కారు రిపేరా కాల్‌ చేయండి... మరి!

సొంత కారులో కూర్చుని... మనకు నచ్చిన పాటల్ని వింటూ... రయ్యిమంటూ వెళ్తుంటే ఆ ఆనందమే వేరు కానీ... ఉన్నట్టుండి టైరు పంక్చరు అయితే... పెట్రోల్‌ ట్యాంక్‌ ఖాళీ అయితే... కొన్ని గంటలపాటు దాన్ని ఓ చోట పార్క్‌ చేయాల్సి వస్తే... ఇలా కారు ప్రయాణంలో అనుకోకుండా ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తున్నాయి కొన్ని సంస్థలు.

Published : 11 Feb 2023 23:53 IST

కారు రిపేరా కాల్‌ చేయండి... మరి!

సొంత కారులో కూర్చుని... మనకు నచ్చిన పాటల్ని వింటూ... రయ్యిమంటూ వెళ్తుంటే ఆ ఆనందమే వేరు కానీ... ఉన్నట్టుండి టైరు పంక్చరు అయితే... పెట్రోల్‌ ట్యాంక్‌ ఖాళీ అయితే... కొన్ని గంటలపాటు దాన్ని ఓ చోట పార్క్‌ చేయాల్సి వస్తే... ఇలా కారు ప్రయాణంలో అనుకోకుండా ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఇంతకీ అవెలా పనిచేస్తాయంటే...

కప్పుడు కారు విలాస వస్తువు. కానీ ఇప్పుడది అవసరంగా మారింది. కారు అందుబాటులో ఉంటే... కుటుంబం అంతా కలిసి ఏ ఇబ్బందీ లేకుండా ఎక్కడికైనా వెళ్లిరావొచ్చు అనుకునే వారి సంఖ్య ఇప్పుడు బాగా పెరిగింది. అందుకే... చిన్నదో/పెద్దదో, కొత్తదో/సెకెండ్‌హ్యాండ్‌దో ఓ కారును కొనుక్కునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంత ఇష్టంగా కొనుక్కున్న కారుకు ఎప్పటికప్పుడు సర్వీసు చేయిస్తున్నా కూడా... ఎప్పుడో ఒకప్పుడు ఊహించని విధంగా నడిరోడ్డుమీద ఉన్నట్టుండి ఆగిపోవచ్చు. పెట్రోలు చూసుకోకపోవడం నుంచీ కీ పోగొట్టుకోవడం వరకూ రకరకాల సమస్యలు ఎదురుకావచ్చు. అలాంటివాటిని పరిష్కరించేందుకే కొన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయిప్పుడు. దాదాపు 24 గంటలు పనిచేసే ఈ సేవలతో కారు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకోవచ్చు. ఒకప్పుడైతే కారు ఉన్నట్టుండి ఆగిపోతే దాన్ని అక్కడే వదిలేసి మెకానిక్‌ను వెతికి తీసుకురావడం అనేది ఓ పెద్ద ప్రయాసగా అనిపించేది. కానీ ఇప్పుడలా కాదు... రెడీ అసిస్ట్‌, ఆటో ఐ కేర్‌, రోడ్‌మెక్‌, డ్రూమ్‌, గ్యారేజ్‌ ఆన్‌ రోడ్‌... వంటి సంస్థలూ, కార్ల తయారీ కంపెనీలూ ఏ సమయంలోనైనా సరే... కారు ఉన్నచోటుకే తమ సిబ్బందిని పంపించి రిపేర్లు చేయిస్తున్నాయి. దాంతోపాటు అదనంగా మరికొన్ని సేవలూ అందిస్తున్నాయి.  

రిపేరు నుంచి పార్కింగ్‌ దాకా...

కారులో పెట్రోల్‌ అయిపోవడం, పంక్చరు కావడం, అప్పటివరకూ చక్కగా నడిచిన కారు... పార్క్‌ చేసిన కాసేపటికి మళ్లీ స్టార్ట్‌చేస్తే ముందుకు కదలకపోవడం... ఇలా ఊహించని సమస్యలు ఎదురైనప్పుడు ఆయా సంస్థలకు కాల్‌ చేస్తే వెంటనే తమ సేవల్ని అందిస్తాయి. ఉదాహరణకు రెడీ అసిస్ట్‌ను తీసుకుంటే... ఇది పెట్రోల్‌/డీజిల్‌ అందించడం నుంచీ, ప్రమాదానికి గురైన కారును గ్యారేజీకి తీసుకెళ్లడం, టైర్లు మార్చడం, ఇతర రిపేర్లు చేయడం వరకూ ఎన్నో సేవల్ని కస్టమరు ఫోన్‌ చేసిన చాలా తక్కువ సమయంలోనే అందిస్తుంది. ఆప్‌ రూపంలోనూ అందుబాటులో ఉన్న ఈ రెడీ అసిస్ట్‌లో సభ్యత్వం కూడా తీసుకోవచ్చు. ఆటో ఐ కేర్‌ అనే సంస్థ కూడా రెడీ అసిస్ట్‌ తరహాలో సేవలు అందిస్తూనే తన వెబ్‌సైట్‌లో పార్కింగ్‌ సదుపాయం ఉన్న ప్రాంతాలను కూడా తెలియజేస్తుంది. ఈ రోజుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం కూడా పెరుగుతోంది కాబట్టి వాటికి సంబంధించిన ఛార్జింగ్‌ స్టేషన్‌ వివరాలను కూడా పేర్కొంటుంది. ఒకవేళ మనం వెళ్లే ప్రాంతాన్ని బట్టి డ్రైవరు కావాలన్నా కూడా సంప్రదించొచ్చు. కారు తాళం పోయినా కూడా మారు తాళాన్ని తెచ్చి లాక్‌ను ఓపెన్‌ చేస్తారు సిబ్బంది. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలన్నింటిలో పనిచేసే ఇలాంటి సంస్థలు కారుకు ఏదయినా ప్రమాదం జరిగితే... ఆ వాహనాన్ని తీసుకెళ్లి గ్యారేజీలో రిపేరుకు కూడా ఇస్తాయి. ఈ సంస్థల మాదిరి మారుతీ సుజుకీ, ఫోర్డ్‌, టయోటా, హుందాయ్‌... వంటి కార్ల కంపెనీలు కూడా ఇరవైనాలుగ్గంటలూ పాన్‌ఇండియా స్థాయిలో సేవల్ని అందిస్తున్నాయి. ఆ సంస్థలను ఫోన్లో సంప్రదిస్తే కస్టమరు ఉన్న ప్రాంతం, సమస్యను బట్టి సిబ్బందిని పంపిస్తాయి. రిపేరును బట్టి డబ్బులు తీసుకుంటాయి. అదే ప్రైవేటు సంస్థల్లో అయితే కస్టమర్లు ముందే నామమాత్రపు రుసుమును చెల్లించి మెంబర్‌షిప్‌ను కూడా తీసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..