నిరాటంకంగా నీటి సరఫరాకు సర్కారు చర్యలు

రాష్ట్రంలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారించి నిరాటంకంగా సరఫరా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది.

Published : 16 Apr 2024 03:38 IST

 మిషన్‌ భగీరథ ప్రధాన గ్రిడ్‌లో పంపుసెట్లకు మరమ్మతులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారించి నిరాటంకంగా సరఫరా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. పైపులైన్ల లీకేజీలను అరికట్టడంతో పాటు పంపుసెట్లు, బోరుబావుల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తోంది. మిషన్‌ భగీరథ పథకంలోని ప్రధాన గ్రిడ్‌లో మొత్తం 1,776 పంపుసెట్లు ఉండగా.. వేసవిలో 327 కాలిపోయాయి. వాటిలో 245కి మరమ్మతులు పూర్తయ్యాయి. మరో 82 పంపుసెట్ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. ట్యాంకులు, బావుల వద్ద ఉన్న 8,683 సింగిల్‌ ఫేజ్‌ పంపుసెట్లు, ట్యాంకుల వద్ద ఉన్న 6,025 పంపుసెట్లు, బావుల వద్ద ఉన్న 605 పంపుసెట్లకు మరమ్మతు చేశారు. భూగర్భజలాలు అడుగంటడంతో పాటు అధిక వినియోగం వల్ల పనిచేయని బోర్లలో 19,605 బోర్లకు ప్రభుత్వం మరమ్మతు చేయించింది. 662 చోట్ల పైపులైన్లకు లీకేజీలు ఏర్పడగా.. వాటిని మూసివేయించింది.

స్థానిక వనరుల నుంచి..

మోటార్లు కాలిపోయినప్పుడు, పైపులైన్ల లీకేజీలు ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయంగా స్థానికంగా ఉన్న నీటి వనరుల నుంచి ప్రభుత్వం సరఫరా చేస్తోంది. గ్రామాల్లో ఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయిస్తోంది. ప్రత్యామ్నాయ అవసరాల కోసం రైతులకు చెందిన 6,982 బోర్లను అద్దెకు తీసుకుంది. గ్రామాలకు నీటి సరఫరాలో ఆటంకాలు ఏర్పడినప్పుడు వాటిని వినియోగిస్తోంది.

నిధుల విడుదల

తాగునీటి అవసరాల కోసం కలెక్టర్లకు ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. దీంతోపాటు 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రత్యేక అభివృద్ధి నిధులను వాడుకునేందుకూ అనుమతించింది. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతిరోజు నీటిసరఫరా స్థితిగతులను పర్యవేక్షిస్తోంది. ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదుల పరిష్కార విభాగం ఏర్పాటు చేసింది. వచ్చిన ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తోంది. నీటి సరఫరాపై సమీక్ష కోసం పది ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రత్యేకాధికారులుగా నియమించిన పది మంది ఐఏఎస్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.


పాలేరుకు 2 టీఎంసీలు

తాగునీటి అవసరాల కోసం ఇప్పటికే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి 2 టీఎంసీల నీటిని పాలేరు రిజర్వాయర్‌కు విడుదల చేశారు. ఉదయసముద్రం రిజర్వాయర్‌, పెండ్లిపాకాల రిజర్వాయర్లను నింపారు. దుమ్ముగూడెం, తుపాకులగూడెం రిజర్వాయర్లకు నీటిని విడుదల చేశారు. సాగర్‌, ఎల్లంపల్లి, శ్రీశైలం నుంచి అత్యవసర పంపింగ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని