్మకం. అందువల్ల భూమి అక్షం 10 నుంచి 45 డిగ్రీల వరకు వంగితే రుతువులన్నీ మారిపోవటం ఖాయం. జీవుల స్థితిగతులన్నీ చిందర వందరైపోవటం నిశ్చయం.

భూ భ్రమణ వేగం కుదురుగా
చంద్రుడి గురుత్వాకర్షణ లేకపోతే భూమి భ్రమణ వేగమూ గణనీయంగా పెరిగిపోతుంది. అప్పుడు సంవత్సరంలో వెయ్యికన్నా ఎక్కువ రోజులు ఉండే అవకాశముంది. భూమిని వేడి చేయటానికి సూర్యుడికి తగినంత సమయం చిక్కకపోవటం వల్ల చలి విపరీతంగా పెరిగిపోయేది. భూ భ్రమణ వేగం పెరిగితే అలలు చాలా వేగంతో ఎగిసిపడతాయి కూడా. తుపాన్లు రోజువారీ వ్యవహారంగా మారిపోతాయి. రుతువులు కనుమరుగవుతాయి. వాతావరణం పూర్తిగా అంచనా వేయలేని స్థితికి చేరుకుంటుంది. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో జీవుల నివాసమే గగనమై పోతుంది. గురుగ్రహం గురుత్వాకర్షణ మూలంగా భూమి అక్షం వంపు స్థిరంగా ఉంటున్నట్టు నాసా అధ్యయనంలో తేలినప్పటికీ చంద్రుడి గురుత్వాకర్షణ లేకపోతే విపరీత పరిణామాలు తలెత్తటం ఖాయం. భూమి అక్షం నిరంతరం మారిపోతూ ఉన్నట్టయితే భూమి అంతర్భాగం కంపించి, తీవ్ర మార్పులు సంభవిస్తాయి. అసాధారణ భూకంపాలు, అగ్ని పర్వతాల విస్ఫోటనాలు జరుగుతాయి. అప్పుడు జీవుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవటమే కష్టం. ఈ మార్పులను తట్టుకొని మనుగడ సాగించే క్రమంలో పాత ప్రాణులు అంతర్థానమై, కొత్త జీవులు పుట్టుకురావొచ్చు. ఇవి దృఢంగా, పొట్టిగా ఉండి ఉండొచ్చు.

భూమికి రక్షణగా..
చందమామ భూమికి రక్షకుడిగానూ నిలుస్తాడు. గ్రహశకలాల దాడి నుంచి కాపాడుతుంటాడు. పైగా చంద్రుడి మీది రాళ్లు భూమి, సౌర వ్యవస్థ ఏర్పాటుకు రుజువులు కూడా. భూమి నుంచి విడిపోయినప్పట్నుంచీ చంద్రుడు ఏమాత్రం మారకుండా అలాగే ఉన్నాడు మరి. ఈ రాళ్లను రసాయనికంగా విశ్లేషించటం ద్వారా గ్రహశకలాలు, తోకచుక్కలు భూమికి ఎంత నీటిని తీసుకొచ్చాయో నిర్ధరించొచ్చు. అంటే చంద్రుడిని ఒకరకంగా భూమి చరిత్ర నిక్షిప్త గని అనుకోవచ్చన్నమాట.

జీవుల పునరుత్పత్తికీ

చంద్రుడు తోడ్పడతాడు. గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ వద్ద నవంబరులో పౌర్ణమి తర్వాత సుమారు 2-6 రోజుల్లో రాత్రికి రాత్రే పగడాలు (కోరల్స్‌) పెద్దమొత్తంలో పునరుత్పత్తి అవుతాయి. ప్రపంచంలోనే ఇదో అతిపెద్ద పునరుత్పత్తి వేడుకగా పేరొందింది. దీనికి కచ్చితమైన కారణమేంటన్నది ఇంకా రహస్యంగానే ఉండిపోయింది. ఉష్ణోగ్రత, నీటి తీరుతెన్నులు, చంద్రుడి వంటివన్నీ ఇందులో పాలు పంచుకొని ఉంటుండొచ్చని భావిస్తున్నారు. నేల మీద జంతువులు సైతం.. ముఖ్యంగా ఎర్ర పీతలు నవంబరు/డిసెంబరు చివరి రోజుల్లో పర్వతాల నుంచి తీరానికి వలస వస్తుంటాయి. చంద్రుడే లేనట్టయితే ఇలాంటి జీవ అద్భుతాలు జరిగి ఉండేవే కావు. పేడ పురుగులు కూడా పేడ ముద్దలను బొరియల్లో పూడ్చటానికి వెన్నెల సాయం తీసుకుంటాయి. కొన్ని పువ్వుల పరాగ సంపర్కానికీ, తేళ్లు నీలిరంగులో మెరవటానికీ వెన్నెల తోడ్పడుతుంది. ఇలా జీవజాతుల మీద, పునరుత్పత్తి మీద చంద్రుడి ప్రభావం ఎనలేనిది, సాటిలేనిది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని