వీడియోలు చూసి నేర్చుకునే రోబోలు

రోబోలు తమకు తామే నేర్చుకుంటే? ప్రోగ్రామ్‌ సూచనల మేరకే కాకుండా అనూహ్య, కఠినమైన సందర్భాలు ఎదురైనప్పుడు వాటికి అనుగుణంగా నడుచుకుంటే? రోబోలకు ఇలాంటి సామర్థ్యాన్ని కల్పించటం మీద శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

Published : 30 Aug 2023 00:08 IST

రోబోలు తమకు తామే నేర్చుకుంటే? ప్రోగ్రామ్‌ సూచనల మేరకే కాకుండా అనూహ్య, కఠినమైన సందర్భాలు ఎదురైనప్పుడు వాటికి అనుగుణంగా నడుచుకుంటే? రోబోలకు ఇలాంటి సామర్థ్యాన్ని కల్పించటం మీద శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ దిశగా కార్నెగీ మెలన్‌ యూనివర్సిటీ పరిశోధకులు ముందడుగు వేశారు. మనం చేసే ఇంటి పనుల వీడియోలను రోబోలకు చూపించి, అవి వాటిని నేర్చుకునేలా చేయటంలో విజయం సాధించారు. పొయ్యి మీది నుంచి పాత్రను దించటం.. తలుపు, డ్రాయర్‌ తెరవటం.. కత్తులు, చెత్తబుట్ట వంటి పరికరాల వాడకం.. ఇలా 12 రకాల ఇంటి పనులు నేర్చుకునేలా తీర్చిదిద్దారు. నుదుటి మీదుండే కెమెరాతో వీడియో దృశ్యాలను చూస్తూ రోబోలు 25 నిమిషాల్లోనే కొత్త పనులను నేర్చుకోవటం గమనార్హం. శాస్త్రవేత్తలు అఫార్డెన్స్‌ అనే భావనతో.. అంటే ఆయా పనిముట్ల తీరును బట్టి వాటిని వాడుకోవటాన్ని నేర్చుకునే నైపుణ్య నమూనాను రూపొందించి, రోబోలకు ఆపాదించించారు. దీంతో అవి వీడియోలో మనుషులు ఆయా వస్తువులను పట్టుకునే తీరును అర్థం చేసుకొని, సమాచారాన్ని గ్రహించాయి. ఆయా పనులను చేయటానికి ఎలాంటి కదలికలు అవసరమో గుర్తించాయి. పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఆ కదలికలతోనే పూర్తి చేయగలిగాయి. వంట గది వాతావరణంలో రెండు రోబోలను 200 గంటల పాటు పరీక్షించారు. వంట గదుల్లో వేర్వేరు వాతావరణాలు ఉన్నప్పటికీ ఆయా వస్తువుల ఆకారం, తీరుతెన్నులను బట్టి రోబోలు వాటిని వాడటం నేర్చుకున్నాయి. అంటే కొత్త నైపుణ్యాన్ని వివిధ అవసరాలకు వాడుకోవటాన్ని నేర్చుకున్నాయన్నమాట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని