పట్టు సిలికాన్‌!

సిలికాన్‌ అకర్బన పదార్థం. పట్టు జీవ పదార్థం. ఇవి రెండూ కలిస్తే? టఫ్ట్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఇలాంటి విచిత్రాన్నే సృష్టించారు. మన ఫోన్లలోని మైక్రోప్రాసెసర్‌ చిప్స్‌లలో బోలెడన్ని సూక్ష్మ ట్రాన్సిస్టర్లుంటాయి.

Published : 29 Nov 2023 00:57 IST

సిలికాన్‌ అకర్బన పదార్థం. పట్టు జీవ పదార్థం. ఇవి రెండూ కలిస్తే? టఫ్ట్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఇలాంటి విచిత్రాన్నే సృష్టించారు. మన ఫోన్లలోని మైక్రోప్రాసెసర్‌ చిప్స్‌లలో బోలెడన్ని సూక్ష్మ ట్రాన్సిస్టర్లుంటాయి. ఇవన్నీ సిలికాన్‌, బంగారం, రాగి వంటి లోహాలతోనే తయారవుతాయి. ఇన్సులేటర్లతో కూడిన ఇవి విద్యుత్తు సాయంతో సమాచారాన్ని ఒకట్లు లేదా సున్నాలు.. ఇలా బిట్స్‌ రూపంలోకి మారుస్తాయి. దీని మూలంగానే సమాచార పంపిణీ, నిల్వ సాధ్యమవుతుంది. ట్రాన్సిస్టర్లను తయారుచేసే లోహాలు సేంద్రియ పదార్థాలు కావు. చెట్లు, జంతువులు, మనుషుల మాదిరిగా పర్యావరణ ప్రభావానికి క్షీణించవు. మరి ట్రాన్సిస్టర్లలో వాడే ఇన్సులేటర్లూ సజీవ కణజాలం మాదిరిగా క్షీణిస్తే? టఫ్ట్స్‌ యూనివర్సిటీకి చెందిన సిల్క్‌ల్యాబ్‌ సాధించిన ఘనత ఇదే. పట్టు ఇన్స్‌లేటర్లతో కూడిన ట్రాన్సిస్టర్లను రూపొందించి ఆశ్చర్యపరచింది. పట్టు దారాల్లో ఫిబ్రాయిన్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది. దీన్ని లోహాల ఉపరితలాల మీద కచ్చితంగా స్థిరపడేలా చేయటంలో పరిశోధకులు విజయం సాధించారు. ఇతర రసాయనాలు, జీవాణువులతో తేలికగా దీని గుణాలను మార్చేయొచ్చని నిరూపించారు. శరీరంలో, పర్యావరణంలో తలెత్తే మార్పులకు ఈ పట్టు దారాలు సత్వరం స్పందిస్తాయి. దీని సాయంతోనే టఫ్ట్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు హైబ్రిడ్‌ ట్రాన్సిస్టర్లతో వినూత్న బ్రెత్‌ సెన్సర్‌ను రూపొందించారు. ఇది తేమలో తలెత్తే మార్పులను అతి త్వరగా గుర్తిస్తుంది. అంతేకాదు.. పట్టు పొరకు మరికొన్ని మార్పులు చేసి గుండె, ఊపిరితిత్తులు, గురక వంటి సమస్యలను గుర్తించేలా తీర్చిదిద్దారు కూడా. ఇది శ్వాసలో కార్బన్‌ డయాక్సైడ్‌ వంటి వాయువులు, అణువులనూ పసిగట్టగలదు. ఇలా ఆయా జబ్బుల నిర్ధరణకూ తోడ్పడగలదు. రక్తంలోని ప్లాస్మా ద్రవాన్ని విశ్లేషించటం ద్వారా రక్తంలో ఆక్సిజన్‌, గ్లూకోజు, యాంటీబాడీల మోతాదులనూ తెలియ జేస్తుంది. ఇన్సులేటర్‌గా పనిచేసే ఈ పట్టు పొరను మైక్రోపాసెసర్లలోనూ వాడుకోవచ్చు. కాకపోతే నానోస్కేల్‌లో తయారు చేయటమే సవాలుగా నిలుస్తోంది. దీన్ని అధిగమిస్తే ప్రస్తుతం వాణిజ్యపరంగా అందు బాటులో ఉన్న ప్రాసెసర్లలో వాడుకోవటమూ సాధ్య మవుతుంది. కృత్రిమ మేధకు వాడే న్యూరల్‌ నెట్‌వర్క్స్‌ గానూ ‘పట్టు సిలికాన్‌’ ఉపయోగపడగలదని భావిస్తున్నారు. అప్పుడు తమకు తామే నేర్చుకునే సర్క్యూట్ల తయారీకి సైతం అవకాశముంటుంది. అంటే సమాచారాన్ని విడిగా స్టోరేజీ విభాగంలో కాకుండా నేరుగా ట్రాన్సిస్టర్లలోనే మెమరీని నమోదు చేయటానికి మార్గం సుగమమవుతుందన్నమాట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని