Software Employees: ప్రమాదంలో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం

ఐటీ రంగంలో ఉద్యోగుల ఆరోగ్యం ఆందోళనకు గురిచేస్తోంది. ఒత్తిడితో కూడిన పనివిధానం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, గంటలకొద్దీ కూర్చొని పనిచేయడం ద్వారా పలు రోగాలను కొనితెచ్చుకుంటున్నారని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) హెచ్చరించింది.

Updated : 19 Aug 2023 08:07 IST

46 శాతం మంది జీవనశైలి వ్యాధులకు గురయ్యే అవకాశం
78 శాతం మంది వ్యాయామానికి దూరం
ఎన్‌ఐఎన్‌ అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ రంగంలో ఉద్యోగుల ఆరోగ్యం ఆందోళనకు గురిచేస్తోంది. ఒత్తిడితో కూడిన పనివిధానం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, గంటలకొద్దీ కూర్చొని పనిచేయడం ద్వారా పలు రోగాలను కొనితెచ్చుకుంటున్నారని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) హెచ్చరించింది. హైదరాబాద్‌ నగర కేంద్రంగా ప్రముఖ ఐటీ సంస్థల్లో పని చేస్తున్న 183 మంది ఐటీ ఉద్యోగులపై అధ్యయనం చేయగా ఆ వివరాలు అంతర్జాతీయ పీర్‌ రివ్యూడ్‌ జర్నల్‌ ‘న్యూట్రియంట్స్‌’ ఆగస్టు 2023 సంచికలో ప్రచురితమయ్యాయి. రీసెర్చ్‌ స్కాలర్‌ పరోమితా బెనర్జీ పరిశోధన పత్రం ఆధారంగా ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తల బృందం డా. సుబ్బారావు ఎం గవరవరపు, డా. భానుప్రకాష్‌రెడ్డి మరింత లోతుగా అధ్యయనం చేశారు. ఎన్‌ఐఎన్‌ శుక్రవారం మీడియాకు ఈ వివరాలను వెల్లడించింది. ఈ అధ్యయనం 46 శాతం మంది జీవనశైలి వ్యాధులబారిన పడే ప్రమాదంలో ఉన్నారని తేల్చి చెప్పింది. ప్రతి 10 మందిలో ముగ్గురు రక్తపోటు, ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులబారిన పడుతున్నారని పేర్కొంది. 

నడుము చుట్టుకొలత ఎక్కువ కలిగిన వారూ ఉన్నారంది. మగవారిలో 90 సెంటీమీటర్లు(సుమారు 36 అంగుళాలు), ఆడవారిలో 80 సెంటీమీటర్ల(సుమారు 32 అంగుళాలు) చుట్టుకొలత కంటే ఎక్కువ ఉంటే.. జీవనశైలి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఎన్‌ఐఎన్‌ చెప్పింది.

ఐటీ సంస్థల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు అవసరం

మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, తగిన విశ్రాంతి పద్ధతులను అలవర్చడానికి ప్రతి ఐటీ సంస్థలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఎన్‌ఐఎన్‌ ప్రస్తావించింది. తరచూ ఆరోగ్య పరీక్షలు చేసి.. తదనుగుణంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చవచ్చని పేర్కొంది.

  • సగటున 8 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చునే పని చేస్తున్నారని వెల్లడించింది.
  • 78 శాతం మంది వ్యాయామం, శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని, కేవలం 22 శాతం మంది ఉద్యోగులు మాత్రమే వారంలో నిర్దేశించిన 150 నిమిషాల పాటు శారీరక శ్రమ(వ్యాయామం) చేస్తున్నారని పేర్కొంది.
  • 26 నుంచి 35 ఏళ్ల లోపు వయసు వారు కూడా ఊబకాయం, రక్తపోటు, మధుమేహం బారినపడే ప్రమాదంలో ఉన్నారని హెచ్చరించింది.
  • తరచూ బయట తినడం, రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవడం, భోజనంలో సమయపాలన పాటించకపోవడం, లేదంటే భోజనం మానేయడం వంటి అలవాట్లు ఐటీ ఉద్యోగులను దీర్ఘకాలిక వ్యాధులబారిన పడేట్టు చేస్తున్నాయని ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డా.హేమలత తెలిపారు.
  • 30 సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్న సీనియర్‌ ఉద్యోగుల్లో ఒత్తిడి అధికంగా ఉందని.. వారిలో జీవనశైలి ప్రమాద కారకాలు ఎక్కువగా కనిపించాయని ఈ అధ్యయన ప్రాజెక్టుకు ప్రధాన పరిశోధకులు, సీనియర్‌ శాస్త్రవేత్త డా. సుబ్బారావు ఎం గవరవరపు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని