Maldives: అత్యవసర చికిత్సల కోసం శ్రీలంకను ఆశ్రయించిన మాల్దీవులు..!

భారతదేశంలోని ఆసుపత్రులను కాదనుకొని తమ పౌరులకు శ్రీలంకలో అత్యవసర చికిత్సలు అందించేందుకు మాల్దీవులు సిద్ధమైంది.  

Updated : 31 Jan 2024 16:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ అందిస్తున్న అత్యవసర సేవలను కాదన్న మాల్దీవులు.. ఆర్థిక సమస్యలతో అట్టుడుకుతున్న శ్రీలంక వద్దకువెళ్లి సాయం కోరింది. తమ దేశంలో మారుమూల ప్రాంతాల్లోని ప్రజలను అత్యవసర చికిత్సల కోసం కొలంబోకు తరలించేలా ఒప్పందం చేసుకొంది. ఈ మేరకు మాల్దీవుల రవాణా శాఖ మంత్రి మహమ్మద్‌ అమీన్‌, శ్రీలంక మంత్రి నిమల్‌ సిరిపాల డిసిల్వాతో భేటీ అయ్యారు. ఈవిషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వెల్లడించారు. వైద్య చికిత్స కోసం బాధితులను తరలించే విమానాలకు శరవేగంగా అనుమతులు మంజూరుచేసేలా ఇరు దేశాలు నియమనిబంధనలు సిద్ధం చేసేందుకు అంగీకారం కుదిరిందన్నారు. శ్రీలంక మంత్రి నిమల్‌ సిరిపాల మాట్లాడుతూ ‘‘ మాలె ప్రజలకు శ్రీలంకలో అత్యవసర చికిత్సలు అందేలా ఈ ఏర్పాట్లు ఉపయోగపడతాయి’’ అని తెలిపారు. మాల్దీవులకు అత్యంత సమీపంలో ఉండేది భారత్‌, శ్రీలంకలు మాత్రమే. 

‘భారత్‌కు ముయిజ్జు క్షమాపణలు చెప్పాలి’: మాల్దీవుల విపక్షం డిమాండ్‌

వైద్యపరంగా అత్యవసర తరలింపుల విషయంలో భారత్‌ భాగస్వామ్యాన్ని వదులుకొని ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ముయిజ్జు ప్రభుత్వం నిర్ణయించింది. 2024 మార్చి నుంచి ప్రత్యేకంగా ఎయిర్‌ అంబులెన్స్‌ వ్యవస్థలను సిద్ధం చేస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. వీటి ద్వారా అవసరమైతే థాయిలాండ్‌కు వెళ్లి చికిత్స తీసుకోవచ్చని పేర్కొంది. కానీ, ఇటీవల ఒక టీనేజర్‌ను అత్యవసర చికిత్సకు తరలించడంలో జాప్యం జరగడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తర్వాత  ముయిజ్జు సర్కారు శ్రీలంకతో ఒప్పందానికి మొగ్గు చూపింది. మాల్దీవుల ప్రజలు భారత్‌లో చికిత్స పొందడానికి ఇష్టపడతారు. అక్కడ దాదాపు పదేళ్లుగా ‘అసంధా’ పేరిట ప్రభుత్వం యూనివర్సల్‌ ఇన్స్యూరెన్స్‌ను నిర్వహిస్తోంది. దానికింద చాలా భారతీయ ఆసుపత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉంది. తాజాగా అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉండే భారత్‌ను కాదనుకొని.. అరకొర వసతులుండే కొలంబోను ఎంచుకోవడం గమనార్హం. 

ముయిజ్జు ప్రభుత్వం మార్చి 15వ తేదీలోపు భారత దళాలు మాల్దీవులను వీడాలని డెడ్‌లైన్‌ విధించిన విషయం తెలిసిందే. అక్కడ మన దేశ నౌకాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు,   ఒక డోర్నియర్‌ విమానం ఇప్పటివరకు సేవలు అందిస్తున్నాయి. దాదాపు 80 మంది సిబ్బంది అక్కడ ఉన్నారు. గత ఐదేళ్లలో మారుమూల ప్రాంతాల్లో అత్యవసర చికిత్స అవసరమైన సుమారు 600 మందిని భారత్‌కు తరలించింది. దీంతోపాటు అక్కడ గాలింపు, సహాయక చర్యల్లో కూడా ఈ బృందాలు పాల్గొంటున్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని