Whatsapp: 23 లక్షలకు పైగా భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్‌

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న 23 లక్షలకు పైగా అకౌంట్లను ఆగస్టులో వాట్సాప్‌ నిషేధించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వీటిలో 10 లక్షలకుపైగా ఖాతాలను ముందస్తుగానే నిషేధించినట్లు చెప్పుకొచ్చింది..

Published : 01 Oct 2022 23:25 IST

దిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న 23 లక్షలకు పైగా అకౌంట్లను ఆగస్టులో వాట్సాప్‌ నిషేధించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వీటిలో 10 లక్షలకుపైగా ఖాతాలను ముందస్తుగానే నిషేధించినట్లు చెప్పుకొచ్చింది. అయితే జులైలో కంటే ఆగస్టులో నిషేధించిన ఖాతాలే తక్కువ. ఈ ఏడాది జులైలో 23.87లక్షలకు పైగా ఖాతాలను వాట్సాప్‌ నిషేధించింది.

‘‘ ఆగస్టు 1, 2022 నుంచి ఆగస్టు 31, 2022 మధ్య కాలంలో భారత్‌కు చెందిన 23,28,000 ఖాతాలపై నిషేధం విధించాం. వీటిలో 10,08,000 ఖాతాలను ముందస్తుగానే నిషేధించాం’’ అని వాట్సాప్‌ తన నెలవారీ నివేదికలో పేర్కొంది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సంస్థ సాంకేతికత ఆధారంగా గుర్తించిన  మేరకు జూన్‌ నెలలో భారత్‌కు చెందిన దాదాపు 22 లక్షలకు పైగా ఖాతాలను వాట్సాప్‌ తొలగించింది. మేలో 19 లక్షలు, ఏప్రిల్‌ లో 18.05 లక్షల ఖాతాలను తొలగించినట్లు తెలిపింది.

సోషల్‌ మీడియాలో అవాస్తవాలు, అశ్లీలత విస్తరిస్తున్న నేపథ్యంలో గత ఏడాది నుంచి భారత్‌లో కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చిన విషయం తెలసిందే. దీని ప్రకారం 50 లక్షలకు పైగా యూజర్లు ఉన్న డిజిటిల్‌ ప్లాట్‌ఫామ్స్‌ అన్నీ ప్రతినెలా నివేదికను వెల్లడించాల్సి ఉంటుంది. అందులో నిబంధనలను అతిక్రమించిన ఎంతమందిని గుర్తించారో? వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాల్సి ఉంటుంది. తాజా నివేదిక ప్రకారం ఆగస్టు నెలలో 598 ఫిర్యాదులు అందగా..వాటిలో 19 మందిపై చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని