COP28: కాప్‌28 సదస్సులో అనూహ్య పరిణామం.. వేదికపైకి దూసుకెళ్లిన భారత చిన్నారి

12 ఏళ్ల వయసు పిల్లలు చదువు, ఆటపాటలతో మునిగిపోతుంటారు. కానీ అదే వయసున్న లిసిప్రియా( Licypriya Kangujam) మాత్రం పర్యావరణాన్ని కాపాడాలంటూ అంతర్జాతీయ వేదికలపై తన గళాన్ని గట్టిగా వినిపిస్తోంది.

Updated : 12 Dec 2023 12:45 IST

దుబాయ్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌ (Dubai) వేదికగా ‘కాప్‌-28(COP28)’ ప్రపంచ వాతావరణ సదస్సు జరుగుతోంది. ఈ ఐరాస ఉన్నతస్థాయి కార్యక్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 12 ఏళ్ల భారతీయ బాలిక వేదికపైకి దూసుకొచ్చి.. ‘శిలాజ ఇంధనాలకు ముగింపు పలకండి.. మన భూగ్రహాన్ని, భవిష్యత్తును రక్షించండి’ అని ప్లకార్డు ప్రదర్శించింది.

శిలాజ ఇంధనాల వినియోగంపై చిక్కుముడి

మణిపుర్‌కు చెందిన ఆ చిన్నారి పేరు లిసిప్రియా కంగుజం(Licypriya Kangujam). ఆమె శిలాజ ఇంధనాల వాడకాన్ని వ్యతిరేకిస్తోంది. తాజాగా దుబాయ్‌ వేదికగా జరుగుతోన్న కాప్‌ సదస్సులో కూడా తన గళాన్ని వినిపించింది. వీక్షకుల మధ్య నుంచి లిసిప్రియా ప్లకార్డు పట్టుకొని వేగంగా వేదికపైకి దూసుకెళ్లింది. ప్లకార్డును ప్రదర్శించి మాట్లాడింది. అయితే కొద్దిసేపటి తర్వాత సిబ్బంది వచ్చి ఆమెకు సర్దిచెప్పి కిందకు పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వారి మాట వినకుండా అటూ ఇటూ తిరుగుతూ తన ప్రసంగాన్ని కొనసాగించింది. తర్వాత సిబ్బంది ఆమెను  అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. 

అయితే లిసిప్రియా ప్రసంగానికి వీక్షకుల అభినందనలు దక్కాయి. ఈ సంఘటనపై కాప్ 28(COP28) డైరెక్టర్ జనరల్ అంబాసిడర్ మజిద్ అల్‌ సువైదీ స్పందించారు. ఆ చిన్నారి ఉత్సాహాన్ని చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. అలాగే తన నిరసన అనంతరం లిసిప్రియా ట్వీట్ చేశారు. ‘నేను నిరసన తెలియజేయడంతో వారు నన్ను 30 నిమిషాల పాటు అదుపులోకి తీసుకున్నారు. శిలాజ ఇంధనాలు వాడొద్దని చెప్పడమే నేను చేసిన నేరం. మీరు నిజంగా శిలాజ ఇంధనాలను వ్యతిరేకిస్తే.. నాకు మద్దతు ఇవ్వండి. నిబంధలకు విరుద్ధంగా ఐరాస ప్రాంగణంలోనే బాలల హక్కుల ఉల్లంఘన జరిగింది. ఐరాస వద్ద నా గళాన్ని వినిపించే హక్కు ఉంది’ అని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ను ట్యాగ్ చేసింది.

భూతాపాన్ని నియంత్రించడానికి ఇదే చివరి అవకాశం: అమెరికా

నవంబర్‌ 30న ప్రారంభమైన కాప్‌ 28 సదస్సు( COP28 ).. ఈ రోజు(డిసెంబర్‌ 12)తో ముగియనుంది. దీనికి 190 దేశాల నుంచి 60వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ లిసిప్రియా.. ఈస్ట్‌ తైమూర్‌ ప్రత్యేక రాయబారిగా సదస్సుకు హాజరైంది. లిసిప్రియా చిన్నవయసు నుంచే వాతావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్ వంటి అంశాలపై ఉద్యమిస్తోంది. ఎన్నో వేదికలపై ఉపన్యాసాలిచ్చింది. ‘క్లైమేట్‌ ఛేంజ్‌ లా’ తీసుకురావాలంటూ మన పార్లమెంటు ముందూ ప్రదర్శనలు చేసింది. ఈమెను ‘వరల్డ్‌ చిల్డ్రన్‌ పీస్‌ ప్రైజ్‌ 2019’ వరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని