పునీత్‌తో నటించే ఛాన్స్‌ వచ్చింది.. కానీ అనుకోని పరిస్థితుల్లో...

‘అమిగోస్‌’తో తెలుగు తెరకు పరిచయమైన కన్నడభామ ఆశికా రంగనాథ్‌. కన్నడ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటున్న ఆశిక... సినిమాల్లోకి అనుకోకుండా   వచ్చానని చెబుతూనే తన ఇష్టాయిష్టాలనూ, అభిరుచులనూ వివరిస్తోందిలా...

Updated : 19 Feb 2023 15:35 IST

పునీత్‌తో నటించే ఛాన్స్‌ వచ్చింది.. కానీ అనుకోని పరిస్థితుల్లో...

‘అమిగోస్‌’తో తెలుగు తెరకు పరిచయమైన కన్నడభామ ఆశికా రంగనాథ్‌. కన్నడ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటున్న ఆశిక... సినిమాల్లోకి అనుకోకుండా వచ్చానని చెబుతూనే తన ఇష్టాయిష్టాలనూ, అభిరుచులనూ వివరిస్తోందిలా...


సినిమాల్లోకి ఎలా వచ్చానంటే...

మాది కర్ణాటకలోని హసన్‌. నాన్న రంగనాథ్‌, అమ్మ సుధ, అక్క అనూష... ఇదీ మా కుటుంబం. అక్క ఇప్పటికే నటిగా, మోడల్‌గా రాణిస్తోంది. అమ్మానాన్నలతో కలిసి సరదాగా థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడటం తప్ప... నాకు ఈ రంగంలోకి రావాలనే ఆలోచన ముందు నుంచీ లేదు. ఓసారి కాలేజీలో అందాల పోటీలు పెట్టినప్పుడు సరదాగా పాల్గొన్నా. అందులో క్లీన్‌ అండ్‌ క్లియర్‌ ఫ్రెష్‌ ఫేస్‌గా గుర్తింపు తెచ్చుకున్నా. ఆ ఫొటోలు బయటకు రావడంతో... ‘క్రేజీబాయ్‌’ అనే కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. అక్క కూడా ఇదే రంగంలో ఉండటంతో నాకూ ట్రై చేయాలనిపించి ఇటువైపు వచ్చా.


వాళ్లే నా బలం

మా అమ్మకు తన చిన్నతనంలో సంగీతం నేర్చుకోవాలనీ, గాయనిగా స్థిరపడాలనీ ఉండేదట. అయితే అప్పటి పరిస్థితులు, ప్రోత్సహించేవారు లేక తన ఇష్టాన్ని వదిలేసుకుంది. నా విషయంలో అలా కాకూడదని అమ్మ చిన్నప్పటినుంచీ డాన్స్‌ నేర్పించింది. స్కూల్లో, కాలేజీలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిలో పాల్గొనేలా ప్రోత్సహించింది. అందుకే నా విజయం వెనుక వాళ్ల సహకారం, కష్టం ఉన్నాయని గర్వంగా చెబుతా. వాళ్లే నా బలం మరి.


ఒక్క ఛాన్స్‌

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లోనే పునీత్‌ రాజ్‌కుమార్‌తో కలిసి నటించాలనీ, రాజమౌళి సినిమాలో అవకాశం రావాలనీ అనుకునేదాన్ని. నేను కోరుకున్నట్లుగానే అప్పూను రెండుమూడు సార్లు కలిసి మాట్లాడటమే కాదు... ఆయనతో నటించే అవకాశాన్నీ అందుకున్నా. అయితే అనుకోని పరిస్థితుల్లో అది వాయిదా పడింది. కొన్నాళ్లకే ఆయన చనిపోవడంతో అది కలగానే మిగిలిపోయింది. భవిష్యత్తులో రాజమౌళి సినిమాలోనైనా నటించే అవకాశం వస్తుందో రాదో చూడాలి.


అందుకే తెలుగు సినిమా...

‘అమిగోస్‌’ గురించి ఆ దర్శకుడు చెప్పినప్పుడు.. కథతోపాటు నా పాత్ర కూడా బాగా నచ్చింది. అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చేశా. కానీ... తెలుగు రాక మొదట్లో కాస్త ఇబ్బందిపడ్డా. ఆ సమయంలో కల్యాణ్‌రామ్‌ ఎంతో సహకరించారు. డైలాగుల్ని వాయిస్‌నోట్స్‌ రూపంలో పంపించేవారు. ఆయన దగ్గర కష్టపడేతత్వం, నిరాడంబరతను నేర్చుకున్నా.


చిన్ననాటి జ్ఞాపకం

తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు స్కూల్‌ ట్రిప్‌లో భాగంగా మమ్మల్ని దిల్లీకి తీసుకెళ్లారు. అక్కడ గడిపిన రోజులు, చేసిన అల్లరి, తెలుసుకున్న విషయాలు నాకు ఎప్పటికీ గుర్తుండి పోతాయి.


ఇష్టంగా తెలుసుకునేవి..

స్ఫూర్తినిచ్చే వ్యక్తుల జీవితగాథలూ, మంచి మంచి కొటేషన్లూ... మోటివేషనల్‌ స్పీచ్‌లూ... వీటన్నింటితో ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటా.


* ఇష్టమైన ఆహారం
మాంసాహారం. అమ్మ చేసే చికెన్‌ బిర్యానీ.

* ఎక్కువగా చూసిన తెలుగు సినిమాలు
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా

* సెలెబ్రిటీ క్రష్‌...
రణ్‌వీర్‌సింగ్‌

* ఒకప్పటి బలహీనత..
పబ్జీ బాగా ఆడేదాన్ని.

* తీరిక దొరికితే...
నచ్చిన ప్రాంతాలకు వెళ్తుంటా. లేదంటే... కజిన్స్‌తో కలిసి సరదాగా గడిపేందుకు ప్రయత్నిస్తా.  

* నటి కాకపోయి ఉంటే...
మార్కెటింగ్‌లోనో,వ్యాపార రంగంలోనో స్థిరపడేదాన్ని.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..