Updated : 03/11/2021 05:13 IST

ఫోన్‌ స్పేస్‌ నిండిపోతే?

ఫోన్‌ కొన్నప్పుడు స్పేస్‌ బాగానే ఉంటుంది. ఆ తర్వాతే సమస్య మొదలవుతుంది. రకరకాల యాప్‌లు, ఫోటోలు, వీడియోలు, పాటలు, డాక్యుమెంట్లు వచ్చి చేరుతుండటంతో త్వరలోనే నిండుకుంటుంది. ఇలాకాదని మెమరీ కార్డు వేసుకున్నా ఎంతోకాలం పట్టదు. తగినంత స్పేస్‌ లేదనే  సందేశంతో మాటిమాటికీ ఫోన్‌ వెక్కిరిస్తుంది. మరి ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ సమస్యను పరిష్కరించుకునేదెలా?

చాలామంది స్టోరేజీ, మెమరీ ఒకటేనని అనుకుంటుంటారు. నిజానికివి వేర్వేరు. పాటలు, ఫొటోల వంటివి దాచుకునేది స్టోరేజీలో. యాప్స్‌, ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌ వంటివి రన్‌ అయ్యేది మెమరీ నుంచి. స్పేస్‌ ఖాళీ చేసుకోవాలంటే ముందుగా ఫోన్‌ ఆండ్రాయిడ్‌ వర్షన్‌ ఏదో చూసుకోవాలి. ఈ చిట్కాల్లో కొన్ని ఆండ్రాయిడ్‌ 10, అంతకన్నా ఎక్కువ వర్షన్‌కే వర్తిస్తాయి మరి. వర్షన్‌ను తెలుసుకోవటానికి ఫోన్‌ సెటింగ్స్‌ ఓపెన్‌ చేసి, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోకి వెళ్లాలి. సాఫ్ట్‌వేర్‌ ఇన్‌ఫర్మేషన్‌లో ఆండ్రాయిడ్‌ వర్షన్‌, సెక్యూరిటీ ప్యాచ్‌ వివరాలు తెలుస్తాయి. లేటెస్ట్‌ వర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలి. అప్‌డేట్స్‌ అందుబాటులో ఉంటే నోటిఫికేషన్స్‌ కనిపిస్తాయి. సెటింగ్స్‌లో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌లోకి వెళ్లి కూడా అప్‌డేట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. ఆయా పరికరాలు, తయారీ సంస్థల వంటి వాటిని బట్టి అప్‌డేట్‌ షెడ్యూళ్లు ఆధారపడి ఉంటాయి. ‘నాట్‌ ఎనఫ్‌ స్పేస్‌ అవలేబుల్‌’ నోటిఫికేషన్‌ కనిపించినట్టయితే స్టోరేజీని వాడుకుంటున్నవేంటో చెక్‌ చేయాలి. సెటింగ్స్‌ ద్వారా డివైస్‌ కేర్‌ నుంచి స్టోరేజీలోకి వెళ్లాలి. తర్వాత కేటగిరీ మీద ట్యాప్‌ చేయాలి. స్మార్ట్‌ స్టోరేజీ లేదా స్టోరేజీ బూస్టర్‌ను టర్న్‌ ఆన్‌ చేసినట్టయితే ఫోన్‌ తనకుతానే బ్యాకప్‌ అయిన ఫొటోలు, వీడియోలను తొలగించేస్తుంది. ఫోన్‌ మోడల్‌, ఆండ్రాయిడ్‌ వర్షన్‌, కంపెనీని బట్టి స్టోరేజీ ఆధారపడి ఉంటుంది. దీన్ని సెటింగ్స్‌లో ‘స్టోరేజ్‌’ అని టైప్‌ చేసి వెతుక్కోవటం మంచిది. కొన్ని ఫోన్లలో మేనేజ్‌ స్టోరేజ్‌ను క్లిక్‌ చేయటం ద్వారానూ ఖాళీని సృష్టించుకోవచ్చు. దేనినైనా డిలీట్‌ చేయాలని అనుకుంటే ఇందులో కుడివైపున కనిపించే ఖాళీ బాక్స్‌ను ట్యాప్‌ చేసి ‘ఫ్రీ అప్‌’ను క్లిక్‌ చేయాలి.

యాప్‌ క్యాచీని తొలగించి..

యాప్స్‌ బాగా పనిచేయటానికి ఎప్పటికప్పుడు కొంత డేటాను స్టోర్‌ చేసి పెట్టుకుంటాయి (క్యాచ్డ్‌ డేటా). నిజానికిది అవసరం లేదు. కొంత సమయం ఆదా అవటానికే ఉపయోగపడుతుంది. తాత్కాలిక ఇంటర్నెట్‌ ఫైళ్లను నిల్వ చేసుకున్నట్టుగానే మొబైల్‌ ఫోన్‌ యాప్స్‌ కూడా ఇంటర్నల్‌ మెమరీలో తాత్కాలిక ఫైళ్లను స్టోర్‌ చేస్తుంటాయి. ఇవీ స్పేస్‌ను బాగానే ఆక్రమిస్తాయి. వీటిని తొలగించటానికి సెటింగ్స్‌ ద్వారా యాప్స్‌లోకి వెళ్లాలి. ఆయా యాప్‌లను ఎంచుకొని స్టోరేజీ మీద ట్యాప్‌ చేయాలి. అనంతరం క్లియర్‌ డేటా ద్వారా క్లియర్‌ క్యాచీ బటన్‌ను క్లిక్‌ చేయాలి.

డౌన్‌లోడ్స్‌ డిలీట్‌ చేసి..

వాట్సప్‌ నుంచో మెయిళ్ల నుంచో డౌన్‌లోడ్‌ చేసుకున్న ఫొటోలు, ఫైళ్లు, డాక్యుమెంట్ల వంటివన్నీ డౌన్‌లోడ్‌ ఫోల్డర్‌లో సేవ్‌ అవుతాయి. దీన్ని కొన్ని ఫోన్లలో ‘మై ఫైల్స్‌’ అనీ పిలుచుకుంటుంటారు. ఇది ఫోన్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. ఫైల్‌ మేనేజర్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్నట్టయితే అందులోనూ ఉంటుంది. ఇందులోకి వెళ్లి అనవసరమైన ఫైళ్లను సెలెక్ట్‌ చేసుకొని, ట్రాష్‌ గుర్తును నొక్కితే వెంటనే డిలీట్‌ అవుతాయి. ఇలా కొంత స్పేస్‌ను తిరిగి పొందొచ్చు.

గూగుల్‌ ఫొటోస్‌తో బ్యాకప్‌

యాప్‌ డ్రాయర్‌లో గూగుల్‌ ఫొటోస్‌ ఉందేమో చూసుకోండి. ఒకవేళ లేకపోతే ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఇందులో బోలెడన్ని ఫొటోలను బ్యాకప్‌ చేసుకోవచ్చు. ఇది గూగుల్‌ డ్రైవ్‌ స్పేస్‌ పరిధిలోకి ఏమీ రాదు. ఫొటోలను బ్యాకప్‌ చేసుకున్నాక ఫోన్‌ నుంచి వాటిని డిలీట్‌ చేసుకోవచ్చు. ముందుగా గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి సెటింగ్స్‌లో బ్యాకప్‌ అండ్‌ సింక్‌ ఆప్షన్‌ను టర్న్‌ ఆన్‌ చేయాలి. దీంతో ఫొటోస్‌ బ్యాకప్‌ అవుతాయి. తర్వాత ఫ్రీ ఆప్‌ డివైస్‌ స్టోరేజీ మీద ట్యాప్‌ చేయాలి. దీంతో అప్పటికే బ్యాకప్‌ అయిన ఫొటోలన్నీ ఫోన్‌లోంచి డిలీట్‌ అవుతాయి. స్పేస్‌ ఖాళీ చేసుకోవటానికి మరో మంచి మార్గం వాట్సప్‌ ఛాట్స్‌ను.. ముఖ్యంగా గ్రూప్‌ ఛాట్స్‌ను క్లియర్‌ చేసుకోవటం. మీడియా ఫోల్డర్‌లోని ఫైళ్లను డిలీట్‌ చేయటం ద్వారానూ చాలా స్పేస్‌ ఖాళీ అవుతుంది.

ఇంటర్నల్‌ స్టోరేజీగా ఎస్‌డీ కార్డు

కొన్ని ఆండ్రాయిడ్‌ ఫోన్లు అదనపు స్టోరేజీ కోసం మైక్రో ఎస్‌డీ కార్డుకు అనుమతిస్తాయి. ఎక్కువ మెమరీని వాడుకునే కొన్ని యాప్స్‌ను ఇందులోకి బదిలీ చేసుకోవచ్చు. సెటింగ్స్‌లోకి వెళ్లి యాప్స్‌ మీద ట్యాప్‌ చేయాలి. ఎస్‌డీ కార్డులోకి పంపాలని అనుకునే యాప్‌ను నొక్కాలి. స్టోరేజీ మీద క్లిక్‌ చేసి, ఛేంజ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఒకవేళ ఈ ఆప్షన్‌ లేనట్టయితే యాప్‌ను మార్చుకోవటం సాధ్యం కాదు. ఇలాంటి స్థితిలో మరో మార్గాన్ని ఎంచుకోవచ్చు. అదే అడాప్టేబుల్‌ స్టోరేజ్‌ ఫీచర్‌. ఇది మైక్రోఎస్‌డీ కార్డును ఫార్మాట్‌ చేసి, అదనపు ఇంటర్నల్‌ స్టోరేజీగా వాడుకోవటానికి అనుమతిస్తుంది. ఇందుకోసం సెటింగ్స్‌ ద్వారా స్టోరేజీలోకి వెళ్లి, ఎస్‌డీ కార్డును సెలెక్ట్‌ చేసుకోవాలి. ఆప్షన్స్‌ గుర్తు మీద క్లిక్‌ చేసి, స్టోరేజ్‌ ఆప్షన్స్‌ను ఎంచుకోవాలి. ‘ఫార్మాట్‌ యాజ్‌ ఇంటర్నల్‌’ను ఎంచుకొని, తర్వాత ‘డిలీట్‌ అండ్‌ ఫార్మాట్‌’ మీద క్లిక్‌ చేయాలి.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని