నిపుణులైన కార్మికులకు ఇజ్రాయెల్‌ ఆహ్వానం.. జీతమెంతో తెలుసా?

ఇజ్రాయెల్‌ తమ దేశంలో మౌలిక సదుపాయాలను భారీగా విస్తరించుకునే క్రమంలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టులతో భారతీయ కార్మికులకు ఉపాధి అవకాశాలు అందివస్తున్నాయి.

Updated : 20 Jan 2024 08:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇజ్రాయెల్‌ తమ దేశంలో మౌలిక సదుపాయాలను భారీగా విస్తరించుకునే క్రమంలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టులతో భారతీయ కార్మికులకు ఉపాధి అవకాశాలు అందివస్తున్నాయి. ఆ దేశంలో నిర్మాణ రంగంలో నిపుణులైన కార్మికులకు డిమాండ్‌ పెరిగింది. దీంతో నమ్మకమైన దేశాల నుంచి నైపుణ్యం కలిగిన మానవ వనరులను నియమించుకోవాలని ఆ దేశం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు ఉత్తరాది రాష్ట్రాల్లో కార్మికుల కోసం రిక్రూట్‌మెంట్‌ మొదలుపెట్టింది. తెలంగాణలో నుంచి 10 వేల మంది కార్మికులను తీసుకోవాలని భావిస్తోంది. వచ్చే నెలలో రాష్ట్రంలో ఇజ్రాయెల్‌ అధికారులు నైపుణ్య పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ (టామ్‌కామ్‌) అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆ పరీక్షల్లో విజయం సాధించిన కార్మికుల వ్యక్తిగత, కుటుంబ వివరాలను పోలీస్‌ వెరిఫికేషన్‌ ద్వారా పరిశీలించి వర్క్‌ వీసాలు మంజూరుచేస్తారు. ఇజ్రాయెల్‌లో నిర్మాణ రంగంలో పనిచేసేందుకు ఎంపికైన కార్మికుల కోసం స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌) నిర్ణయించింది.

నెలకు రూ.1.37 లక్షల వేతనం...

సంక్షోభ సమయాల్లో పలు దేశాల్లో భారతీయ కార్మికులు పనిచేశారు. ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన అనేక మందికి పశ్చిమాసియా దేశాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఇజ్రాయెల్‌లో కార్మికుల కోసం ఆ దేశ ప్రతినిధులు టామ్‌కామ్‌ అధికారులను సంప్రదించినపుడు ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఎవరైనా వెళతారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే టామ్‌కామ్‌ అధికారులు నిజామాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌లో చేపట్టిన ఉద్యోగ మేళాలకు భారీ స్పందన వచ్చింది. అక్కడ పనిచేసేందుకు దాదాపు రెండువేల మందికి పైగా దరఖాస్తు చేశారు. వీటిని టామ్‌కామ్‌ అధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే పూర్వ మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ జిల్లాల్లో నియామక డ్రైవ్‌లు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుభవజ్ఞులైన కార్మికులకు నెలకు రూ.1.37 లక్షల వేతనం వచ్చే అవకాశం ఉంది. ‘ఈ విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దు. నియామకాల కోసం టామ్‌కామ్‌ అవసరమైన సహాయం చేస్తుంది. ఇజ్రాయెల్‌ వెళ్లేందుకు విమాన టికెట్‌, వైద్యపరీక్షలు మినహా ఇతర ఖర్చులేమీ ఉండవు. టామ్‌కామ్‌ ద్వారా విదేశాలకు వెళ్లిన వారికి ఉద్యోగ, సామాజిక భద్రత ఉంటుంది’ అని టామ్‌కామ్‌ అధికారులు తెలిపారు.


ఉద్యోగావకాశాలు ఇలా...

రంగాలు : ఫ్రేమ్‌వర్క్‌, షట్టరింగ్‌ కార్పెంటర్‌, ఐరన్‌ బెండింగ్‌, సిరామిక్‌ టైల్‌, ప్లాస్టరింగ్‌

నెలవారీ వేతనం : 6,100 ఇజ్రాయెలీ న్యూషెకల్‌ (దాదాపు రూ.1,37,260పైగా)

అర్హతలు : కనీసం పదోతరగతి ఉత్తీర్ణత, సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవం

వయోపరిమితి : 25-45 ఏళ్లు.

కాలపరిమితి : తొలుత ఏడాది... అవసరమైతే పనికాలాన్ని పొడిగిస్తారు.

పని గంటలు : రోజుకు 9 గంటలు పనిచేయాలి. ఎక్కువ గంటలు పనిచేస్తే నిబంధనల ప్రకారం ఓవర్‌టైమ్‌ చెల్లిస్తారు.

నిబంధనలు : ఆహారం, వసతి, విమాన టికెట్ల ఖర్చులు కార్మికుడు భరించాలి. వసతి, భోజనం కోసం నెలకు 278-449 ఇజ్రాయెలీ న్యూషెకల్‌ వేతనం నుంచి మినహాయిస్తారు.
అర్హులైన కార్మికులు వ్యక్తిగత వివరాలను tomcom.resume@gmail.com కు మెయిల్‌ చేయాలి. మరిన్ని వివరాలకు 7893566493, 9849639539, 9100798204 లేదా 040-23342040 నంబర్లలో సంప్రదించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని