Published : 06 Jul 2022 01:02 IST

పీసీకి పవర్‌

పవర్‌టాయ్స్‌. పేరును బట్టి ఇదేదో ఆటలకు సంబంధించిందని అనిపిస్తోంది కదా. దీంతో నిజంగానే కంప్యూటర్‌తో ‘ఆడుకోవచ్చు’! సిస్టమ్‌ను ఇది మరింత సమర్థంగా తీర్చిదిద్దుతుంది మరి. విండోస్‌ 10, 11 కంప్యూటర్లలో ఇన్‌స్టాల్‌ చేసుకోవటానికి అనువైన దీన్ని రకరకాల పనులకు వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌ సంస్థ మూడేళ్ల క్రితం పవర్‌టాయ్స్‌ను విడుదల చేసింది. ఇది ఉచితం. ఓపెన్‌ సోర్స్‌ ప్రాజెక్టు కావటం వల్ల అన్ని సదుపాయాలనూ వాడుకోవచ్చు. మరి ఇదెలా ఉపయోగపడుతుందో? దీని ఫీచర్లేంటో చూద్దామా!

పవర్‌టాయ్స్‌ను https://docs.microsoft.com/en-us/windows/powertoys/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అసెట్స్‌ విభాగం డ్రాప్‌ డౌన్‌ మెనూలో కనిపించే ఫైళ్లను ఎంచుకొని, పవర్‌టాయ్స్‌ సెటప్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అప్పుడు పవర్‌టాయ్స్‌ ఇన్‌స్టాలర్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. అనంతరం దీన్ని ఓపెన్‌ చేసి, విధివిధానాల ప్రకారం ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. తర్వాత టాస్క్‌బార్‌లో పవర్‌టాయ్స్‌ అని టైప్‌ చేస్తే చాలు. లాంచ్‌ అవుతుంది. సిస్టమ్‌ ట్రేలో పవర్‌టాయ్‌ గుర్తు మీద క్లిక్‌ చేసినా ఓపెన్‌ అవుతుంది. ఎడమ వైపున రకరకాల ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో కొన్ని ఇవీ..
కలర్‌ పికర్‌
దీన్ని వాడుకోవాలంటే ముందుగా పవర్‌టాయ్స్‌ సెటింగ్స్‌లోకి వెళ్లి ఎనేబుల్‌ చేసుకోవాలి. తర్వాత మౌజ్‌తో స్క్రీన్‌ మీద ఇష్టమైన కలర్‌ను ఎంచుకొని, దాని మీద క్లిక్‌ చేయాలి. అప్పుడు ఎడిటర్‌ ఫీచర్‌ ఓపెన్‌ అవుతుంది. ఎంచుకున్న కలర్‌తో పాటు ఆయా రంగు ఫార్మాట్‌కు సంబంధించిన హెచ్‌ఈఎక్స్‌, ఆర్‌జీబీ, హెచ్‌ఎస్‌ఎల్‌ విలువలూ కనిపిస్తాయి. డిఫాల్ట్‌గా హెచ్‌ఈఎక్స్‌ ఫార్మాట్‌ ఎనేబుల్‌ అయ్యి ఉంటుంది. తర్వాత ఇమేజ్‌ ఎడిటింగ్‌ ప్రోగ్రామ్‌లోకి వెళ్లి, ఎంచుకున్న రంగును పేస్ట్‌ చేస్తే బోలెడన్ని కలర్‌ ఫార్మాట్లు కనిపిస్తాయి.
ఫ్యాన్సీ జోన్స్‌
స్క్రీన్‌ను వివిధ జోన్లుగా లే అవుట్‌ చేసుకోవటానికిది ఉపయోగపడుతుంది. తర్వాత విండోస్‌ను ఆయా జోన్లలోకి జరుపుకోవచ్చు. విండోస్‌లో ఇప్పటికే ఈ సదుపాయం ఉన్నప్పటికీ ఫ్యాన్సీ జోన్స్‌ ఫీచర్‌ ఇంకాస్త మెరుగ్గా పనిచేస్తుంది. పవర్‌టాయ్స్‌ సెటింగ్స్‌ మెనూలోని బటన్‌తో జోన్స్‌ ఎడిటర్‌ను లాంచ్‌ చేసుకోవచ్చు. టెంప్లేట్‌ ద్వారా జోన్స్‌ను సెట్‌ చేసుకోవచ్చు. కావాలంటే ఇష్టమైన జోన్లనూ సృష్టించుకోవచ్చు. ఇందుకోసం బోలెడన్ని ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
ఇమేజ్‌ రీసైజర్‌
ఒకేసారి ఎక్కువ ఫొటోలను సైజ్‌ మార్చుకోవటానికి ఇమేజ్‌ రీసైజర్‌ మంచి సదుపాయం. రీసైజ్‌ చేసుకోవాలనుకునే ఫొటోలను ఎంచుకొని, రైట్‌ క్లిక్‌ చేసి సైజ్‌ను ఎంచుకోవాలి. ఫిల్‌, ఫిట్‌, స్ట్రెచ్‌.. ఇలా ఎలా కావాలంటే అలా ఫొటోల సైజును ఎంచుకోవచ్చు. సెంటీమీటర్లు, అంగుళాలు, పర్సెంట్‌, పిక్సెల్‌ వంటి వాటినీ కన్ఫిగర్‌ చేసుకోవచ్చు. కీబోర్డు మేనేజర్‌ మీటలతో పాటు షార్ట్‌కట్స్‌నూ అటుఇటుగా మార్చుకోవచ్చు. ఎడమచేతి వాటం గలవారికి, గేమ్స్‌ ఆడేవారికి, క్వెర్టీ నుంచి ఇతర లేఅవుట్‌ కీబోర్డులకు మారాలని అనుకునేవారికిది బాగా ఉపయోగపడుతుంది.
పవర్‌ రీనేమ్‌
ఫైళ్ల పేర్లను ఒకేసారి మార్చుకోవటానికి తోడ్పడే ఫీచర్‌ ఇది. ముందుగా పవర్‌టాయ్స్‌లో పవర్‌ రీనేమ్‌ను ఎనేబుల్‌ చేసుకున్నారో లేదో చూసుకోవాలి. తర్వాత విండోస్‌ ఫైల్‌ ఎక్స్‌పోర్లర్‌లోని ఫైళ్లను ఎంచుకోవాలి. వీటి మీద రైట్‌ క్లిక్‌ చేస్తే మెనూలో పవర్‌ రీనేమ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీని మీద క్లిక్‌ చేయగానే ఫైళ్లు కనిపిస్తాయి.
విండోస్‌ కీ షార్ట్‌కట్‌ గైడ్‌
పవర్‌టాయ్స్‌లో ఇదో మంచి ఆప్షన్‌. విండోస్‌, షిఫ్ట్‌, స్లాష్‌ బటన్లను కలిపి నొక్కితే చాలు. వాడుకోవటానికి వీలైన షార్ట్‌కట్స్‌ అన్నీ కనిపిస్తాయి. విండో పొజిషన్‌ను మార్చుకోవటానికి తోడ్పడే షార్టకట్స్‌ కూడా దర్శనమిస్తాయి. ఇందులో ఆసక్తికరమైన షార్ట్‌కట్స్‌ చాలానే ఉన్నాయి. అప్పటికే తెలిసిన షార్ట్‌కట్స్‌ను మరోసారి నెమరు వేసుకోవటానికి, కొత్తవి నేర్చుకోవటానికి ఈ గైడ్‌ బాగా ఉపయోగపడుతుంది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని