నూతన హైకోర్టుకు నేడు సీజేఐ శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ బుధవారం సాయంత్రం 5.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.

Updated : 27 Mar 2024 05:28 IST

సాయంత్రం 5.30కు ముహూర్తం

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ బుధవారం సాయంత్రం 5.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధేతో సమావేశం సందర్భంగా హైకోర్టు కొత్త భవనానికి భూమిని కేటాయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించారు. ఆ వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. న్యాయశాఖ, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌లు భూమి కేటాయింపు కోరుతూ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బుద్వేల్‌లోని వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం డిసెంబరులో ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టును కొత్త భవనంలోకి తరలించిన తరువాత పాత హైకోర్టు భవనాన్ని చారిత్రక కట్టడంగా పరిరక్షిస్తూ సివిల్‌ కోర్టు అవసరాలకు వినియోగించనున్నట్లు సీఎం ప్రకటించారు. 2009లో అగ్ని ప్రమాదానికి గురైన సమయంలో హైకోర్టును తరలించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అప్పట్లో బుద్వేల్‌తోపాటు చంచల్‌గూడ సమీపంలోని ప్రింటింగ్‌ ప్రెస్‌, సోమాజిగూడ, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో స్థలాల పరిశీలన జరిగింది. అయితే ప్రస్తుతం నిర్ణయించిన స్థలంలో ఆధునిక వసతులతో హైకోర్టు భవనంతోపాటు న్యాయమూర్తులకు నివాస సముదాయాన్ని కూడా నిర్మించనున్నారు. బుధవారం జరగనున్న శంకుస్థాపన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌తోపాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్‌లు పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు