ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రూపాన అనుభవిస్తోంది!

అమ్మ మెడ ఒంపులో తలదూర్చి నడుం మీద చెయ్యి చుట్టి వెచ్చగా పడుకున్న నేను హఠాత్తుగా కళ్ళు తెరిచాను. ఎవరో సన్నగా ఏడుస్తున్న ధ్వని.

Updated : 11 Jun 2023 09:34 IST

వలివేటి నాగచంద్రావతి

అమ్మ మెడ ఒంపులో తలదూర్చి నడుం మీద చెయ్యి చుట్టి వెచ్చగా పడుకున్న నేను హఠాత్తుగా కళ్ళు తెరిచాను. ఎవరో సన్నగా ఏడుస్తున్న ధ్వని. పక్కన అమ్మ లేదు- కిటికీ దగ్గర క్రీనీడలో కూర్చుని శబ్దం పైకి రానీకుండా నొక్కిపడుతూ ఏడుస్తోంది.

‘అమ్మా...’ గప్పున మెలకువ వచ్చింది. కల తేలిపోయింది. నిట్టూరుస్తూ లేచి కూర్చున్నాను. దగ్గర చుట్టంలా తరచూ ఈ స్వప్నం నన్ను పలకరిస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే ఇది కలే... కానీ ఒకనాటి వాస్తవం అది. అప్పుడు నాకు అయిదేళ్ళు. ఆరోజు రాత్రి అమ్మ పక్కన నేనూ ఉయ్యాలలో మా చెల్లీ నిద్రలో ఉన్నాం. రాత్రి సగభాగం గడిచి ఉంటుంది. లీలగా అరుపులూ, కేకలు. దడుస్తూ అమ్మ స్పర్శ కోసం తడిమాను. పక్కన అమ్మ లేదు. నానమ్మ ఉంది. ‘పడుకో, పడుకో’ అంది నా వీపు మీద మృదువుగా జో కొడుతూ. మళ్ళీ మాగన్ను పడుతోంది. ఇంతలోనే మళ్ళీ ఏదో అలికిడి- ఇబ్బందిగా రెప్పలు సగం మాత్రం తెరిచాను. అమ్మ కిటికీ దగ్గర గోడకి వాలి ఏడుస్తోంది.

‘‘అమ్మా’’ అన్నాను తల్లడిల్లిపోతూ. ఆ ఘటన అలాగే నా మనసులో ముద్రితమైపోయింది. ఆ రాత్రి అమ్మ ఎందుకు ఏడ్చిందో, తెల్లవారాక నానమ్మ అమ్మ ఒంటి మీద వాతలకి నూనె రాస్తూ ‘‘చేసిన నేరాలు లెక్క చూసి శిక్షించేది యముడు. ఏ తప్పూ లేకుండానే ఆడదాన్ని శిక్షించేది మొగుడు. మన ఖర్మ ఇది’’ అంటూ ఎందుకు విచారపడేదో వయసుతోపాటు అవగాహన పెరిగితేగానీ నాకు తెలీలేదు... ఆ వాతలు మొగుడు అనబడే మగవాడి దాష్టీకానికి ఆనవాళ్ళని.

మనసునిండా ఏదో బాధ, ఆక్రోశం. ‘అసలు అమ్మని హింసించే అధికారం నాన్నకెవరిచ్చారు?’

‘గొడ్డు మెడలో పలుపుతాడూ, ఆడదాని మెడలో పసుపుతాడూ వేశాక వాడే యజమాని. మెడ పుండు పడినా ఎద్దు ఓర్చుకోవాల్సిందే, వంటి మీద వాతలుపడినా ఆడది ఓర్చుకోవాల్సిందే. ఏం చేస్తాం, పెద్దలు నిర్ణయించారలాగ’ అంటుంది నానమ్మ.

‘ఏ కాలం అది? అంత అన్యాయమైన నియమాలు పెట్టిన ఆ పెద్దలెవరు? వాటి మూలంగా నరకయాతన పడుతున్న వాళ్ళయినా మార్చమని అడగరెందుకు? తిరగబడరెందుకు.’ అస్పష్టమైన కలగాపులగమైన ఆలోచనలు తప్ప అడగ్గల వయసూ లేదు ధైర్యమూ లేదు.

*              *             *

కాలంతోపాటు వయసు పెరిగింది. వ్యక్తురాలినయ్యాను. ఆంక్షలు నాకూ ఎక్కువయ్యాయి. ఇదివరకులా పరుగులు పెట్టడం, ఫక్కుమని నవ్వటం, చీకటిపడ్డాక తోడు లేకుండా బయటకు వెళ్ళటం ఆడపిల్లకి నిషిద్ధం. ఆడపిల్లల స్కూల్లోనే చదువుకోవాలి. ఇంటిపనీ వంటపనీ నేర్చుకోవాలి. చెమ్మచెక్కలూ ఒప్పులకుప్పలూ మానేసి పచ్చీసూ, వామనగుంటలూ ఆడుకోవాలి.

ఇన్ని కట్టుబాట్లతో మంచి అమ్మాయిగా పెరిగాను. ఆ కాలపు ఆచారాలనండీ, సాంప్రదాయమనండీ, చాదస్తాలనండీ... ఈడేరిన పిల్లకి వీలైనంత తొందరగా పెళ్ళి చేసి అత్తవారింటికి తరిమెయ్యటమే రివాజు. ఆ ప్రకారమే నా పదిహేనో ఏట చదువు మానిపించి పెళ్ళి చేశారు. అత్తవారింటికి అంపకం పెట్టారు. నా సంసార జీవితం ప్రారంభమైంది. ఉండే నివాసం మారింది. చుట్టూ ఉండే మనుషులూ మారారు. పరిస్థితులు మాత్రం యథాతథం. ‘ఏ జాతి చరిత్ర చూసినా...’ అన్నట్టు ఏ ఇంటి కథ చూసినా కాస్త అటూఇటూ మార్పూ చేర్పులతో ఒకటే మోడల్‌.

తొందరగానే మా అత్తగారి ఇంట్లోవాళ్ళ మనస్తత్వాలు ఆకళింపుకొచ్చేశాయి. మా మామగారు పెద్దపులి. ఆయన ఇంట్లో ఉన్నా బయటనుంచి ఇంట్లోకొస్తున్నా సింహం రాకడ పసిగట్టిన అడవిలా నిశ్శబ్దమైపోతుంది ఇల్లు.

ఆయన మాట శాసనం. ఆయన చెప్పిందే చేయాలి. కట్టమన్నదే కట్టాలి. వండమన్నదే వండాలి. గీటు దాటితే శివతాండవమే. వీధిదాకా వినిపించే ఆయన అరుపులకి బిక్కచచ్చిపోయేవాళ్ళం ఇంట్లో అందరం.

ముఖ్యంగా ఆడవారిపట్ల ఎంత నిర్దయుడంటే- నేను ఈ ఇంట్లో అడుగుపెట్టడం తరువాయి, ఆయన చేసిన నిర్వాకం పనిమనిషిని మానిపించేయటం. ‘ముగ్గురు  ఆడంగులున్నారు తిని కూర్చుంటూ, ఆ మాత్రం ఇంటిపని చేసుకోలేరూ’- అదీ కారణం.

ఇంటిపని అంటే తేలికగా ఉండటానికి ఇప్పటి రోజులా అవి? మిక్సీలూ గ్రైండర్లూ వాషింగ్‌మెషీన్లూ... లాంటివి ఉంటాయని కూడా ఊహించని కాలం అది. కట్టెల మీద వంట. పొగ, కళ్ళుమంటలూ, మాడిన గిన్నెలూ, మాసిన బట్టలూ, రుబ్బురోలూ, రోకలిబండా, పెరట్లో రెండు గేదెలూ... ముగ్గురు చేసినా తెమలని పని. ఒళ్ళు హూనమయ్యే చాకిరీ.

మామగారు లెక్కేసిన ముగ్గుర్లో మా అత్తగారు ఒకరు- ఆవిడకు ఉబ్బసం. దానికితోడు కీళ్ళనొప్పులు, పది నిమిషాలు నిలబడితే పావుగంట ఆయాసపడేది. పాపం ఆవిడ రోగిష్టితనం అంటే కూడా మా మామగారికి విసుగే. ‘ఏలిన్నాటి శనివి. నిన్ను నాకంట గట్టారు మీవాళ్ళు’ అని కసిగా అరుస్తుండేవారు.

ఇక మా ఆడబడుచు ప్రభావతి. బాల్య వితంతువు. పెళ్ళయిన రెండేళ్ళకే భర్తను పోగొట్టుకుని పుట్టింటికి వచ్చి చేరింది. నేను ఈ ఇంటి గృహప్రవేశం చేసేదాకా  నిమనిషి సాయంతో ఇంట్లో పనంతా ఆమే చక్కబెట్టేది. ఇప్పుడా పనిమనిషి స్థానంలో నేనొచ్చాను.

ఆవిడంటే నాకు జాలి. నేను కాస్త మంచి చీర కట్టుకున్నా, తల్లో కాసిని పూలు పెట్టుకున్నా తన కళ్ళు వెలిగక్కే అసూయని కూడా నేను అర్థం చేసుకోగలను. పాపం, నిండా పాతికేళ్ళు లేవు. తెల్లచీర కట్టుకుంటుంది. వేలు ముడి వేసుకుంటుంది. తను ఎదురొస్తే దశ్శకునమట. లేవంగానే కనబడితే తల్లి కూడా మొహం  చిట్లించుకుంటుంది. వీధి మొహం చూడనివ్వరు. మా మామగారయితే ముందు సావిట్లో అడుగుపెట్టినా రంకెలేస్తారు.

విధి వంకరగా చూసింది చాలదా. చుట్టూరా మనుషులు కూడా ఎందుకామెనంతగా అవమానిస్తారు? పూర్తిగా విప్పారకుండానే రేకలు చిదిమేసిన పువ్వులాంటి ఆమెను చూస్తే మనసు కలచినట్టవుతుంది నాకు.

‘ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రూపాన అనుభవిస్తోంది. ఆ భగవంతుడు విధించిన శిక్షని మనం రద్దు చేయగలమా? ఈ జన్మనిలా వెళ్ళమార్చవలసిందే’ అంటుంది మా అత్తగారు. ‘ఏం, కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆమె రాతని సరిచెయ్యలేరా వీళ్ళు’ అంటుంది నా బుద్ధి.

నాకొచ్చే భావాలనీ ఆలోచనలనీ ఎవరితో పంచుకోను? కన్నవారిని వదిలి ఎవరిని ‘నా’ అనుకుని వచ్చానో ఆయన దగ్గర కూడా నా మనసు విప్పలేనే.

అంత చనువు నాకెప్పుడిచ్చారాయన. మామగారిలా నోరు చేసుకోకపోవచ్చు కానీ- సేవ చేయటంలో దాసిగా, కడుపు నింపటంలో తల్లిగా, పడగ్గదిలో రంభగా వాడుకున్నారే తప్ప, సలహా అడగటంలో మంత్రిగా నాకు అవకాశమీయలేదు. సహధర్మచారిణిగా గౌరవించలేదు. అర్ధాంగిగా తనతో సమాన స్థానమీయలేదు. అన్నింటా ఏకపక్ష నిర్ణయమే. సంవత్సరాలు గడుస్తున్నా మా నడుమ అదే పరాయితనం. మగవాడినన్న అహంతో నా మనసు చూరగొనాలనే ప్రయత్నం ఆయన చేయలేదు. ‘ఈయన నా మనిషి’ అన్న ఆర్ద్రభావం నాకు ఎప్పుడూ కలగలేదు. తప్పనిసరిగా ఒకే బాటన నడుస్తోన్న బాటసారులం, అంతే.

లోలోపల ఇంతలా మధనపడతానేగానీ ఎదరపడి ‘మీ ఏక ఛత్రాధిపత్యం ఏమి’టని ఎందుకు ప్రశ్నించలేను? ఆయన్ని చూడగానే ఏదో తప్పు చేసినట్టు ఎందుకు జంకుతాను? తరతరాలుగా నరనరానా జీర్ణించుకుపోయిన బానిసత్వ గుణం ముందుకు అడుగేయనివ్వట్లేదా?

*              *             *

ఆనాడు నేను చేయలేని పని నా కూతురు లావణ్య చేసింది. ‘నేనతన్ని చేసుకోను, నాకతను నచ్చలేదు’ కుండబద్దలు కొట్టింది లావణ్య. ఉక్కిరిబిక్కిరయ్యారు నా భర్త. చిన్నప్పటినుంచీ అది కొంచెం పెంకి. మాట పెళుసు అని తెలుసుగానీ ఇంత సాహసం చేస్తుందని మాత్రం నేనూ అనుకోలేదు. రెండు రోజుల క్రితం సంప్రదాయ పద్ధతిగా మొదటిసారి పెళ్ళిచూపులు జరిగాయి. పిల్ల నచ్చిందని కబురు వచ్చింది వాళ్ళనుంచి. తొలిగా చూసిన సంబంధమే కుదిరిపోతోందంటే ఆడపిల్లకి ఎంత అదృష్టం కలిసొచ్చినట్టో. ఇంటిల్లిపాదీ ఏనుగెక్కినంత సంబరపడిపోతున్నాం. కట్నాలూ లాంఛనాలూ మాట్లాడేసుకుని నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటే మంచిదనుకుంటున్నప్పుడు అణు విచ్ఛేదనం చేసింది లావణ్య.

‘‘అదేమిటి, నిన్న అడిగితే తలూపావుగా?’’ ‘‘ఊపలేదు- దించుకున్నాను. ఆలోచించేకొద్దీ నాకతను బాగున్నాడనిపించటం లేదు. ముక్కు మరీ పొడుగ్గా ఉంది. చివర్లో వంగిపోయింది. నాకది నచ్చలా.’’

‘‘ఇదేం చిన్నపిల్లల ఆటనుకున్నావా? ఔననీ కాదనీ...’’ ఉగ్రుడయిపోయారాయన. ‘‘ఎందుకరుస్తారు. ఆట కాదిది... నా పెళ్ళి విషయం. అందుకే సీరియస్‌గా చెబుతున్నాను. మీకులా దొరికిందే మహా ప్రసాదమని రాజీపడదలుచుకోలేదు’’ తనూ గొంతు పెంచేస్తూ అంది లావణ్య. చప్పున చల్లారిపోయారాయన. ఇంటి తగవు రచ్చ చేసుకుంటే పోయే పరువెవరిది? చివరికి కూతురి మొండితనానికి లొంగక తప్పలేదు పాపం మావారికి. అప్పటికిగానీ నాకు తెలీలేదు- విప్లవానికెంత శక్తి ఉందో.

గౌతమ్‌ని వరుడిగా లావణ్య ‘ఊ’ కొట్టాక ఊపిరి పీల్చుకున్నారు నా భర్త. తల ఎగరెయ్యలేదుగానీ ఆ విజయం తాలూకు గర్వం, మెరుపూ లావణ్య కళ్ళలో చూశాన్నేను.
పెళ్ళిచేసి కాపురానికి పంపించేటప్పుడు ‘‘అందరితో కలివిడిగా ఉండు, పెద్దవాళ్ళతో వినయంగా ఉండు. భర్త మాటకి...’’ సంప్రదాయం కొనసాగించబోయాను.
‘‘ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసులే, నువ్వేం నాకు చెప్పక్కరలేదు’’ అంది అది.

‘నిజమే. నా కూతురు సమర్థురాలు. నాలా పిరికిది కాదు. తన జీవితాన్ని తెలివిగా ధైర్యంగా సరిదిద్దుకోగలదు.’ నేననుకున్నట్టే లావణ్య ఆ ఇంట గెలుపు సాధించి, తనదైన ముద్రతో విజయ పతాకం ఎగరేసింది. కానీ నేను ఆశించినట్టు గాంధేయ మార్గంలో కాదు.

*              *             *

గౌతమ్‌ చాలా నెమ్మదస్తుడు. మొహం మీద చిరునవ్వు, మాటలో సౌమ్యతా చెదరనివ్వడు. ఎప్పుడు చూసినా అప్పుడే ధ్యానంలోంచి కళ్ళు విప్పినవాడిలా ప్రశాంతంగా ఉం టాడు. ఇక నా కూతురు- తుఫాను. ఉరికే జలపాతం. గంతులు వేసే లేడిపిల్ల. వ్యతిరేక ధవాలు ఆకర్షించుకుంటాయనేది సిద్ధాంతం. లావణ్య అందానికీ వాక్చాతుర్యానికీ ఫిదా అయిపోయాడు గౌతమ్‌. మగని ఈ బలహీనత ఆధారంగా ఆ ఇంటి సారథ్యం తన చేతుల్లోకి తీసుకుంది సులువుగా.

అత్తగారిని వంట ఇంటికి పరిమితం చేసింది. ఏమి వండాలో, ఎంత వండాలో లిమిట్స్‌ పెట్టింది. ఏదో చిన్న ఉద్యోగం చేసి రిటైరయిన మామగారిని, ‘ఎప్పుడూ విశ్రాంతంటూ ఆ పడకకుర్చీలో పేపరు పట్టుకు కూర్చోకండి- ఆరోగ్యం చెడుతుంది. పెరట్లో బోలెడు ఖాళీ స్థలముంది. కూరమొక్కలు వేసి వాటి సంరక్షణ చూడండి. మీకు కాలక్షేపంగానూ ఉంటుంది- ఎక్సర్‌సైజు చేసినట్టుగానూ ఉంటుంది- మనకు కూరల ఖర్చూ కలిసి వస్తుంది’ అని అరవై ఏళ్ళ ఆ వృద్ధుడికి హితోపదేశం చేసింది.
డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న మరిదిని, ‘అలా ఫ్రెండ్స్‌ దగ్గరకనీ మాల్స్‌కనీ బలాదూరు తిరుగుళ్ళు తిరక్కపోతే నలుగురు పిల్లలకి ట్యూషన్లు చెప్పరాదూ... నీ అప్లికేషన్లకైనా వస్తాయి కదా. మీ అన్నయ్య ఒక్కరు, ఎంత బరువుని మోస్తారు? చిన్నపిల్లాడివి కాదు- అర్థం చేసుకో’ అని బుద్ధులు చెప్పింది.

అందరికీ పనులప్పగించి తనుమాత్రం రింగ్‌ మాస్టర్‌లా అందరినీ కంట్రోల్‌ చేసే బాధ్యతని తలకెత్తుకుంది. మొదట్లో కాస్త ఒద్దికగానే చెప్పింది. రానురానూ శాసించటం దాకా వచ్చింది. ‘ఈ మూకని పోషించలేక మా ఆయనా, అడ్డమైన సేవలూ చేయలేక నేనూ చచ్చిపోతున్నాం’ అని గత్తర చేయటం కూడా నేర్చుకుంది.
ఓర్పుకి కూడా ఓ హద్దుంటుంది. అది దాటితే... అప్పట్నుంచీ ఆ ఇంట్లో కీచులాటలు తలెత్తాయి. గంగిగోవులా ఉండే మామగారి నోరూ, ‘నోట్లో నాలికే లేదు’ అనుకునే అత్తగారి నోరూ... లావణ్య పుణ్యమా అని ఇంట్లో వాళ్ళకే కాదు, బయటవాళ్ళ చెవులకి కూడా వినిపిస్తున్నాయి.

‘నిన్నగాక మొన్నొచ్చావ్‌, మామీద నీ పెత్తనమేమిటి?’ అంటుంది అత్తగారు. ‘నిన్నొచ్చినా మొన్నొచ్చినా ఈ ఇల్లూ ఈ సంసారం ఇప్పుడు నావి. నాకు నా భర్త తప్ప మిగిలినవాళ్ళందరూ ఎక్స్‌ట్రానే. నా చెప్పుచేతల్లో ఉంటారా సరే, లేదంటే మీ తోవ మీరు చూసుకోవలసిందే’ సరిగ్గా ఈ మాటల్లోనే చెప్పకపోయినా లావణ్య చెప్పే సమాధానానికి అర్థమదే.

పాపం. గౌతమ్‌ పరిస్థితి అడకత్తెరలో పోక చందమయింది. తల్లిని తప్పు పట్టలేడు, భార్యని మందలించలేడు. అప్పటికీ ప్రయత్నించాడొకసారి- భార్యకు నచ్చచెప్పాలని. ‘‘మీకేం తెలీదు మీరూరుకోండి. ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో నాకు బాగా తెలుసు. నాకెందుకని నేనూరుకుంటే మీ అమ్మ ఇంతంత వండి, మిగిలింది పనివాళ్ళకి పారేస్తోంది. మిగతా మీ పరివారం సోమరుల్లా తయారై బట్టలూ నగలూ గుళ్ళూ గోపురాలూ అని ఒకరూ, గాడ్జెట్సూ విహారాలూ అని ఒకరూ ఎన్ని విధాలుగా డబ్బు తగలబెట్టడమా అని ఆలోచిస్తుంటారు. మరి మన భవిష్యత్తూ పుట్టబోయే బిడ్డలూ పెరిగే సంసారం గురించి నేనూ జాగ్రత్తపడొద్దా? అంచేత నేనేం చేసినా మన మంచికే. మీరు గమ్మునుండండి. అంతా నేను చూసుకుంటాను’’ అంది లావణ్య.

గొడవ పెంచటం ఇష్టంలేక అప్పటికి ఊరుకున్నా, భార్య గయ్యాళితనం మితిమీరిపోయినప్పుడు విసుగెత్తిపోయి తరచూ అతనూ నోరు చేసుకునేవాడు. దానాదీనా ఆ ఇంట్లో ఎప్పుడూ యుద్ధ వాతావరణమే.

మా బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి వెళ్ళినప్పుడు, అక్కడ కలిశాను లావణ్య అత్తగారిని. ‘‘మీ అమ్మాయి మీద చాడీలు చెబుతున్నానని అనుకోకండీ’’ అంటూ కోడలి నిర్వాకమంతా చెబుతూ, ‘‘మా మధ్యన నా కొడుకు నలిగిపోతున్నాడు వదినగారూ. చూడలేకపోతున్నాం. చిన్నవాడికి ఏదైనా ఉద్యోగం దొరికితే ఆ నరకంలోంచి వెళ్ళిపోతాం. అందుకోసమే రోజూ ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను’’ అంటూ కళ్ళొత్తుకున్నదావిడ. సిగ్గుతో తల వంచుకున్నాన్నేను.

*              *             *
 

‘‘నీకింత గడుసుతనం ఎలా అబ్బిందే?’’ కోపంగా అడిగాను నా కూతుర్ని తరవాత. ‘‘లేకపోతే- నీకులా చచ్చుగా పడి ఉండమంటావా? అది నావల్ల కాదు. అయినా ఎప్పుడూ మగవాడి ఆధిపత్యానికి లోబడే ఉండాలా? పద్ధతి మార్చాలి అనిపించింది, మార్చి చూపించాను’’ అంది విలాసంగా. మార్పు మంచిదే. కానీ, ఈ రకంగానా- ఉహూ.

*              *             *

‘‘అమ్మమ్మా!’’ రెండు చేతులతోనూ పొదవి పట్టుకుని నన్నాహ్వానించింది నా మనవరాలు వెన్నెల. ఆ నులివెచ్చని కౌగిలిలోని ఆప్యాయతకు పొంగిపోయింది నా మనసు.
తనతోపాటే వచ్చి నా పాదాలు తాకి నమస్కరించాడు వెన్నెల భర్త గోపీకృష్ణ. విదేశంలో పెద్ద చదువు చదివి వచ్చినవాడతను. ఏ భేషజమూ లేకుండా ఈ ముసలిదానికిచ్చిన గౌరవానికి ఉబ్బితబ్బిబ్బయ్యాను.

మావాళ్ళు ఉత్తరదేశ యాత్రలకు వెడుతూ, భారంగా ఉన్న నా భారాన్ని తాత్కాలికంగా వెన్నెల మీద మోపి నన్నిక్కడ దిగబెట్టారు. వెన్నెల వాళ్ళది చాలా పెద్ద ఇల్లు. వాళ్ళు నాకిచ్చిన గది చాలా విశాలంగా ఉంది. లేత గులాబీరంగు గోడలూ పెద్దపెద్ద కిటికీలూ నైట్‌క్వీన్‌ మీదుగా వస్తున్న గాలి వింజామరలు వీస్తున్నట్లుగా హాయిగా ఉంది. మెత్తని పరుపు. నా కళ్ళు మూతలు పడేదాకా నా మంచం మీదే కూర్చుని కబుర్లు చెప్పింది వెన్నెల. ఆ రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను.

తెల్లవారగానే తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చాడు గోపీకృష్ణ- చేతిలో ట్రేతో. ‘‘గుడ్‌ మార్నింగ్‌ అమ్మమ్మా’’ అందమైన మందహాసంతో కాఫీ కప్పందించాడు.
‘‘నేనూ మిమ్మల్ని అమ్మమ్మా అనే అంటాను. నాకా పిలుపే దగ్గరగా అనిపిస్తుంది.’’ ‘‘దానికేం, అలాగే పిలువు, అయినా ఇంత పొద్దున్నే లేచి కాఫీ కూడా పెట్టావా? ఎందుకయ్యా అంత శ్రమా’’ అన్నాను నొచ్చుకుంటూ. ‘‘శ్రమ ఏముంది అమ్మమ్మా. నాన్నకు బెడ్‌ కాఫీ అలవాటు. మీరూ చీకటితోనే లేచి ధ్యానం చేసుకుంటారని చెప్పింది వెన్నెల. నాన్నతోపాటు మీకూ ఓ కప్పు కలిపాను’’ అన్నాడు చిరునవ్వు చెదరనీకుండా.

‘‘వెన్నెల...’’‘‘ఇంకా లేవలేదు. రాత్రి రెండున్నర అయింది- తన ఆఫీసు వర్క్‌ పూర్తయ్యేసరికి. ఇంకాసేపయినా పడుకోనిమ్మని నేనే లేపలేదు’’ అన్నాడతను వెళ్ళిపోతూ... ‘తల్లి ఛాయలు రాలేదు గదా’- అన్న నా అనుమానాన్ని తుంచేస్తూ. గోపీకృష్ణ వెళుతున్నప్పుడే అతని తండ్రి విశ్వనాథంగారు వచ్చారు గదిలోకి- ‘‘బావున్నారా అమ్మా’’ అంటూ. ఆయన భార్య సుమిత్ర క్యాన్సర్‌తో మరణించి రెండు సంవత్సరాలయింది. ఇక ఉద్యోగం చేయాలనిపించక రిజైన్‌ చేసేసి ఇక్కడ కొన్నాళ్ళూ అమెరికాలో ఉంటున్న కూతురి దగ్గర కొన్నాళ్ళూ ఉంటుంటారాయన.

పది నిమిషాలు అవీ ఇవీ మాట్లాడాక ‘‘పదడుగులు వేయగలరా అమ్మా. కాసేపలా వాకింగ్‌కు వెళ్ళొద్దాం’’ అడిగారాయన.ఒంట్లో సత్తువ ఉన్నంత వరకూ విరామమెరుగని చాకిరీ, వయసు ఉడిగిన ఈ స్థితిలో భగవంతుని స్మరణ తప్ప మరో ఆలోచన మరిచిపోయిన నాబోటి దానికి ఇదో కొత్త అనుభవం.

‘‘నడవగలను, పదండి’’ అన్నాను. ఆ ఉషోదయవేళ చల్లటి గాలుల్ని పీలుస్తూ ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగొచ్చిన విశ్వనాథంగారు ఆ విశేషాలు మెత్తని స్వరంతో చెబుతోంటే, వింటూ మంచు కురిసిన ఆ పచ్చిక మీద నడవటం నిజంగా అద్భుతం. ఇంత సుందరమైన అనుభూతులుంటాయని తెలీకుండానే జీవితమంతా నిస్సారంగా గడిపేశాను. నిజంగా విచారమనిపించింది.

‘‘మా సుమిత్ర చేసిందీ అలవాటు. నా మొహంలో బయటపడిపోతున్న సంభ్రమాన్ని చూసిగావును’’ అన్నారు విశ్వనాథంగారు. ‘మనసుకి శాంతి, తనువుకి విశ్రాంతి ఇది’ అంటుంది సుమిత్ర.

నేను గమనించాను సంభాషణలో ఏదో మిష మీద భార్యని తలుచుకుంటూనే ఉన్నారాయన. భర్త హృదయాన్ని గెలుచుకున్న సుమిత్ర ఎంత అదృష్టవంతురాలు!
మేము వచ్చేసరికి ఎలక్ట్రిక్‌ మెషీన్‌తో ఇల్లు శుభ్రం చేస్తున్నాడు కృష్ణ- ఈల వేసుకుంటూ. మనసు చివుక్కుమనిపించింది. ‘ఇంకా లేవలేదా ఈ దొరసాని. ఎంత అలసిపోతేమటుకు తను చెయ్యాల్సిన పనులు మొగుడు చేస్తుంటే ఎలా నిద్రపడుతోంది దానికి?’ అంతలోనే వచ్చింది వెన్నెల ‘‘బ్రేక్‌ఫాస్ట్‌ రెడీ’’ అనుకుంటూ. ‘‘సారీ అమ్మమ్మా, పొద్దున్నే లేచి నీకు సుప్రభాతం చెప్పాలనుకున్నాను. ఈ కృష్ణ చూడు... నన్ను లేపలేదు’’ నన్ను చూసి అంది, భర్త వంక కినుకగా చూస్తూ. ‘వెన్నెల మీద అనవసరంగా అపోహ పడ్డానా?’

ఇద్దరూ కలిసి డైనింగ్‌ టేబుల్‌ సర్దేశారు.నాకిష్టమని పెసరట్టు, ఉప్మా చేసిందట. వెన్నెల పెసరట్లు ప్లేట్లలో పెడుతోంటే, కృష్ణ గ్లాసుల్లో మంచినీళ్ళు నింపాడు. అలా ఇద్దరూ ఒకరికొకరు అందించుకుంటూ చకచకా పని చేస్తూంటే ముచ్చటగానే ఉందిగానీ- ఏదో చిన్న ఎబ్బెట్టు- రచ్చలో కూర్చోవలసిన రాజేంద్ర భోగి ఇలా మంచినీళ్ళూ పచ్చళ్ళూ వడ్డిస్తూ...‘‘రా అమ్మమ్మా’’ వెన్నెల పిలిచింది.

నాకు మొహమాటం వేసింది. ‘మగవాళ్ళు తిని వెళ్ళిన తరవాతే ఆడవాళ్ళం తినటం ఇప్పటికీ మా ఇంట అలవాటు మరి.’ ‘‘ఎంత పని రద్దీలో ఉన్నా, ఉదయం
బ్రేక్‌ఫాస్ట్‌కీ రాత్రి డిన్నర్‌కీ అందరం డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కలవాలన్నది మా అత్తగారు పెట్టిన నియమం. బాంధవ్యాలు బలపడేందుకు ఇదో సూత్రం అంటారామె’’ నా చెయ్యి పట్టుకుని బలవంతానా కూర్చోబెడుతూ అంది వెన్నెల.

లోకం విడిచి వెళ్ళిపోయినా ఆమె మాటకెంత విలువ! ముందు తడబాటుగానే ఉన్నదిగానీ నలుగురం కబుర్లు కలబోసుకుంటూ నవ్వులు చిలకరించుకుంటూ ప్లేట్లలోని రుచుల్ని ఆస్వాదించటం, నీరసం రోగికి గ్లూకోజ్‌ ఇంజెక్షన్‌లా నా స్తబ్దతని కరిగించాయి. ఆనందాన్ని కలిగించాయి.

ఫలహారం పూర్తయింది. వెన్నెల టేబుల్‌ క్లీన్‌ చేస్తోంది. కృష్ణ అయితే అలవాటైన పనిలాగా గబగబా ఎంగిలి ప్లేట్లు సింక్‌లో వేసి కడిగేస్తున్నాడు.

‘‘నువ్వీ ఆడ పనులన్నీ చేయటం నాకు నచ్చటం లేదయ్యా. లే, ఇవి నేను కడుగుతాను’’ అన్నాను మందలింపుగా- అతని చేతిలోని ప్లేట్ల కోసం చేయి జాపుతూ.

పాతకాలం వాసనలు పోలేదు మరి. కృష్ణ మందహాసం చేశాడు. ‘‘మీరు మా తాతలనాటి రూల్స్‌ చెబుతున్నారు అమ్మమ్మా. మా జనరేషన్‌లో ఆడపనీ మగపనీ అని
కేటాయింపులు లేవు. ఆడవాళ్ళని బానిసల్లాగా ఫోర్త్‌ గ్రేడ్‌కి తొక్కేయటమూ లేదు- మగవాడికి కిరీటం పెట్టి సింహాసనం ఎక్కించటమూ లేదు. ఇప్పుడందరూ సమానమే.

లోచించండి అమ్మమ్మా... మీరు పురుష లక్షణంగా భావించే ఉద్యోగం నాతోపాటు వెన్నెలా చేస్తోంది. మరి ఇంటి పని కూడా తనమీదే రుద్దటం సబబా? ఆ శ్రమలో సగం నేనూ పంచుకుంటే తప్పేమిటి? చిన్నతనమెందుకు? కష్టంలోనూ సమాన భాగస్వాములమవటమే కదా దాంపత్యమంటే.’’

‘ఎలా అబ్బిందితనికి ఇంత విశాలమైన ఆలోచనా ధోరణి!?’ నా మనసులో ప్రశ్న చదివినట్టు ‘‘మా అమ్మా నాన్నా స్నేహితుల్లా ఉండేవారు అమ్మమ్మా. నన్నూ మా అక్కనీ ప్లస్సూ మైనస్సూ అని ఎప్పుడూ ఎక్కడా భేదం చూపించలేదు. చదువుతోపాటు ఇద్దరికీ ఇంటిపనీ వంటపనీ సమానంగా నేర్పించింది మా అమ్మ. ఆ విధానమే మాది కూడా. ఈ పద్ధతి సరికాదంటారా?’’ అన్నాడు కృష్ణ.

తల్లంటే ఎంత గౌరవమో అతని కళ్ళు చెప్తున్నాయి. నా మొహంలో మెప్పుదల అతనూ కనిపెట్టాడు.

‘‘కొన్ని తరాలు దాటి వచ్చారు మీరు. చెప్పండి అమ్మమ్మా, ఇంట్లో ఎవరో ఒకరు ఏకఛత్రాధిపత్యం కఠినంగా సాగించిన మీ కాలం నచ్చిందా... ప్రజాస్వామ్యం లాంటి ఈ రోజులు నచ్చాయా... నిజం చెప్పండి.’’

‘ఏం చెప్పను?’ పది రోజులు ఉన్నాను నేనక్కడ. సుమిత్ర వంటి మాతృమూర్తి శిక్షణలో పెరిగిన కృష్ణ- వెన్నెలను సహధర్మచారిణిగా గౌరవించటం, ప్రియురాలిగా ప్రేమించటం నేను చూశాను.

స్వార్థంతో నిరంకుశ ప్రవర్తనతో అందరినీ దూరం చేసుకున్న తల్లి ధూర్తత్వం చూసిన వెన్నెల తను మాత్రం అలా కాకూడదనుకుని ఉంటుంది. అన్నివిధాలా భర్తకి సహకరిస్తోంది. నావాళ్ళూ నీవాళ్ళూ అని విడదీయక మనవాళ్ళు అంటోంది. ఆదరిస్తోంది. ఇల్లు స్వర్గం చేసుకుంటోంది.

*              *             *

నాకు ఎన్నో జాగ్రత్తలు చెబుతూ రైలెక్కించారు నా మనుమడూ మనవరాలూ. రైలు కదిలింది. చెయ్యూపుతూ నాకు వీడ్కోలు చెబుతోన్న ఆ జంటను మనసారా ఆశీర్వదించాను.

హెచ్చుతగ్గుల దారిని వదిలించుకుని స్వయంగా పూలబాట పరుచుకుంటున్న యువతరం వీళ్ళు. ఎంత బాగుంది ఈ సమానత్వం! వెనక్కి వాలాను తృప్తిగా.
గతంలాంటి చెట్టూ పుట్టల్ని వెనక్కి నెట్టేస్తూ రైలు ముందుకు దూసుకు వెడుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు