అంతరిక్షం నుంచి సూర్య గ్రహణ వీక్షణ

భూమి మీది నుంచి సరే. అంతరిక్షంలోంచి చూస్తే సూర్య గ్రహణం ఎలా కనిపిస్తుంది? ఇదిగో ఈ ఫొటోలో మాదిరిగా కనిపిస్తుంది. నాసాకు చెందిన సోలార్‌ డైనమిక్స్‌ అబ్జర్వేటరీ (ఎస్‌డీఓ) తీసిన చిత్రమిది. సూర్యుడి ముందు నుంచి చంద్రుడు సాగిపోతున్నప్పుడు దీన్ని ఒడిసిపట్టింది. మొత్తం

Published : 13 Jul 2022 00:34 IST

భూమి మీది నుంచి సరే. అంతరిక్షంలోంచి చూస్తే సూర్య గ్రహణం ఎలా కనిపిస్తుంది? ఇదిగో ఈ ఫొటోలో మాదిరిగా కనిపిస్తుంది. నాసాకు చెందిన సోలార్‌ డైనమిక్స్‌ అబ్జర్వేటరీ (ఎస్‌డీఓ) తీసిన చిత్రమిది. సూర్యుడి ముందు నుంచి చంద్రుడు సాగిపోతున్నప్పుడు దీన్ని ఒడిసిపట్టింది. మొత్తం 35 నిమిషాల సేపు కొనసాగిన పాక్షిక సూర్య గ్రహణాన్ని రికార్డు చేసింది. గ్రహణం ఉచ్ఛ దశలో చంద్రుడు 67% వరకు సూర్యుడిని కప్పేశాడు. చంద్రుడి మీది పర్వతాలు సౌర జ్వాలలతో మండినట్టు గోచరించాయి. లివింగ్‌ విత్‌ స్టార్‌ కార్యక్రమంలో భాగంగా ఎస్‌డీఓను 2010లో నాసా ప్రయోగించింది. అప్పట్నుంచీ సూర్యుడిని నిశితంగా పరిశీలిస్తోంది. భూమితో పాటు మొత్తం సౌర మండలాన్ని సూర్యుడు తన శక్తితో ఎలా ప్రభావితం చేస్తాడనే దానిపై అధ్యయనం చేస్తోంది. సూర్యుడి అంతర్భాగం అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఇది సౌర వాతావరణాన్ని నియంత్రిస్తుంది. ఎస్‌డీఓ ఈ మొత్తం ప్రక్రియను.. అంటే సూర్యుడి అంతర్భాగం దగ్గర్నుంచి సౌర వాతావరణం వరకూ అన్నింటినీ పరిశీలించి, లెక్కిస్తుంది. ఇది అయస్కాంత శక్తికీ సూర్యుడి అంతర్భాగానికీ గల సంబంధమేంటి? అంతరిక్ష వాతావరణంపై ఇదెలా ప్రభావం చూపుతుంది? అనేవి అర్థం చేసుకోవటానికి తోడ్పడుతుంది. భూమి పై వాతావరణం ఆకృతి, కూర్పులను తీర్చిదిద్దే సూర్యుడి అతి నీలలోహిత కాంతి వికరణీకరణనూ ఎస్‌డీఓ లెక్కిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని