USA: రష్యా ముందడుగు వేస్తే..చైనాదే బాధ్యత: అమెరికా హెచ్చరిక

చైనా (China)లో రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌ పర్యటన నేపథ్యంలో అగ్రదేశం స్పందించింది. 

Updated : 10 Apr 2024 11:05 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌ (Ukraine)తో జరుగుతోన్న యుద్ధంలో రష్యా (Russia) ముందడుగు వేస్తే.. అందుకు చైనా (China)నే బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా (USA) హెచ్చరించింది. రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌ బీజింగ్‌లో పర్యటించిన నేపథ్యంలో అగ్రదేశం నుంచి ఈ మేరకు స్పందన వచ్చింది. 

ఈ పర్యటన సందర్భంగా రష్యాలో సామాజిక భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు తమ మద్దతు ఉంటుందని చైనా హామీ ఇచ్చింది. మరోపక్క ఉక్రెయిన్‌కు మరింత ఆయుధ సాయాన్ని ఆమోదించడంపై యూఎస్‌ కాంగ్రెస్‌లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. అదే సమయంలో రష్యా తన దాడుల్ని తీవ్రతరం చేస్తోంది. ఈ క్రమంలో చైనా మద్దతు గురించి ఎదురైన ప్రశ్నకు యూఎస్‌ విదేశాంగ సహాయ మంత్రి కర్ట్‌ క్యాంప్‌బెల్ బదులిచ్చారు. ‘‘ఉక్రెయిన్‌లో రష్యా ముందడుగు.. ఐరోపాలో శక్తి సమతుల్యతను దెబ్బతీసే అవకాశాలున్నాయి. ఇదే విషయాన్ని ఇప్పటికే చైనాకు స్పష్టం చేశాం. ఇదే కొనసాగితే.. అమెరికా-చైనా సంబంధాలపై దీని ప్రభావం పడుతుంది’’ అని హెచ్చరించారు.

ఇటీవలే రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలో తొలి విదేశీ పర్యటనలో భాగంగా చైనా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని క్రెమ్లిన్ సూచన ప్రాయంగా వెల్లడించింది. అయితే కచ్చితమైన సమయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో లావ్రోవ్‌ భేటీని సన్నాహక పర్యటనగా భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని