లొకేషన్‌ క్షేమమా?

ఫోన్‌తో ఎన్నో ఫొటోలు తీస్తుంటాం. తెలిసినవారికో, కొత్తవారికో షేర్‌ చేస్తుంటాం. మరి ఫొటోతో పాటు మన లొకేషన్‌నూ షేర్‌ చేస్తున్నామనే సంగతి తెలుసా? ఇది ఫోన్‌ రకం, కెమెరా సెటింగ్స్‌ మీదా ఆధారపడి ఉంటుంది.

Updated : 13 Dec 2023 01:35 IST

ఫోన్‌తో ఎన్నో ఫొటోలు తీస్తుంటాం. తెలిసినవారికో, కొత్తవారికో షేర్‌ చేస్తుంటాం. మరి ఫొటోతో పాటు మన లొకేషన్‌నూ షేర్‌ చేస్తున్నామనే సంగతి తెలుసా? ఇది ఫోన్‌ రకం, కెమెరా సెటింగ్స్‌ మీదా ఆధారపడి ఉంటుంది. మంచి విషయం ఏంటంటే- చాలావరకు సామాజిక మాధ్యమ వేదికలు ఈ డేటాను తొలగించటం. అయినా కూడా వేరే మార్గాల్లో మన లొకేషన్‌ను గుర్తించొచ్చు. పరికరం, యాప్స్‌ సైతం మన లొకేషన్‌ను గుర్తించొచ్చు. జీపీఎస్‌ యాప్‌ గమ్యాన్ని చేరుకోవటానికి దారి చూపించాలంటే దానికి మనం ఎక్కడున్నామో తెలియాల్సిందే. సమంజసమైన యాడ్స్‌ను పంపటానికి సామాజిక మాధ్యమ యాప్‌లు సైతం లొకేషన్‌ను వాడుకుంటాయి. కాబట్టి వీటి వలలో పడకుండా లొకేషన్‌ ట్రాకింగ్‌ను ఆఫ్‌ చేసుకోవటం మంచిది.

గూగుల్‌లో..

మన గూగుల్‌ ఖాతా చాలా యాప్‌లు, సర్వీసులతో ముడిపడి ఉంటుంది. కాబట్టి దీంతోనే లొకేషన్‌ ట్రాకింగ్‌ను ఆపటాన్ని ఆరంభించటం ఉత్తమం. వీటిల్లో ఒకటి లొకేషన్‌ హిస్టరీ. రెండోది లొకేషన్‌ షేరింగ్‌.

లొకేషన్‌ హిస్టరీ: ఇది మనం స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కడికి తీసుకెళ్లినా దాన్ని సేవ్‌ చేసి పెడుతుంది. డిఫాల్ట్‌గా ఇది ఆఫ్‌ అయ్యింటుంది. తెలిసో తెలియకో దీన్ని ఆన్‌ చేసి, మరచిపోయి ఉండొచ్చు. అయినా భయపడాల్సిందేమీ లేదు. తేలికగానే టర్న్‌ ఆఫ్‌ చేసుకోవచ్చు.

  • మైఅకౌంట్‌.గూగుల్‌.కామ్‌ లేదా గూగుల్‌ యాప్‌తో ఖాతాకు సైన్‌ ఇన్‌ అవ్వాలి.
  • డేటా అండ్‌ ప్రైవసీ విభాగం ద్వారా లొకేషన్‌ హిస్టరీలోకి వెళ్లాలి.
  • ఈ ఫీచర్‌ను టర్న్‌ ఆఫ్‌ చేసి, కన్‌ఫర్మ్‌ చేసుకోవాలి.
  • దీనికి కాస్త దిగువ ఆటో-డిలీట్‌ సదుపాయమూ ఉంటుంది. ఇందులో గడువును ఎంచుకొని ఆన్‌ చేసుకోవాలి. అలాగే డివైసెస్‌ విభాగంలోకి వెళ్లి లొకేషన్‌ను సేవ్‌ చేసే పరికరాల జాబితానూ గుర్తించాలి. టర్న్‌ ఆఫ్‌ మీద నొక్కి ఆయా పరికరాలకు లొకేషన్‌ సేవ్‌ను డిసేబుల్‌ చేసుకోవాలి.

లొకేషన్‌ షేరింగ్‌: ఇది మనం ఎంచుకున్నవారికి లొకేషన్‌ షేర్‌ చేస్తుంది. ఆత్మీయులతో షేర్‌ చేసుకుంటే ఇబ్బందేమీ ఉండదు గానీ మరెవరైనా అయితే జాగ్రత్త పడాల్సిందే.

  • మైఅకౌంట్‌.గూగుల్‌.కామ్‌ లేదా గూగుల్‌ యాప్‌తో ఖాతాకు సైన్‌ ఇన్‌ అవ్వాలి.
  • డేటా అండ్‌ ప్రైవసీ విభాగం ద్వారా లొకేషన్‌ షేరింగ్‌లోకి వెళ్లాలి.
  • ఎవరితోనూ షేరింగ్‌ చేసుకోకపోతే ఫర్లేదు. జాబితాలో అనుచిత వ్యక్తులు కనిపిస్తే స్టాప్‌ మీద నొక్కాలి.

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో..

ఫోన్‌లో లొకేషన్‌ ట్రాకింగ్‌ను పూర్తిగా ఆపేయొచ్చు. లేదూ ఒకో యాప్‌ సెటింగ్స్‌ను చూస్తూ సెట్‌ చేసుకోవచ్చు. సెటింగ్స్‌ ద్వారా లొకేషన్‌లోకి వెళ్లి ఆఫ్‌ చేస్తే ట్రాకింగ్‌ మొత్తం నిలుస్తుంది. ఒకవేళ దీన్ని ఆన్‌ చేసి ఉంచుకోవాలనుకుంటే కిందికి స్క్రోల్‌ చేస్తూ ఒక్కో యాప్‌ సెటింగ్స్‌ను పరిశీలించాలి. వేటికి లొకేషన్‌ ట్రాకింగ్‌ వద్దనుకుంటున్నారో వాటిలో ఆఫ్‌ చేయాలి.

గూగుల్‌ మ్యాప్స్‌లో..

స్నేహితులకు, కుటుంబ సభ్యులకు గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారానూ లొకేషన్‌ షేర్‌ చేస్తుంటాం. మరి దీన్ని గుర్తించటమెలా?

  • గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి ప్రొఫైల్‌ ద్వారా లొకేషన్‌ షేరింగ్‌లోకి వెళ్లాలి. ఒకవేళ ఎవరితోనైనా షేర్‌ చేసుకుంటు న్నట్టయితే వారి జాబితా కనిపిస్తుంది. వద్దనుకుంటే ప్రొఫైల్‌ మీద తాకి స్టాప్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని