Hyderabad Metro: కనికరం చూపలేదు.. అమ్మకు చోటులేదు!

 ఒడిలో పసికందుతో మెట్రోరైలు ఎక్కిందా మహిళ. అప్పటికే సీట్లన్నీ నిండిపోయాయి. అక్కడ కూర్చున్న వారిలో యువతులు, మహిళలే ఎక్కువగా ఉన్నారు. చేతుల్లో శిశువుతో ఉన్న ఆ అమ్మను చూసి చూడనట్టుగా ఉండిపోయారు. కదిలే రైలులో పసిబిడ్డతో ఆ అమ్మ ఎక్కువ సేపు నిలబడలేకపోయింది

Updated : 26 Oct 2021 13:16 IST


మెట్రోరైలులో పసికందుతో కింద కూర్చున్న మహిళ

ఈనాడు, హైదరాబాద్‌:  ఒడిలో పసికందుతో మెట్రోరైలు ఎక్కిందా మహిళ. అప్పటికే సీట్లన్నీ నిండిపోయాయి. అక్కడ కూర్చున్న వారిలో యువతులు, మహిళలే ఎక్కువగా ఉన్నారు. చేతుల్లో శిశువుతో ఉన్న ఆ అమ్మను చూసి చూడనట్టుగా ఉండిపోయారు. కదిలే రైలులో పసిబిడ్డతో ఆ అమ్మ ఎక్కువ సేపు నిలబడలేకపోయింది. కింద కూర్చుని.. ఒళ్లో బిడ్డను ఉంచుకుని గమ్యం వరకూ ప్రయాణించింది. హైదరాబాద్‌ మెట్రోలో జరిగిన సంఘటనను ఎవరో వీడియోతీసి ‘గ్రేట్‌ ఎడ్యుకేటెడ్‌ ఉమెన్‌ ఇన్‌ హైదరాబాద్‌’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. గర్భిణులు.. చంటిపిల్లలతో ఉన్న మహిళలు కనిపించగానే కూర్చున్న సీటును ఇవ్వటం సాధారణంగా చూస్తుంటాం. మెట్రోరైలులో అక్కడ ఉన్న ఏ ఒక్కరూ స్పందించకపోవటం.. బాలింత అనే కనికరం చూపకపోవటంపై నెటిజన్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంత పెద్దచదువులు పూర్తిచేసిన మహిళలు.. కనీస మానవత్వం చూపకపోవటం దారుణమంటున్నారు. మెట్రోరైలులో జరిగిన ఘటనపై హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ఎండీ ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి స్పందించారు. ఇది బాధాకరం. తోటి ప్రయాణికులు సీటిచ్చి సహకరించాల్సి ఉంది. అలా చేయకపోవటం బాధగా అనిపించింది. మనం కట్టుబడి ఉన్న సామాజిక విలువలను ప్రశ్నించేదిగా ఉంది. పసికందును భద్రంగా పట్టుకుని కిందకూర్చుని ప్రయాణించిన ఆమెలో నిజమైన భారతీయ మాతృ హృదయ గొప్పతనం కనిపించిందంటూ ప్రశంసించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని