పెళ్లి దుస్తులు.. ఉచితం..!
‘ఇది నా వేడుక’ అనిపించే వివాహానికి ఎవరైనా సరే ఎంతో గొప్పగా తయారవ్వాలనుకుంటారు, చక్కని పెళ్లి దుస్తులు వేసుకోవాలనుకుంటారు... అలా కొన్న వెడ్డింగ్ డ్రెస్సుని కొంతమంది పెళ్లి తర్వాత పక్కనపెట్టేస్తారు... ఇంకొందరికేమో పేదరికం కారణంగా మంచి పెళ్లిబట్టలు కొనుక్కునే అవకాశమే ఉండదు... ఆ రెండింటినీ కలుపుతూ వినూత్నమైన ఓ ఆలోచనతో ‘డ్రెస్ బ్యాంక్’ను ఏర్పాటు చేశాడు కేరళకు చెందిన అబ్దుల్ నాజర్!
కేరళలోని మలప్పురం జిల్లాలోని తూద అనే ఊళ్లో ‘నాజర్స్ డ్రెస్ బ్యాంక్’ పేరుతో ఓ దుకాణం ఉంది. అందులో అడుగుపెట్టగానే గ్రాండ్ ఎంబ్రాయిడరీ పెళ్లి గౌనుల దగ్గర్నుంచి చక్కని పట్టుచీరల వరకూ బోలెడన్ని వెరైటీల్లో పెళ్లి దుస్తులు అరల్లో అందంగా సర్దేసి కనిపిస్తుంటాయి. వాటిల్లో దాదాపు అయిదువేల నుంచి 60 వేల రూపాయల ధర ఉన్నవీ ఉంటాయి. అక్కడికి త్వరలో పెళ్లిచేసుకోబోతున్న వధువులు వెళ్లొచ్చు. అస్సలు ధర గురించి ఆలోచించకుండానే నచ్చిన డిజైనూ, రంగూ ఉన్నదాన్నొకటి ఎంచుకోవచ్చు. ‘అంత రేటు ఉంటే ధర సంగతి పట్టించుకోకపోవడం ఏంటీ’ అంటారా... ఎందుకంటే వాటిని ఉచితంగానే తీసుకోవచ్చు. అయితే ఒక్క నియమం... పెళ్లిబట్టలు కొనుక్కోలేని స్థితిలో ఉన్న వారికోసం మాత్రమే ఏర్పాటు చేసిన ‘డ్రెస్ బ్యాంక్’ అది. ఉచితంగా రక్తమూ, ఆహారమూ అందించే బ్లడ్, ఫుడ్ బ్యాంకుల్లానే ఇదీ పెళ్లిబట్టలిచ్చే బ్యాంక్ అన్నమాట. ప్రస్తుతం దాదాపు 800కి పైగా ఖరీదైన వెడ్డింగ్ డ్రెస్సులు ఉన్నాయిక్కడ. ఇప్పటి వరకు 200 మందికి పైగా ఈ బ్యాంకు నుంచి పెళ్లి బట్టలు తీసుకున్నారు.
ఎలా ప్రారంభమైందీ అంటే..
‘అమ్మాయికి మంచి పెళ్లిబట్టలు కొనాలంటే చాలా డబ్బులు కావాలి. మనమేమో అంత ఖర్చుపెట్టలేం. ఏం చేయాలో ఏంటో’ ఇలా కొంతమంది అమ్మానాన్నలు బాధపడుతుంటే గమనించాడు 44 ఏళ్ల అబ్దుల్ నాజర్. అలాంటి పేదవారికి ఏదైనా చేయాలనుకున్నాడు. స్నేహితులూ, కుటుంబసభ్యుల సాయంతో ఇంట్లో పక్కనుంచిన పెళ్లి దుస్తుల్ని సేకరించడం మొదలుపెట్టాడు. వాటిని అవసరమైన వారికి అందించాడు. నాజర్ చేస్తున్న ఈ మంచిపనికి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ వచ్చింది. కొంతమంది తమ ఖరీదైన దుస్తులూ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ చిన్న ఐడియానే ఎంతో మందికి సంతోషాన్ని ఇవ్వడం చూసి 2020లో ‘నాజర్స్ డ్రెస్ బ్యాంక్’ని ఏర్పాటు చేశాడు.
ప్రచారం చేస్తూ..
నాజర్ తన ఈ ఆలోచనను సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా పంచుకుంటూ తన డ్రెస్ బ్యాంక్‌కు కావాల్సిన దుస్తులు సేకరించే పనిలో ఉంటాడు. ‘ఉచితంగానే కదా ఏది పడితే అది ఇవ్వొచ్చులే’ అని కాకుండా దానికి కొన్ని నియమాలూ పెట్టుకున్నాడు. కచ్చితంగా డ్రెస్సు గ్రాండ్ లుక్‌తో వేడుకకు వేసుకునేలా బాగుంటేనే తీసుకుంటాడు. చిన్న మార్పులేమైనా ఉంటే వాటిని సరి చేసి కొత్తడ్రెస్సులా మారుస్తాడు. ఈ డ్రెస్ బ్యాంక్ ఐడియా నచ్చి స్థానికులే కాదు, వేరే ప్రాంతాల నుంచీ ఆసక్తి ఉన్నవాళ్లు దుస్తుల్ని పంపుతున్నారట. వెడ్డింగ్ డ్రెస్సు కోసం ఈ బ్యాంక్‌కు నేరుగా వెళ్లే వాళ్లతోపాటు, వివరాలు సరైనవే అయితే- ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సాయం అడిగితే వాళ్లకూ పెళ్లిబట్టలు పంపిస్తానంటున్నాడు నాజర్.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్