కనుమకు ‘ప్రభ’ తెస్తాయి!

సంక్రాంతి అంటే... రంగవల్లులు, పిండివంటలు, భోగిమంటలు, కోడిపందాలు... మాత్రమే కాదు. వీటితో పాటు కోనసీమ వాసులు కనుమ పండుగ రోజున జరుపుకొనే ప్రభల తీర్థం గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నాలుగు వందల ఏళ్లుగా నిర్వహిస్తోన్న ఈ వేడుక ఇతర ప్రాంతాల్లో

Published : 09 Jan 2022 14:36 IST

కనుమకు ‘ప్రభ’ తెస్తాయి!

సంక్రాంతి అంటే... రంగవల్లులు, పిండివంటలు, భోగిమంటలు, కోడిపందాలు... మాత్రమే కాదు. వీటితో పాటు కోనసీమ వాసులు కనుమ పండుగ రోజున జరుపుకొనే ప్రభల తీర్థం గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నాలుగు వందల ఏళ్లుగా నిర్వహిస్తోన్న ఈ వేడుక ఇతర ప్రాంతాల్లో జరిగే పండుగకి కాస్త భిన్నంగా ఉంటుంది.

పచ్చని తివాచీల్లాంటి వరిచేలు... వాటి గట్లపై నిటారుగా నిలబడి స్వాగతం పలికే కొబ్బరి చెట్లు, గలగల పారే నీటితో నదీపాయలూ, కాలువలతో చూడ్డానికి ఓ దృశ్య కావ్యంలా కనిపిస్తుంది కోనసీమ. వీటి మధ్య సాగే ప్రభల తీర్థం ఈ సహజ అందాలకు ఆధ్మాత్మిక శోభను అద్ది సంక్రాంతి పండక్కి విశిష్టతను తెచ్చిపెడుతుంది. మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభలను ఊరి పొలిమేరల్ని దాటిస్తే గ్రామం పచ్చగా ఉంటుందని ప్రజల విశ్వాసం. అలా ఈ ప్రాంతంలోని తొంభైకి పైగా గ్రామాల్లో సుమారు 400 ఏళ్ల నుంచీ ప్రభల పండగను నిర్వహిస్తారు. వీటిల్లో జగ్గన్నతోటలో జరిగే వేడుక అతి పెద్దది. కొత్తపేట, అంబాజీపేట, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం, మామిడికుదురు వంటి చోట్లా ఘనంగానే చేస్తారు.

ప్రభల తయారీ ఇలా...

ప్రభలన్నీ రుద్ర రూపాలతో... తయారవుతాయి. వీటిని తాటి దూలాలకు టేకు చెక్కల్నీ, వెదురు బొంగుల్నీ చేర్చి  నిర్మిస్తారు. ఆ గోపురం మధ్య ఉండే ఖాళీలను నూతన వస్త్రాలతో అల్లుతారు. వెనక ఎర్రటి గుడ్డను వేలాడదీస్తే... పై భాగంలో ఇత్తడి కలశాలను బోర్లిస్తారు. వరికంకులు, నెమలి పింఛాలు, పూలదండలతో చేసిన అలంకరణ ప్రత్యేకం. మధ్యలో స్థానిక శివుడి ఉత్సవ విగ్రహాలను ఉంచుతారు. ఇలా తీర్చిదిద్దిన ప్రభలను మేళతాళాలతో ఊరి పొలిమేరల్ని దాటిస్తారు. 

జగ్గన్నతోట తీర్థం...

నుమ రోజున జగ్గన్నతోటలో ఏకాదశ రుద్రులు కొలువుదీరతారని ప్రతీతి. వ్యాఘ్రేశ్వరం, కె. పెదపూడి, ఇరుసుమండ, వక్కలంక, నేదునూరు, ముక్కామల, మొసలపల్లి, పాలగుమ్మి, గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు, పుల్లేటికుర్రు శివాలయాల నుంచి ప్రభలు ఇక్కడికి వస్తాయి. వీటిని పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తోట మొసలపల్లి- ఇరుసుమండ గ్రామాల మధ్య ఉంది. నిజానికి ఇక్కడ ఏ గుడీ ఉండదు. కనీసం అందుకు సంబంధించిన చిహ్నాలూ కనిపించవు. ఇది కేవలం ఏడెకరాల కొబ్బరితోట మాత్రమే.

నదులూ కాలువల మీదుగా...
ప్రభల ఊరేగింపునకు వాహనాలను వాడరు. రహదారులపై తీసుకెళ్లరు. ఎన్ని కిలోమీటర్లు ఉన్నప్పటికీ భుజాలపైనే పంట చేలూ, లోతైన గోదావరి పాయలూ, కాలువల మీదుగా... జగ్గన్న తోటకు తీసుకెళ్తారు. ముఖ్యంగా గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం రుద్రప్రభలను యువకులు భుజాలకెత్తుకుని ‘‘అశ్శరభ శరభ, అల్లల వీర...’’అంటూ... అప్పర్‌ కౌశిక నదిని దాటించే తీరుని చూసి తీరాల్సిందే. తర్వాత పచ్చటి వరి పొలాల మీదుగా అవి జగ్గన్న తోటకు చేరుకుంటాయి. అయితే ఇదేమీ అంత ఆషామాషీ వ్యవహారం కాదు... ఒక్కసారి ప్రభ ఎత్తితే మళ్లీ గమ్యం చేరుకునే వరకూ కిందకి దింపకూడదు. మోసేటప్పుడు నేలను తాకించకూడదు. కౌశిక దాటేటప్పుడు ఒక్క నీటి చుక్కా ప్రభ మీద కానీ, పై నున్న దేవుడి మీద కానీ పడకూడదు.

గౌరవ సూచకంగా...

వ్యాఘ్రేశ్వరానికి చెందిన వ్యాఘ్రేశ్వరస్వామి అందరిలోనూ మొదటివాడు కావడంతో ఈ కొలువునకు అధ్యక్షత వహిస్తాడంటారు. అందుకే ఆ ప్రభ వచ్చేవరకూ మొక్కులు తీర్చుకోకుండా వేచి చూస్తారు. అలానే ఆ ప్రభ వచ్చినప్పుడు గౌరవసూచకంగా ఒకసారి ఎత్తి దింపుతారు. ఈ ప్రభలకు అతిథ్యమిచ్చే మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి ప్రభ అన్నింటికంటే ముందుగా జగ్గన్నతోటకు చేరుకొని ఇతర ప్రభలకు ఆహ్వానం పలుకుతుంది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ ఉత్సవాన్ని చూడటానికి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల పర్యటకులు వస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..