తలపాగాకు రోల్స్‌రాయిస్‌ మ్యాచింగ్‌

దుస్తులకు తగ్గట్టు యాక్సెసరీస్‌, మ్యాచింగ్‌ హ్యాండ్‌బ్యాగులూ అందరూ కొంటారు. బ్రిటన్‌కి చెందిన రూబెన్‌ సింగ్‌ మాత్రం తన తలపాగాకు మ్యాచ్‌ అయ్యే రంగుల్లో ఉన్న రోల్స్‌ రాయిస్‌ కార్లను కొనుగోలు చేశాడు.

Updated : 20 Nov 2022 03:53 IST

తలపాగాకు రోల్స్‌రాయిస్‌ మ్యాచింగ్‌

దుస్తులకు తగ్గట్టు యాక్సెసరీస్‌, మ్యాచింగ్‌ హ్యాండ్‌బ్యాగులూ అందరూ కొంటారు. బ్రిటన్‌కి చెందిన రూబెన్‌ సింగ్‌ మాత్రం తన తలపాగాకు మ్యాచ్‌ అయ్యే రంగుల్లో ఉన్న రోల్స్‌ రాయిస్‌ కార్లను కొనుగోలు చేశాడు. వాటితోపాటు మ్యాచ్‌ అయ్యే రంగుల్లోనే ఉండే లాంబోర్గిని, బుగాట్టి వెరాన్‌, ఫెరారీ, పోర్షేలాంటి టాప్‌ బ్రాండ్‌ కార్లనూ తన కలెక్షన్‌లో చేర్చాడు. 19 ఏళ్ల వయసులో వ్యాపారంలోకి ప్రవేశించి బ్రిటిష్‌ బిల్‌గేట్స్‌గా గుర్తింపు పొందిన రూబెన్‌ తలపాగా బ్యాండేజీలా ఉందంటూ కొన్నేళ్ల క్రితం ఒక ఇంగ్లిష్‌ వ్యక్తి హేళన చేశాడు.

ఆ వివక్షను తిప్పికొట్టడానికి అతనికి ‘రోల్స్‌రాయిస్‌ టర్బన్‌ ఛాలెంజ్‌’ విసిరాడు. అంటే తన తలపాగా రంగుకు కచ్చితంగా సరిపోయే ఖరీదైన కార్లను కొంటాననీ- తాను ధరించే తలపాగా రంగుల్లోని అతి ఖరీదైన కార్లను వరసగా కొనేశాడు. వాటితో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో బ్రిటిష్‌ వ్యాపార వర్గాల్లోనే కాకుండా ఇంటర్నెట్‌లోనూ సెలెబ్రిటీ అయిపోయాడు రూబెన్‌.


వారి ఓట్లు కొనలేరు

ఎలక్షన్లు అనగానే డబ్బు మూటలూ, మద్యం బాటిళ్లూ, రకరకాల తాయిలాలతో ఓటర్లకు ఎరవేయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, హరియాణాలోని జింద్‌ జిల్లా రామ్‌కాలి గ్రామంలో మాత్రం అటువంటి నేతల ఆటలు సాగలేదు. రెండు వేలమంది ఓటర్లు ఉన్న ఆ గ్రామంలో ఈ మధ్యనే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనానికి డబ్బులూ, మందూ పంచుతామని వెళ్లినవారికి అక్కడి మహిళలు దేహశుద్ధి చేయడానికి ముందుకొచ్చారు. అంతేకాదు, ఆడవాళ్లంతా బృందాలుగా ఏర్పడి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకూ కర్రలు పట్టుకుని గ్రామంలో కాపు కాసేవారు. కోడ్‌ అమల్లోకి వచ్చి ఎన్నికలు పూర్తయ్యే వరకూ- ఎనిమిదేళ్ల పిల్లల నుంచి 85 ఏళ్ల వృద్ధుల వరకూ ఆ పనిలోనే ఉన్నారు. వీరికి జడిసి ఓటర్లకు ప్రలోభాల ఎర వేయడానికి ఏ పార్టీ నాయకులూ ధైర్యం చేయలేకపోయారు. గతంలో ఆ గ్రామంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరగడంతోపాటు, గ్రామస్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు. దాంతో మహిళలు పూనుకుని అక్కడి మద్యం షాపులు తీయించేయడంతో పరిస్థితుల్ల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆ స్ఫూర్తితోనే యువతలోనూ చైతన్యం నింపుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో తామూ భాగమై మిగతా గ్రామాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు రామ్‌కాలి మహిళలు.


ఆ ఆచారం వద్దు!

బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, రంగురంగుల చీరలు ధరించకూడదు, వేడుకల్లో అక్షింతలు వేయకూడదు... ఇలా సంప్రదాయాల పేరిట వితంతువుల పట్ల వివక్ష అంతాఇంతా కాదు. అసలే భర్త దూరమై పుట్టెడు దుఃఖంలో ఉండే మహిళలను ఆ ఆచారాలు మరింత కుంగదీస్తాయి. వాళ్ల భవిష్యత్తును నాలుగు గోడలకి పరిమితం చేస్తాయి. తమ గ్రామంలో ఇకపై అటువంటి దారుణ వివక్షకు స్థానం లేదంటూ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లా హెర్వాద్‌ పంచాయతీ సభ్యులు తీర్మానం చేశారు. కొవిడ్‌ కారణంగా భర్తలను కోల్పోయి కష్టాలు పడుతున్న 12 మంది మహిళల బాధల్ని స్వయంగా చూసిన ఆ గ్రామస్తులు వితంతు ఆచారాలకు ఇక ఫుల్‌స్టాప్‌ పెట్టాలని నిర్ణయించుకున్నారు. హెర్వాద్‌ స్ఫూర్తితో దక్షిణ కొల్హాపూర్‌ నియోజకవర్గంలోని మిగిలిన గ్రామ పంచాయతీలన్నీ ఆ వివక్షా పూరిత ఆచారాలను పక్కన పెట్టడానికి సిద్ధమయ్యాయి. అలానే, గోవాలోని దుర్గాలిక్‌, కార్‌గావ్‌ గ్రామాలు కూడా హెర్వాద్‌ తీర్మానాన్ని ఆదర్శంగా తీసుకుని అదే బాటలో నడవడం మొదలుపెట్టాయి.


అత్తారింటికి ఆడవాళ్లు వెళ్లరు!

పెళ్లయ్యాక ఆడపిల్లను అత్తారింటికి పంపడం మన సంప్రదాయం. అయితే, మేఘాలయలోని ఖాసి తెగవారు మాత్రం ఇప్పటికీ మాతృస్వామ్య వ్యవస్థను కొనసాగించడం విశేషం. పెళ్లి తరవాత మగవాళ్లే భార్యతో కలిసి ఆమె పుట్టింటికి వెళ్లి ఇంటి పేరును కూడా మార్చుకుంటారు. పిల్లలకీ తల్లి ఇంటి పేరే వస్తుంది. ఆస్తులకు కూతుళ్లే వారసులు. అయితే ఇంటి బాధ్యత, హక్కు అందరి కంటే ఎక్కువ చిన్నకూతురికే ఉంటాయి. మిగతా కూతుళ్లు పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టినా ఆఖరి అమ్మాయి మాత్రం ఇల్లు విడిచి వెళ్లకూడదనే నిబంధన ఉంది. తల్లిదండ్రుల్నీ తనే చూడాలి. తల్లి మరణించాక ఇంటి పెద్ద స్థానం ఆమెకే వస్తుంది. దాంతో చాలామంది మగవారు భార్యల్ని పుట్టింట్లో వదిలి ఉపాధికోసం వేరే ప్రాంతాలకు వెళుతుంటారు. అంతేకాదు, భర్త సంపాదన భార్యకు ఇవ్వాలనే రూలు కూడా ఈ తెగలో లేదట. ఏది ఏమైతేనేం ఈ తెగలో ఆడవారికి స్వేచ్ఛ కూడా ఎక్కువేనన్నమాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..