వీక్షణ ఛాట్‌జీపీటీ

రోజురోజుకీ ఛాట్‌జీపీటీ కొత్తగా ముస్తాబవుతోంది. ఇటీవల పరిచయమైన విజన్‌ ఫీచరే దీనికి నిదర్శనం. మామూలుగానైతే ఛాట్‌జీపీటీలో వాక్యాలను టైప్‌ చేసి ప్రశ్నలను సంధిస్తుంటాం.

Updated : 11 Oct 2023 05:45 IST

రోజురోజుకీ ఛాట్‌జీపీటీ కొత్తగా ముస్తాబవుతోంది. ఇటీవల పరిచయమైన విజన్‌ ఫీచరే దీనికి నిదర్శనం. మామూలుగానైతే ఛాట్‌జీపీటీలో వాక్యాలను టైప్‌ చేసి ప్రశ్నలను సంధిస్తుంటాం. విన్‌ ఫీచర్‌ రాకతో ఇమేజ్‌లనూ అప్‌లోడ్‌ చేసే అవకాశం కలిగింది. ఉదాహరణకు- ఫ్రిజ్‌లోని కూరగాయల ఫొటోను అప్‌లోడ్‌ చేసి అవేంటి? వాటితో ఏయే వంటలు చేసుకోవచ్చు? అని అడిగారనుకోండి. ఇట్టే చెప్పేస్తుంది. సంక్లిష్ట గ్రాఫ్‌ ఇమేజ్‌లను అప్‌లోడ్‌ చేసి, వాటిని విశ్లేషించమనీ పురమాయించొచ్చు. ఇప్పటికే దీన్ని చాలామంది వాడుకుంటున్నారు. దీని సామర్థ్యాలను ఎవరెలా ఉపయోగించుకుంటున్నారో తెలిస్తే ఔరా అనాల్సిందే. అయితే ప్రస్తుతానికి ఛాట్‌జీపీటీ సదుపాయం ప్లస్‌, ఎంటర్‌ప్రైజ్‌ యూజర్లకే అందుబాటులో ఉంది. త్వరలో డెవలపర్లకూ విస్తరించొచ్చు.


నేర్చుకోవటానికి

విద్యార్థులకు, విషయాలను అవగతం చేసుకోవాలనుకునేవారికి విజన్‌ ఫీచర్‌ చేదోడుగా నిలుస్తుంది. అందుకే కొందరు ఇమేజ్‌ రూపంలో ఉన్న పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోవటానికి వాడుకుంటున్నారు. ఉదాహరణకు- మానవ కణం బొమ్మను అప్‌లోడ్‌ చేసి అందులో ఏయే భాగాలున్నాయి? అవెలా పనిచేస్తాయి? అని అడిగామనుకోండి. వాటన్నింటినీ పేర్లతో సహా వరుసగా పేర్కొంటుంది. వాటి పనితీరునూ సవివరంగా ముందుంచుతుంది. సైన్స్‌ పాఠాలను తేలికగా అర్థం చేసుకోవటానికి ఇంతకన్నా ఏం కావాలి?


సంక్లిష్ట సందేశాల వివరణ

కొన్నిసార్లు బొమ్మల్లో విషయమేంటో అర్థం కాదు. అలాంటప్పుడు దీని భావమేవి? అని తలగోక్కువటం మామూలే. ఇప్పుడు అలాంటి ఇబ్బంది అవసరం లేదు. ఇమేజ్‌ను అప్‌లోడ్‌ చేసి, అదేంటో వివరించమనీ ఛాట్‌జీపీటీని అడిగితే సరి. ఒక యూజర్‌ కొన్ని అర్థం కాని బొమ్మలతో కూడిన ఇమేజ్‌ను అప్‌లోడ్‌ చేసి దాని అర్థాన్ని వివరించమని కోరితే అన్ని అంశాలనూ విడివిడిగా, విశ్లేషణలతో పాటు పేర్కొని అబ్బుర పరిచింది.


సినిమా దృశ్యాల గుర్తింపు

ఛాట్‌జీపీటీ విజన్‌ మేధ అంతా ఇంతా కాదు. సినిమా దృశ్యాలనూ గుర్తించగలదు. ఒకతను ఓ ఇంగ్లిష్‌ సినిమా ఫొటోను అప్‌లోడ్‌ చేసి ‘ఇది ఏ సినిమాలోనిది? అతడు ఏమంటున్నాడు?’ అని అడిగాడు. అది గ్లాడియేటర్‌ సినిమాలోని దృశ్యమని చెప్పటమే కాదు.. ఆ పాత్ర పేరు, ఆ దృశ్యంలో అతడేం మాట్లాడాడో కూడా చిటికెలో వివరించింది. అంతా విజన్‌ మహత్తు.


కోడ్స్‌ రాయటానికీ

ఛాట్‌జీపీటీ మల్టీమోడల్‌ సామర్థ్యాలనూ యూజర్లు వెలికి తీస్తున్నారు. టీమ్‌తో చర్చించి, తెల్లబోర్డు మీద గీసిన పటాలను అప్‌లోడ్‌ చేసేస్తున్నారు. దానికి తగిన కోడ్‌ రాసే పనినీ అప్పగిస్తున్నారు. ఓస్‌.. ఇంతేనా? అని విజన్‌ కూడా చిటికెలో కోడ్‌ రాసి పడేస్తోంది. అంటే కంప్యూటర్‌ పోగ్రామ్‌కు సంబంధించి మనసులో ఏదైనా ఆలోచన మెదిలితే, దాన్ని కాగితమ్మీద బొమ్మ రూపంలో గీసి, ఛాట్‌జీపీటీకి అప్పగిస్తే చాలన్నమాట.


పార్కింగ్‌ సంకేతాల వివరణ

కొందరు సంక్లిష్ట పార్కింగ్‌ సంకేతాలనూ ఛాట్‌జీపీటికి అప్పగిస్తున్నారు. అక్కడ వాహనాలను నిలపొచ్చో, లేదో తెలపాలని అడుగుతున్నారు. ఛాట్‌జీపీటీ ఏమైనా తక్కువా తిందా? ఇలా అడగ్గానే అలా కచ్చితమైన సమాధానాలు ఇచ్చేస్తుంది. దీంతో పార్కింగ్‌ స్థలాల్లో జరిమానా పడకుండా కాపాడుకోవచ్చు మరి.


రెండో అభిప్రాయం

ఒక చిత్రకారుడు తాను గీసిన బొమ్మను మరింత వాస్తవంగా కనిపించటానికి ఏం చేయాలి? అని ఛాట్‌జీపీటీని ప్రశ్నించారు. అది అప్‌లోడ్‌ చేసిన బొమ్మలోని అంశాన్ని గుర్తించటంతో పాటు ఎక్కడ ఏయే మార్పులు చేయాలో సూచించి ఆశ్చర్యపరిచింది. మరో చిత్రం కోసం మంచి సూచనలూ చేసింది. ఇలా ఏ విషయం మీదైనా రెండో అభిప్రాయాన్ని తీసుకోవటానికి ఛాట్‌జీపీటీ  విజన్‌ను ఉపయోగించుకోవచ్చు. డాల్‌-ఇ సృష్టించిన బొమ్మలను విమర్శించటానికీ వాడుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని