మ్యాక్‌కు సనోమా ఆకర్షణ!

మ్యాక్‌బుక్‌, మ్యాక్‌ స్టుడియో, ఐమ్యాక్‌, మ్యాక్‌ మినీ ప్రియులకు శుభవార్త. కొత్త మ్యాక్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కొత్త వర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. దీని పేరు సనోమా.

Updated : 04 Oct 2023 03:29 IST

మ్యాక్‌బుక్‌, మ్యాక్‌ స్టుడియో, ఐమ్యాక్‌, మ్యాక్‌ మినీ ప్రియులకు శుభవార్త. కొత్త మ్యాక్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కొత్త వర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. దీని పేరు సనోమా. ఇంటరాక్టివ్‌ డెస్క్‌టాప్‌ విడ్జెట్లు, వెబ్‌ యాప్స్‌, కొత్తరకం వీడియో కాన్ఫరెన్స్‌ వంటి ఫీచర్ల సమాహారంగా ఆసక్తి రేపుతోంది. మరి దీనిలోని కొన్ని ఫీచర్ల గురించి తెలుసుకుందామా.

అద్భుత స్క్రీన్‌సేవర్లు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందమైన ప్రాంతాల దృశ్యాలు స్లోమోషన్‌లో తెర మీద కనిపిస్తుంటే ఆ మజానే వేరు. యాపిల్‌ టీవీ గలవారికిది అనుభవమే. ఆకాశంలోంచి చిత్రీకరించిన విశాల వాల్‌పేపర్లు, స్క్రీన్‌ సేవర్లు ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇప్పుడివి మ్యాక్‌ పరికరాలకూ అందుబాటులోకి వచ్చాయి. ఇవీ యాపిల్‌ టీవీ మీద వీడియో స్క్రీన్‌సేవర్ల మాదిరిగానే పనిచేస్తాయి. కాకపోతే స్లీప్‌ మోడ్‌లోంచి బయటకు వచ్చినప్పుడు స్క్రీన్‌సేవర్‌ వేగం తగ్గుతుంది. లాగిన్‌ అయినప్పుడు డెస్క్‌టాప్‌ మీద నిశ్చల దృశ్యంగా మారుతుంది.

కొత్తగా వీడియో సమావేశం

దేనిమీదైనా ప్రజంటేషన్‌ ఇచ్చే సమయంలో స్క్రీన్‌ను షేర్‌ చేసినప్పుడు మాట్లాడేవారు నెమ్మదిగా కనిపించకుండా వెనక్కి వెళ్లిపోతారు. ఇలాంటి ఇబ్బందిని తొలగించటానికి ప్రజంటర్‌ ఓవర్లే ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఇది ప్రజంటేషన్‌ ఇచ్చేవారి ముఖాన్ని ఓవర్‌లే చేస్తుంది. అదీ ప్రజంటేషన్‌ కొనసాగుతుండగానే మాట్లాడేవారి ముఖం చిన్న బుడగలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. రియాక్షన్స్‌ ఫీచర్‌ మరో ఆకర్షణ. మధ్యలో ఆటంకం కలిగించకుండా ఎదుటివారి ప్రతిస్పందనలు తెలుసుకోవటానికి ఉపయోగపడే సదుపాయమిది. వీడియో ఎఫెక్ట్‌లూ మెరుగయ్యాయి. మ్యాక్‌లో వీడియో సమావేశం నిర్వహిస్తున్నప్పుడు స్టుడియో లైట్‌ సాయంతో నేపథ్యాన్ని నల్లగా మార్చొచ్చు. కంటిన్యూటీ కెమెరాతో పనిలేకుండానే ముఖం వెలుగుతున్నట్టు కనిపించేలా చేయొచ్చు.

స్క్రీన్‌ షేరింగ్‌ మెరుగ్గా..

మ్యాక్‌లో స్క్రీన్‌ షేరింగ్‌ ఆప్షన్‌ కొత్తదేమీ కాదు. ఇప్పటికే చాలామంది దీన్ని వాడుతున్నారు. యాపిల్‌ ఇప్పుడు దీన్ని మరింత సరళీకరించింది. ఓపెన్‌ చేసిన యాప్‌ల నుంచి కంటెంట్‌ను తేలికగా షేర్‌ చేసుకోవటానికి అవకాశం కల్పించింది. హై పర్‌ఫార్మెన్స్‌ మోడ్‌లోనైతే ఆడియో, వీడియో మధ్య జాప్యం లేకుండానూ చూసుకోవచ్చు. ఫేస్‌టైమ్‌, జూమ్‌, వెబెక్స్‌ వంటి వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌లన్నింటిలోనూ ఇది పనిచేస్తుంది. ఒక విండోనే కాదు.. ఏదైనా యాప్‌ లేదా పలు యాప్‌ల్లో అన్ని విండోలనూ షేర్‌ చేసుకోవచ్చు.

పాస్‌వర్డ్‌ మేనేజర్‌ పక్కాగా..

కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాస్‌వర్డ్‌లు, పాస్‌కీలు షేర్‌ చేసుకునే సదుపాయామూ వచ్చింది. సిస్టమ్‌ సెటింగ్స్‌లో పాస్‌వర్డ్స్‌ విభాగం కింద గ్రూప్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. పాస్‌వర్డ్‌లను షేర్‌ చేసుకోవాలనుకునే ఖాతాలను ఎంచుకోవచ్చు. దేనిలోనైనా మార్పులు చేస్తే అన్ని గ్రూపుల్లోనూ వెంటనే మారిపోతాయి. అందరి యాపిల్‌ పరికరాలకూ సింక్‌ అవుతాయి. కావాలనుకుంటే పాస్‌వర్డ్‌లను డిలీట్‌ చేయొచ్చు. ఎప్పుడైనా ఎవరినైనా గ్రూప్‌లోంచి తొలగించొచ్చు. పలు పరికరాల మధ్య పాస్‌వర్డ్‌ మేనేజర్లు తేలికగా సింక్‌ కావటం మరో మంచి ఫీచర్‌. ఆటోమేటిగ్గా పాస్‌వర్డ్‌ జనరేషన్‌కూ వీలుంది. మళ్లీ మళ్లీ వాడే పాస్‌వర్డ్‌ల గురించి హెచ్చరిస్తుంది కూడా. యాపిల్‌ ఐడీకి దానంతటదే పాస్‌కీ కూడా తోడవుతుంది. వెబ్‌లో యాపిల్‌ ఐడీతో సైన్‌ఇన్‌ అయ్యే సమయంలో దీన్ని వాడుకోవచ్చు.

టెక్స్ట్‌ కర్సర్‌ వినూత్నంగా..

ఐఓఎస్‌ను వాడుతున్న అనుభూతిని కలిగించటానికి, ఆకర్షణీయంగా కనిపించటానికి కర్సర్‌నూ మెరుగు పరచారు. టైప్‌ చేస్తున్న యాప్‌ రంగుకు అనుగుణంగా కర్సర్‌ రంగూ మారుతుంది. సనోమా మ్యాక్‌ పరికరంలో క్యాప్స్‌ లాక్‌ బటన్‌ను ఆన్‌ చేసినప్పుడు టెక్స్ట్‌ ఫీల్డ్‌లో కొత్తగా కర్సర్‌ పక్కన నీలం రంగు గుర్తు కనిపించటం విశేషం.

చురుకైన విడ్జెట్లు

ఐఫోన్‌ మాదిరిగా మ్యాక్‌ డెస్క్‌టాప్‌లోనూ విడ్జెట్లు ఇంటరాక్టివ్‌గా మారటం మరో ప్రత్యేకత. వెనకాల ఉన్న రంగుకు అనుగుణంగా వీటి ఛాయ దానంతటదే మారిపోతుంది కూడా. దీంతో డెస్క్‌టాప్‌ మరింత ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది. ఒకవేళ మరీ ఎక్కువగా విండోలను తెరచినా, స్టేజ్‌ మేనేజర్‌ను వాడుతున్నా ముందువైపున విడ్జెట్లు మరింత రంగుతో శోభిల్లుతాయి. దేనిమీదైనా ప్రత్యేకించి పనిచేస్తునప్పుడు వాటి రంగు మసక బారుతుంది. ప్రస్తుతమున్న ఫైళ్ల పక్కన విడ్జెట్లను పెడితే సిస్టమ్‌ దానంతటదే డెస్క్‌టాప్‌ మీద వాటికి అవసరమైన చోటును కల్పిస్తుంది. ఐఫోన్‌ యాప్స్‌ నుంచీ విడ్జెట్లను వాడుకోవచ్చు.

సఫారీ సరికొత్తగా..

బ్రౌజింగ్‌ దగ్గరికి వస్తే- ఇంటి అవసరాలు వేరు, ఆఫీసు వ్యవహారాలు వేరు. దీన్ని దృష్టిలో పెట్టుకునే వేర్వేరు అంశాలను వేర్వేరుగా బ్రౌజింగ్‌ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చారు. దీంతో వేర్వేరుగా సఫారీ ప్రొఫైల్స్‌ను సృష్టించుకోవచ్చు. ప్రతీ ప్రొఫైల్‌కూ హిస్టరీ, కుకీస్‌, ఎక్స్‌టెన్షన్స్‌, ట్యాబ్‌ గ్రూప్స్‌, ఫేవరెట్లు విడివిడిగానే ఉంటాయి. మ్యాక్‌, ఐఫోన్‌, ఐప్యాడ్‌ మధ్య ప్రొఫైల్స్‌ సింక్‌ అవుతాయి కూడా. ఇష్టమైన వెబ్‌సైట్లను సేవ్‌ చేసేలా వెబ్‌ యాప్‌ మారింది. ఈ సైట్లను డాక్‌లో చూసు కోవచ్చు. యాప్‌ను లోడ్‌ చేసినట్టుగానే వాడుకోవచ్చు.

డాక్యుమెంట్లలో ఆటోఫిల్‌

పత్రాలను త్వరగా నింపటానికి తోడ్పడే ఆటోఫిల్‌ మరింత మెరుగైంది. కొత్త న్యూరల్‌ నెట్‌వర్క్‌ సాయంతో సనోమా తెలివిగా డాక్యుమెంట్లను గుర్తిస్తుంది. వాటిల్లో నింపాల్సిన విషయాలను ప్రివ్యూలో చూపిస్తుంది. నోట్స్‌ కూడా అధునాతనంగా తయారైంది. ఇప్పుడు పీడీఎఫ్‌లను, స్కాన్‌ చేసిన డాక్యుమెంట్లను నేరుగా నోట్స్‌లోనే సమీక్షించుకోవచ్చు. ఒకే నోట్‌లో బోలెడన్ని పీడీఎఫ్‌లను చూసుకోవచ్చు. ఒక నోట్‌ నుంచి మరో నోట్‌కు త్వరగా లింక్‌ చేసుకునే సదుపాయమూ వచ్చింది. ఐడియాలు, కంటెంట్‌ వంటి వాటిని జోడించుకోవటానికిది ఎంతో ఉపయోగపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని