Published : 28/11/2021 05:04 IST

కలగానే.. కొత్త బస్సుల కొనుగోలు!

సర్కారిచ్చే నిధులూ అరకొరే
ఆర్టీసీలో డొక్కు బండ్లే  లెక్కకు మిక్కిలి
ఫెమా-2 పథకాన్నీ వినియోగించుకోని తీరు

కొండలా పేరుకుపోతున్న అప్పులు, వెంటాడుతున్న నష్టాలు.. వెరసి ఆర్టీసీలో నూతన బస్సుల కొనుగోలు అంశం తీరని కలగానే మిగిలింది.. మరోవంక.. సంస్థలో కాలం చెల్లిన బస్సుల సంఖ్య పెరుగుతోంది.. పాత బండ్లకు రంగులద్ది నెట్టుకొచ్చే దైన్యస్థితి కొనసాగుతోంది. కొత్త బస్సుల కొనుగోలుకు రాష్ట్ర సర్కారిచ్చే నిధులూ అరకొరగానే ఉన్నాయి.

గతమే ఘనం.. నేడంతా దైన్యం!

తెలంగాణ ఆర్టీసీలో గతంలో సుమారు 12వేల వరకు బస్సులు ఉండేవి. ఇపుడున్నవి 9,708 మాత్రమే.. వాటిలోనూ 3,107 అద్దె బస్సులే. 2014 నుంచి 4,991 బస్సులను కాలం చెల్లినవిగా భావించి తొలగించారు. పక్కన పెట్టాల్సినవి మరో 1,200 వరకు ఉన్నట్లు అంచనా. అధికారికంగా అలాంటి 854 బస్సులను గుర్తించారు. ఉన్నవాటిలోనూ సుమారు 30శాతం వాహనాలు 13లక్షల కిలోమీటర్లకు మించి తిరిగినవే. ఒక్కో బస్సు 15 ఏళ్లు నడపాలనుకుంటే ఏటా 750 బస్సుల వరకు కొనాలని, ఇందుకయ్యే వ్యయం రూ.300 కోట్ల మించదన్నది నిపుణుల అంచనా. కర్ణాటక, తమిళనాడులు కొత్త బస్సులను సమకూర్చుకుంటున్నాయి. మూడేళ్లలో కొత్త బస్సుల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ రూ.1000 కోట్ల వెచ్చించినట్లు సమాచారం.

కొన్నది 1,826 బస్సులే..

గత అయిదేళ్లలో తెలంగాణ ఆర్టీసీ కొనుగోలు చేసింది 1,826 బస్సులే. అందులో 200 వరకు మినీ బస్సులున్నాయి. కాలుష్య కట్టడికి అనువుగా కేంద్రం ప్రవేశపెట్టిన ఫెమా-1 పథకం కింద సమకూరిన బ్యాటరీ ఆధారిత బస్సులు 40 ఉన్నాయి. ఫెమా-2 పరిధిలో హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లకు మరిన్ని బస్సులు లభించే అవకాశమున్నా సర్కారు సద్వినియోగం చేసుకోలేదు. ఇక కాలనీల కోసం ప్రవేశపెట్టిన మినీ వజ్ర ఏసీ బస్సుల్లో సింహభాగం ఐరావతాల్లా మారాయి. వాటిని విక్రయించాలని నిర్ణయించినా వ్యవహారం కొలిక్కి రాలేదు. హైదరాబాద్‌లో నడిపేందుకు వీలుగా 80 వరకు మెట్రో లగ్జరీ బస్సులను 2014లో కొన్నారు. ఏసీ బస్సులుగా నగరంలో తిప్పారు. వాటికి మార్పులుచేర్పులు చేసి దూరప్రాంతాలకు వెళ్లే రాజధాని బస్సులుగా నడుపుతున్నారు. కరోనా కారణంగా హైదరాబాద్‌లో సుమారు 900 బస్సులను తగ్గించారు. ప్రస్తుతం 2,850 వరకు తిరుగుతున్నాయి. ఇక్కడున్న వాటిలో సగం బస్సుల్ని మార్చాల్సి ఉందని ఉద్యోగ వర్గాలు చెప్తున్నాయి.


ప్రజాప్రతి‘నిధులు’ తలచుకుంటే..

ప్రస్తుతం ఆర్టీసీకి ఉత్సాహవంతులైన ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్లు ఉన్నారు. వారు చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కలవాలి. వారికుండే నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి నూతన బస్సుల కొనుగోలుకు కొంత మొత్తం రాబట్టగలిగితే ఆర్టీసీ, ప్రభుత్వంపైనా భారం పడకుండా ఉంటుంది. సామాజిక బాధ్యత(కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) కింద ఆదాయ పన్ను మినహాయింపు ఉన్న నేపథ్యంలో నిధులు సమీకరించి నూతన బస్సులు కొనాలి.

- ఎం.నాగేశ్వరరావు, ఆర్టీసీ మాజీ డైరెక్టర్‌

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని