మోదకొండమ్మ జాతర చూసొద్దామా!

గిరిజనులకోసం మన్యంలో స్వయంభువుగా వెలసి... మన్యందేవతగా విరాజిల్లుతున్న శక్తిస్వరూపిణి మోదకొండమ్మ. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న ఈ దేవికి ఏటా మే నెలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించడం విశేషం.

Updated : 14 May 2023 11:51 IST

గిరిజనులకోసం మన్యంలో స్వయంభువుగా వెలసి... మన్యందేవతగా విరాజిల్లుతున్న శక్తిస్వరూపిణి మోదకొండమ్మ. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న ఈ దేవికి ఏటా మే నెలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించడం విశేషం. సంతోషాన్ని ప్రసాదించే మోదకొండమ్మను దర్శించుకునే భక్తులకు
సకల శుభాలూ కలుగుతాయని ఓ నమ్మకం.

ప్రకృతి అందాలకు ఆలవాలం పాడేరు మన్యం ప్రాంతం. దట్టమైన అరణ్యం, పారే సెలయేర్లూ, ఎత్తైన కొండ శిఖరాలూ, పచ్చని చెట్లూ... ఇలా వన సౌందర్యానికి ఉదాహరణగా నిలిచే పాడేరులో గిరిజనుల దేవతగా కొలువుదీరి పూజలు అందుకుంటోంది మోదకొండమ్మ. విశాఖపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలోని పాడేరులో స్వయంభువుగా వెలసిన ఈ అమ్మవారు కోరిన కోర్కెలను తీర్చి సంతోషాన్ని ప్రసాదిస్తుందని ప్రతీతి. ఈ మన్యం దేవతకు ఏటా మే నెలలో మూడు రోజులపాటు ప్రత్యేక జాతరను నిర్వహించి తమ శక్తికొలదీ మొక్కుల్ని చెల్లించుకుంటారు భక్తులు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తించడం విశేషం.

స్థలపురాణం

మోదం అంటే సంతోషం అని అర్థం. గిరుల్లో వెలసిన దేవత కాబట్టి కొండమ్మ అని పిలవడంతో అమ్మవారు మోదకొండమ్మగా పూజలు అందుకుంటోందని ప్రతీతి. ఒకప్పుడు ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లా, నందపురం అనే ప్రాంతం కళింగ దేశంలో ఓ రాజ్యంగా ఉండేది. ఆ నందపురాన్ని రాణి మాకలశక్తి, ఆమె భర్త
భైరవుడు పాలించేవారు. వీరికి ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆ సంతానంలో మొదటి అమ్మాయే మోదకొండమ్మ. చిన్నతనం నుంచీ తన మహిమల్ని చాటిన మోదకొండమ్మ మహిషాసురుణ్ణి సంహరించే క్రమంలో ఆదిపరాశక్తికి సహాయపడిందనీ పురాణాలు చెబుతున్నాయి. మోదకొండమ్మ మేనత్తకు ఏడుగురు కుమారులు ఉండేవారట. దేశిరాజులుగా పిలిచే ఆ ఏడుగురినీ మోదకొండమ్మ, ఆమె మిగిలిన చెల్లెళ్లూ వివాహమాడారట. ఆ తరువాత మోదకొండమ్మ పాడేరులో పినవేనం అనే రాతి గుహ వద్ద స్వయంభువుగా కొలువుదీరిందనీ ఆమె చెల్లెళ్లూ పలు ప్రాంతాల్లో వెలిశారనీ కథనం. కొన్నాళ్లక్రితం ఇక్కడ ఏటా ప్రత్యేక పూజాదికాలను నిర్వహించేవారట. అయితే.. ఓసారి ఆ పండగ పూర్తయ్యాక భక్తులంతా ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ఆ తరువాత మోదకొండమ్మ చెల్లెళ్లతో కలిసి విందు ఆరగిస్తున్న సమయంలో తన చెంబును మరిచి వెళ్లిన పూజారి దాన్ని తీసుకునేందుకు గుహ వద్దకు తిరుగు ప్రయాణమయ్యాడట. దివ్యదృష్టితో ఆ విషయాన్ని తెలుసుకున్న మోదకొండమ్మ ఇకపైన తన వద్దకు ఇంతదూరం ఎవ్వరూ రావాల్సిన అవసరంలేదనీ... తాను విసిరే చెంబు భూమిపైన పడిన చోట తాను జన్మించినట్లుగా భావించాలనీ చెప్పిందట. చెంబు పడిన చోట అమ్మవారి పాదాలు కనిపించడంతో భక్తులు అక్కడే పూజలు చేసేవారు. అయితే ఘాట్‌రోడ్డు నిర్మాణానికి ముందు పాడేరు నుంచి అమ్మవారు పాదాలు కనిపించిన చోటుకు దాదాపు ఏడు కిలోమీటర్ల దూరం ఉండటంతో... భక్తులు ఘటాలను మోసుకుంటూ వెళ్లడానికి ఇబ్బంది పడేవారట. ఆ సమయంలోనే తహసిల్దార్‌ దాసరిశర్మ అనే భక్తుడికి దేవి కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని కోరడంతో
పాడేరులోనే ఆలయం కట్టారని కథనం.

మూడురోజుల ఉత్సవాలు...

ఈ ఆలయంలో ఏడాదిమొత్తం విశేష పూజలు జరిగినా... ఏడాదికోసారి మే నెలలో అంగరంగవైభవంగా నిర్వహించే జాతరను చూసేందుకు రెండుతెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులూ వస్తారు. మొదటి రెండు రోజులూ స్థానిక సతకంపట్టు వద్ద అమ్మవారి ఘటాలను
మేళతాళాలతో నిలబెట్టడంతో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. సాయంత్రం మళ్లీ ఆ ఘటాలను పురవీధుల్లో ఊరేగిస్తారు. మూడో రోజున వేకువ జామునుంచే మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు. ఊరేగింపులూ, విశేషమైన పూజలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

ఎలా చేరుకోవచ్చు

ఈ ఆలయం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఉంటుంది. విశాఖపట్నం వరకూ విమానం లేదా రైల్లో చేరుకుంటే అక్కడినుంచీ లేదా చోడవరం నుంచీ ఆలయానికి చేరుకునేందుకు బస్సులూ, ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి.

- బొద్దల పైడిరాజు, పాడేరు డిజిటల్‌
ఫొటోలు: మేడపల్లి గురునాథ్‌, న్యూస్‌టుడే పాడేరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు