తను

నాకు ఎందుకో తను నచ్చదు... చూస్తే ఒళ్ళు మండిపోతుంది... కానీ తప్పదు భరించాలి... నచ్చనితనం కనపడకూడదు... ఎందుకంటే తను ఎవరో కాదు... వదిన... స్వయానా మా అన్నయ్య భార్య.

Updated : 10 Jul 2022 07:36 IST

తను

- ఉమాబాల చుండూరు

నాకు ఎందుకో తను నచ్చదు... చూస్తే ఒళ్ళు మండిపోతుంది...
కానీ తప్పదు భరించాలి... నచ్చనితనం కనపడకూడదు... ఎందుకంటే తను ఎవరో కాదు... వదిన... స్వయానా మా అన్నయ్య భార్య.
పెళ్ళి అయ్యి వచ్చినప్పటినుండి మహాతల్లి అందరి మన్ననలూ పొందేసింది. మేము నలుగురం. ఇద్దరు అన్నయ్యలూ నేనూ చెల్లీ.

పెద్దన్నయ్యకి మాత్రమే పెళ్ళి అయ్యింది. చిన్న అన్నయ్య జాబ్‌ కోసం ట్రై చేస్తున్నాడు. తరువాత నేను, బిఎస్‌సీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను, చెల్లెలు తొమ్మిదో క్లాస్‌ చదువుతోంది. నాన్నగారు లెక్చరర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. అమ్మ హౌస్‌ వైఫ్‌. వదిన కూడా జాబ్‌ చేస్తోంది టి.సి.ఎస్‌.లో. అన్నయ్య కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, మైక్రోసాఫ్ట్‌లో చేస్తాడు.

ఈ సంబంధం కూడా ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది. వదినకి ఒక తమ్ముడు. కుటుంబం బావుండి అన్నీ అందరికీ నచ్చి మొత్తానికి పెళ్ళి అయిపోయింది. వదిన చాలా బాగుంటుంది. అదేంటో, తన తమ్ముడు ఇంకా అందగాడు.
నిజానికి నాకు ఆ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు. అయినా తల్లీ తండ్రీ అందంగా ఉంటే పిల్లలూ అందంగా ఉంటారు. అదేమన్నా గొప్పా ఏంటి..?

వచ్చినప్పటి నుండి ఇల్లు స్వాధీనం చేసేసుకుంది. పొద్దున్నే లేవడం... అమ్మకి అన్ని పనుల్లో సహాయపడటం... అందరికీ అన్నీ టైమ్‌కి రెడీ చేయడం... అసలు తను ఏ పనైనా చకచకా చేసేస్తుంది. చక్కగా తయారవుతుంది కూడా.
డిగ్నిఫైడ్‌గా ఉండే అన్ని మోడరన్‌ డ్రెస్‌లూ వేస్తుంది... చీరలూ కడుతుంది. వంట అయితే బ్రహ్మాండంగా చేస్తుంది. అమ్మ ట్రెడిషనల్‌ వంటలు చేస్తే ఈవిడ అన్ని రకాల బిర్యానీలూ ఫ్రైడ్‌ రైస్‌లూ మసాలా కూరలూ చపాతీలూ... అదరగొడుతుంది.

ఇక చిన్నన్నయ్యా, చెల్లెలూ అయితే ఆవిడకి ఫ్యాన్స్‌ అయిపోయారు. అమ్మా నాన్నగారు ప్రతీ దానికీ ‘అమ్మా సుచీ... అమ్మా సుచీ...’ అని పిలవడమే. ఆవిడ సలహాలు తీసుకోవడమే.
ఆవిడ పేరు సుచరిత లెండి. అసలు ఉద్యోగానికి వెళ్ళి వచ్చి ఇంట్లో పనులు చేస్తూ, అందరికీ హెల్ప్‌ చేస్తూ... అంత ఓపిక ఎలా ఉంటుందో అర్థంకాదు నాకు. నా పనులు నేను చేసుకుని, కాలేజీకి వెళ్ళి వచ్చేసరికే నా పని అయిపోతుంది. ఈవిడ వచ్చాక నా ప్రాముఖ్యత తగ్గిపోయింది ఈ ఇంట్లో. నేను పొద్దున వంటింట్లోకి వెళ్ళబోతుంటే... వదిన మాట వినబడుతోంది... ‘‘పోనీలేండి అత్తయ్యా, పడుకోనివ్వండి సునీతని. ఇప్పుడే కదా ఎంజాయ్‌ చేసేది. మనిద్దరం చేస్తున్నాం కదా’’ అంటూ
నన్ను సపోర్ట్‌ చేస్తున్నట్లుగా అమ్మని బుట్టలో వేసేసుకుంటోంది... అంతా నటన. నెమ్మదిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోందేమో అనిపిస్తోంది నాకు. మెల్లమెల్లగా ఇల్లూ, పెత్తనం అంతా హస్తగతం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
నేను అసలు తను మాట్లాడినా ఆఁ ఊఁ అంటానుగానీ, మా చెల్లిలా

ఓ... వెనకబడి తిరగను. అదేంటో అమ్మ కూడా టీవీ సీరియల్స్‌లో అత్తగారిలాగా సూటిపోటి మాటలు అస్సలు మాట్లాడదు కోడలితో. ఈవిడో అంజలీదేవి.
నేను నెమ్మదిగా అమ్మకేమైనా ఆవిడ మీద చెప్పబోయినా... అమ్మ- ‘చాల్లే ఊరుకో. వదిన్ని ఏదైనా అనుకుంటే కళ్ళు పోతాయి’ అంటుంది.
‘ఎంత మంచి పిల్లో... అదృష్టం బాగుండి మన ఇంటి కోడలయ్యింది’ అని మెచ్చుకుంటుంది.

‘సావిత్రి పిన్ని కోడలు చూశావా... వచ్చిన రెండు నెలలకే ఆఫీస్‌ దూరం అయిపోయింది అన్న వంకతో వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోయింది వీళ్ళకి దూరంగా. వదిన ఆఫీసూ దూరమే... అయినా పిల్ల ఎంత చక్కగా, పొద్దున్నే లేచి తనకి
వీలైనంత పని చేసి ఆఫీస్‌కు వెళ్తోంది. ఇంకెప్పుడూ ఇలా పితూరీలు చెప్పకు’ అని నన్ను వాయించింది.
మా అమ్మ అమాయకురాలు. లేకపోతే ఎవరిలోనైనా ఇన్ని మంచి గుణాలు ఉంటాయా... అందులోనూ కోడలిలో.

‘చూస్తా... నాకు అవకాశం రాదా,
ఈవిడ నిజ స్వరూపమిది’ అని అందరికీ చెప్పి బయటపెట్టకపోతానా అని ఎదురు చూస్తున్నాను.
నేను ఒకరోజు నా రూమ్‌లో ఫోన్‌ చూసుకుంటుంటే... ఆవిడ తన రూమ్‌ బాల్కనీలో నిలబడి మాట్లాడుతోంది ఎవరితోనో. రాత్రి 8 అయ్యుంటుంది... నేను కొంచెం కిటికీ దగ్గరికి వచ్చి చెవులు నిక్కబొడుచుకుని విందామని ప్రయత్నించాను.
‘అమ్మా’ అంటోంది మాటల్లో.

వాళ్ళ అమ్మతో మాట్లాడుతోంది అనుకుంటా... ఇంకాస్త దగ్గరికి వెళ్తే వినిపిస్తోంది స్పష్టంగా.
‘అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి... నాకు టైమ్‌ ఉండటం లేదమ్మా... నేను రాలేను... నేను ఇప్పుడే నీ అకౌంట్‌కి యాభైవేలు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నా. మనం చూశాం కదా... కిందటి వారం జి.ఆర్‌.టి.లో... ఆ హ్యాంగింగ్స్‌ కొనేసెయ్‌. నలభైవేలలో వస్తాయి. మిగిలిన డబ్బుతో- మనం చూసిన డ్రెస్‌ కూడా కొనెయ్‌. డ్రెస్‌ సైజ్‌ తీసుకెళ్ళడం మర్చిపోకు. రేపు చేసేయ్‌ షాపింగ్‌... నేను ఎలాగో నీ దగ్గర నుండి తీసుకుంటాలే. అవును, తమ్ముడి సంగతి ఏమైంది... నా మాట వినమ్మా, అమ్మాయి చాలా మంచిది. ఈ కాలపు పిల్లల్లా కాదు... తమ్ముడికి కూడా నచ్చింది కదా... మరోసారి ఆలోచించండి... ఉంటాను. భోజనం టైమ్‌ అయింది మరి...’ అని ఇంకేదో మాట్లాడుతోంది.

అమ్మా... నా కళ్ళు మెరిశాయి...
అమ్మ దగ్గరికి పరిగెత్తాను. అమ్మ తన రూమ్‌లో బట్టలు మడత పెడుతోంది. పక్కన కూర్చుని పూస గుచ్చినట్టు మొత్తం చెప్పేశా... కళ్ళూ చేతులూ తిప్పుతూ... ‘‘యాభైవేలు పంపిందమ్మా - ఏదో కొనమంటోంది - గోల్డ్‌ అనుకుంటా’’ అన్నాను.
అమ్మ మొహంలో కొంచెం రంగులు మారడం నా దృష్టిని దాటిపోలేదు. అయినా అమ్మ వెంటనే తేరుకుని... ‘‘ఊరుకో... అలా విన్న వెంటనే మనం ఏదేదో ఊహించుకోకూడదు. ఒకవేళ అలా కొనుక్కున్నా కూడా తప్పులేదులే.

సంపాదించుకుంటోంది కదా... ఇంకెవరికీ చెప్పకు. పద భోజనానికి’’ అంది.
చెప్పొద్దూ... అమ్మ మనసులో విషబిందువు వేశాననే ఆనందం నన్ను నిలువనీయలేదు.
రెండురోజులు హుషారుగా గడిచిపోయాయి నాకైతే...!!

ఆరోజు రాత్రి తొమ్మిదిన్నరకి చెల్లి వచ్చి పిలిచింది నేను చదువుకుంటుంటే... ‘‘అక్కా, అమ్మ పిలుస్తోంది’’ అంటూ.
నేను ‘‘వస్తున్నా’’ అంటూ చెల్లి వెంట వెళ్ళేసరికి డ్రాయింగ్‌ రూమ్‌లో- అమ్మా నాన్నా అన్నయ్యా తనూ ఉన్నారు.
‘ఏంటి, ఈ మీటింగ్‌ అబ్బా’ అనుకుంటూ ఉండగా... వదిన నాతో అంటోంది ‘‘నేను రేపు తొందరగా ఆఫీస్‌కి వెళ్ళాలి. అప్పటికి నువ్వు లేవవు కదా... అందుకని పిలిచాను’’ అని.

‘ఈవిడ తొందరగా వెళ్ళడానికీ నేను లేవకపోవడానికీ సంబంధం ఏంటో’ అని మనసులో విసుక్కుని... ముఖానికి చిరునవ్వు పులుముకుంటూ సోఫాలో కూర్చున్నా. ఉన్నట్టుండి వదిన తన సోఫా పక్కనుండి ఒక బ్యాగ్‌ తీసి అందులో నుండి ఇంకో చిన్న డబ్బా తీసి ఓపెన్‌ చేసి నా చేతికిస్తూ ‘‘ఇది నీకే. నాకు ఈ హ్యాంగింగ్స్‌ చాలా నచ్చాయి. నీకు బావుంటాయని కొన్నాను’’ అంది. నేను తెల్లబోయి ‘‘నాకెందుకు’’ అన్నా అసంకల్పితంగా.
‘‘రేపు నీ పుట్టినరోజు కదా, నీకు కొనాలనిపించింది’’ అని చెప్పి, ‘‘అత్తయ్యా ఎలా ఉన్నాయి?’’ అని అమ్మని అడిగింది.

‘‘చాలా బావున్నాయి, దిట్టంగా’’ అంది అమ్మ.
నేను అమ్మ వైపు చూడలేకపోయా. ‘‘నేను క్రితం శనివారం చూశానత్తయ్యా... మువ్వలతో చాలా అందంగా అనిపించాయి. మన సునీతకు బావుంటాయని... పుట్టినరోజు కూడా వస్తోంది కదా అని... నిన్ననే అమ్మకి చెప్పి, ఫొటో పంపించి తనచేత కొనిపించాను’’ అని చెప్తోంది.

‘‘ఇదిగో ఈ డ్రెస్‌ కూడా నీకే. నీకు తెలియకుండా నీ డ్రెస్‌ ఒకటి దొంగతనంగా సైజ్‌కని పట్టుకెళ్ళాను, నీకు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని’’ అంది నవ్వుతూ.
నా తల కిందకి వాలిపోయింది.
‘‘ముఖ్యంగా, ఇంకో విషయం చెప్పాలని మిమ్మల్ని అందరినీ పిలిచాను మామయ్యా అత్తయ్యా. మీ అబ్బాయికి తెలుసు
అనుకోండీ... కానీ మీరు ముఖ్యం కదా. మా తమ్ముడు విహారి తెలుసు కదా

 మీకు... బాంబేలో ఓ.ఎన్‌.జి.సి.లో జాబ్‌ చేస్తున్నాడు. వాడికి మన సునీత చాలా నచ్చిందట. మా తమ్ముడు చెప్పగానే నాకు ఎంత సంతోషం వేసిందో... మీకెవ్వరికీ అభ్యంతరం లేకపోతే పెళ్ళి చేసుకుంటాడట. అఫ్‌కోర్స్‌ సునీత అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే... చాలా నెమ్మది అనీ... మనం పదిమాటలు మాట్లాడితే తనో మాట మాట్లాడుతుందనీ... ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు అరుదు అనీ మా అందరి అభిప్రాయం. ఈ సంవత్సరం తన చదువు అయ్యాకే... అదీ తనకి ఇష్టమైతేనే ఈ ప్రపోజల్‌. కావాలంటే తను పెళ్ళి అయ్యాక, బాంబేలో పై చదువులు చదువుకోవచ్చు- ఏమంటారు, మీరంతా చెప్పండి’’ అంటూ నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకుంది.

నేను అప్రయత్నంగా లేచి నిలబడ్డాను. నా కళ్ళల్లోకి చూస్తూ ‘‘నీ కిష్టమైతేనే సుమా... కావలసినంత టైమ్‌ తీసుకుని ఆలోచించుకో’’ అంది స్నేహంగా నా చెయ్యి నొక్కుతూ.

నేను గభాల్న తనని కౌగలించుకున్నాను.

తను నాకేదో ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చినందుకు కాదు... తన అందమైన తమ్ముడిని నాకు ఆఫర్‌ చేస్తున్నందుకు కాదు... నామీద, తన నిజాయతీతో కూడిన ప్రేమకీ అభిమానానికీ స్థాణువునై. మనస్ఫూర్తిగా నాలో కలిగిన పశ్చాత్తాపం... కరిగి కన్నీరై... నా మనసులో తనపట్ల పెంచుకున్న కుళ్ళునీ కల్మషాన్నీ అసూయనీ కడిగేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..