యాప్స్‌ ఆర్కైవ్‌ చేస్తారా?

ఫోన్‌లో స్పేస్‌ నిండుకుంటోందా? అరుదుగా వాడే యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకోవటం దీనికి తేలికైన పరిష్కారం. కానీ ఇందుకు కాస్త సమయం పడుతుంది.

Published : 27 Sep 2023 00:34 IST

ఫోన్‌లో స్పేస్‌ నిండుకుంటోందా? అరుదుగా వాడే యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకోవటం దీనికి తేలికైన పరిష్కారం. కానీ ఇందుకు కాస్త సమయం పడుతుంది. యాప్‌ అవసరమో, కాదో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్టయితే డోలాయమానంలో పడటం ఖాయం. తర్వాత ఎప్పుడైనా అవసరమైతేనో అనీ అనిపించొచ్చు. ఇలాంటి సమయంలో ప్లే స్టోర్‌లోని ఆటో ఆర్కైవ్‌ ఫీచర్‌ ఆదుకుంటుంది. ఇది ఫోన్‌లో స్టోరేజీ తక్కువగా ఉన్నప్పుడు వాడని యాప్స్‌ను దానంతటదే ఆర్కైవ్‌ చేసేస్తుంది. దీంతో స్పేస్‌ ఖాళీ అవుతుంది. యాప్‌ పూర్తిగా అన్‌ఇన్‌స్టాల్‌ కాకుండా అలాగే ఉంటుంది. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట. ప్లేస్టోర్‌లో ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులో ఉంటుంది. కానీ డిఫాల్ట్‌గా డిసేబుల్‌ అయ్యుంటుంది. కాబట్టి ఎవరికివారే ఎనేబుల్‌ చేసుకోవాలి. ఇందుకోసం..

  • ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ప్లే స్టోర్‌ను ఓపెన్‌ చేయాలి.
  • తెర పైన కుడివైపున ప్రొఫైల్‌ ఫొటో మీద తాకి, సెటింగ్స్‌లోకి వెళ్లాలి.
  • ఇందులో జనరల్‌ విభాగాన్ని తాకితే కిందికి జాబితా విస్తరిస్తుంది. ఇందులోనే ‘ఆటోమేటికల్లీ ఆర్కైవ్‌ యాప్స్‌’ ఆప్షన్‌ ఉంటుంది. దీని పక్కనుండే బటన్‌ను ఆన్‌ చేసుకోవాలి.

- ఆర్కైవ్‌ అయిన యాప్స్‌ డేటా ఫోన్‌లోనే ఉంటాయి. కేవలం ఇన్‌స్టలేషన్‌ ఫైళ్లు మాత్రమే పోతాయి. ఆర్కైవ్‌ అయిన యాప్స్‌ ఫోన్‌ డ్రాయర్‌లో బూడిద రంగు గుర్తులతో కనిపిస్తాయి. మరి వీటిని ఎప్పుడైనా వాడుకోవాలంటే? ఫోన్‌ డ్రాయర్‌లోని బూడిద రంగు యాప్‌ గుర్తుల మీద తాకితే చాలు. అప్పుడవి ప్లే స్టోర్‌ నుంచి మళ్లీ డౌన్‌లోడ్‌ అవుతాయి. ఆవెంటనే యాప్స్‌ డేటా కూడా రిస్టోర్‌ అవుతుంది. ఆటోమేటికల్లీ ఆర్కైవ్‌ యాప్స్‌ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకున్నప్పటికీ అరుదుగా వాడే యాప్స్‌ మూలకేమీ పోవు. స్టోరేజీ తగ్గినప్పుడే ఆర్కైవ్‌ అవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని