Paddy Cultivate: వరి పంట వద్దేవద్దు

ఈ యాసంగిలో రైతులు వరి వేయవద్దని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయబోదని స్పష్టం చేశారు. వరికి బదులు పత్తి, ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అభ్యర్థించారు. 

Updated : 24 Sep 2022 16:40 IST

యాసంగిలో వేస్తే కొనుగోలు చేయం
ఇదే రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయం
బియ్యంపై కేంద్రం చేతులెత్తేసింది
రాష్ట్రం కొనే పరిస్థితి లేదు
మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టీకరణ
వానాకాలం ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని వెల్లడి

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి. పక్కన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఈ యాసంగిలో రైతులు వరి వేయవద్దని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయబోదని స్పష్టం చేశారు. వరికి బదులు పత్తి, ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అభ్యర్థించారు.  ఉప్పుడు బియ్యం ఎఫ్‌సీఐ కొనుగోలు చేయదంటూ కేంద్రం స్పష్టం చేసిందని.. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరిని కొనే పరిస్థితి లేదని, ఎగుమతులు కూడా మన పరిధిలో లేవని, రైతులు అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. కంపెనీలతో ఒప్పందం మేరకు విత్తన వడ్లు సాగు చేసే రైతులు, మిల్లర్లతో అవగాహన గల వారు నిరభ్యంతరంగా వరి సాగు చేసుకోవచ్చన్నారు. విపక్షాలు రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయని.. అన్నదాతలు వారి చేతుల్లో పావులుగా మారవద్దని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని చెప్పారు. ప్రస్తుత వానాకాలం వరి పంటను ఎఫ్‌సీఐ కొనకున్నా ప్రభుత్వం అండగా నిలుస్తుందని.. దొడ్డు వడ్లయినా, సన్నరకాలైనా కొనుగోలు చేస్తామని చెప్పారు. నిరంజన్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.

‘వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నానా యాగీ చేస్తోంది.  తన చేతగానితనాన్ని రాష్ట్రాల మీదకు నెడుతోంది. వ్యవసాయ ఉత్పత్తులను కొనే బాధ్యత కేంద్రానిదే. వానాకాలం పంటలో కేంద్రం ఎంత కొన్నా... మిగతాది రాష్ట్ర అవసరాలకు, మిల్లర్ల వ్యాపారానికి వినియోగం అవుతుంది. యాసంగిలో ఉప్పుడు (దొడ్డు) బియ్యం కొనేది లేదని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎఫ్‌సీఐ నొక్కి చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే కొని వాడే పరిస్థితి లేదు. ఎగుమతులు సాధ్యం కానందున రైతుల బాగు కోసం వరి సాగు వద్దని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది కేంద్రం మాట ఇచ్చిన నేపథ్యంలో తీసుకున్న ధాన్యంలోనే ఇంకా 5 లక్షల మెట్రిక్‌ టన్నులు తెలంగాణ ప్రభుత్వం వద్ద మూలుగుతున్నాయి. కేంద్రం బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శనం. దేశంలో పంటల కొనుగోళ్ల విషయంలో వారికి ఒక విధానం లేదు. తెలంగాణ ప్రభుత్వం చెప్పేది అబద్ధమనుకుంటే.. యాసంగిలో కొనుగోళ్లు ఉంటాయని భాజపా ప్రజాప్రతినిధులు కేంద్రం నుండి లిఖితపూర్వక హామీ తీసుకురావాలి. భారత ఆహారరంగాన్ని కార్పొరేట్లు, ప్రైౖవేటుపరం చేసే కుట్రలో భాగంగా కేంద్రం కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పుకొంటోంది. విపత్కర పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో వరి వేయవద్దు.. ప్రభుత్వం కొనలేదని బద్నాం చేయొద్దు.

పత్తి కోటి ఎకరాల్లో వేసినా..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిండు మనసుతో వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దారు. ఆయన కృషి ఫలితమే తెలంగాణలో పెద్దఎత్తున పంటల దిగుబడి వస్తోంది. ఈ వానాకాలం ఎక్కువగా పత్తి సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశాం. కానీ, అనుకున్నంతగా పత్తి వేయలేదు. ఈ రోజు మద్దతు ధరకు మించి మూడు వేలు ఎక్కువగా పత్తి ధర పలుకుతోంది. కోటి ఎకరాలలో పత్తి సాగు చేసినా రైతులకు మద్దతు ధర దక్కుతుంది. కామారెడ్డిలో రైతు మరణం దురదృష్టకరం. ప్రభుత్వం ఈ ఘటనపై నివేదిక తెప్పించుకుంది’’ అని నిరంజన్‌రెడ్డి తెలిపారు.


అపోహలు వద్దు: గంగుల

‘‘వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో అపోహలు అవసరం లేదు. కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలో 6,570 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు 2100 కేంద్రాల ద్వారా 3562 మంది రైతుల నుంచి 2.36 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. మిల్లర్ల వద్ద టోకెన్‌ పద్ధతి ఉంది. అది సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు పరిమితం’’ అని గంగుల తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పౌరసరఫరాల కమిషనర్‌ అనిల్‌కుమార్‌లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని