Vo5G: ఫోన్‌లో వో5జీ ఉందా?

3జీ, 4జీ దాటుకొని 5జీ యుగంలోకి ప్రవేశించాం. మరి ఇంటర్నెట్‌ వేగంతో పాటు కాల్స్‌ నాణ్యత కూడా పెరగొద్దూ. ఇందుకోసమే వచ్చింది వో5జీ (వాయిస్‌ ఓవర్‌ 5జీ) పరిజ్ఞానం.

Published : 06 Dec 2023 08:54 IST

3జీ, 4జీ దాటుకొని 5జీ యుగంలోకి ప్రవేశించాం. మరి ఇంటర్నెట్‌ వేగంతో పాటు కాల్స్‌ నాణ్యత కూడా పెరగొద్దూ. ఇందుకోసమే వచ్చింది వో5జీ(Vo5G) (వాయిస్‌ ఓవర్‌ 5జీ) పరిజ్ఞానం. దీన్నే వాయిస్‌ ఓవర్‌ న్యూ రేడియో (వోఎన్‌ఆర్‌) అనీ పిలుచుకుంటున్నారు. భవిష్యత్‌ వాయిస్‌ కాలింగ్‌ పరిజ్ఞానంగా భావిస్తున్న ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అమలవుతోంది. స్మార్ట్‌ఫోన్‌ కమ్యూనికేషన్‌లో వో5జీ ఓ కొత్త ఒరవడి. ఇది ఎల్‌టీఈ మీద కాకుండా 5జీ మీద కాల్స్‌కు అనుమతిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే- 5జీ వేగం, సామర్థ్యం, ప్రతిస్పందన తీరును అందిపుచ్చుకొని పనిచేస్తుందన్నమాట. మొదట్లో 4జీ ఫోన్లు వచ్చినప్పుడు వాటిల్లో వాయిస్‌ ఓవర్‌ ఎల్‌టీఈ (వోల్టే) పరిజ్ఞానం ఉండేది కాదు. కేవలం ఎల్‌టీఈ మీదే పనిచేయటం వల్ల కాల్‌ డ్రాప్స్‌ వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఇప్పుడు 5జీ పరికరాల్లోనూ ఇలాంటి సమస్యే ఎదురవుతోంది. దీన్ని పరిష్కరించటానికి వచ్చిందే వో5జీ. 5జీ నెట్‌వర్క్‌లో కాల్‌ డ్రాప్స్‌ కాకుండా చూడటానికి దీన్ని రూపొందిచారు. హయ్యర్‌ బ్యాండ్‌విడ్త్‌, తక్కువ జాప్యంతో కూడుకొని ఉండటం వల్ల కాల్‌ నాణ్యత గణనీయంగా పెరుగుతుంది. వో5జీని సపోర్టు చేసే ఫోన్‌, 5జీ సిగ్నల్‌ ఉంటే దీన్ని వాడుకోవచ్చు. ఈ ఫీచర్‌ చాలా ఫోన్లలో డిఫాల్ట్‌గానే ఆన్‌ అయ్యి ఉంటుంది. అయినా సెటింగ్స్‌లో మరోసారి చూసుకోవటం మంచిది. ప్రస్తుతానికి వో5జీ మనదేశంలో అందుబాటులో లేదు. పెద్ద పట్టణాల్లో 5జీని అమలు చేసినా దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఇది అందరికీ అందుబాటులోకి రావటానికి ఇంకాస్త సమయం పట్టొచ్చు. అప్పుడు 5జీతో నాణ్యమైన కాల్స్‌ చేసు కోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని