ఆర్గంజాపైన పూల అందాలు!

మొన్న మొన్నటి దాకా జర్దోసీ మెరుపులు జిగేల్‌ మనిపించాయి. తర్వాత ఎంబ్రాయిడరీ హంగులు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఫ్లోరల్‌ పెయింటింగ్‌ వంతు. అందులోనూ ఆర్గంజా చీరలపైన వేసిన పెయింటింగ్‌లదే నయా ట్రెండు మరి. ఫ్యాషన్‌ ఎప్పుడూ

Published : 24 Apr 2022 01:29 IST

ఆర్గంజాపైన పూల అందాలు!

మొన్న మొన్నటి దాకా జర్దోసీ మెరుపులు జిగేల్‌ మనిపించాయి. తర్వాత ఎంబ్రాయిడరీ హంగులు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఫ్లోరల్‌ పెయింటింగ్‌ వంతు. అందులోనూ ఆర్గంజా చీరలపైన వేసిన పెయింటింగ్‌లదే నయా ట్రెండు మరి. ఫ్యాషన్‌ ఎప్పుడూ నిలకడగా ఉండదు. కొత్తదనాల్ని చుట్టుకొనే కాదు, పాతవాటికి నయా సొగసులద్ది కూడా ఎప్పటికప్పుడు సరికొత్తగా హొయలు పోతుంటుంది. అలాంటివాటిల్లో ఆర్గంజా ఫ్యాబ్రిక్‌ ఒకటి. చాలా పట్టు వస్త్రాల మాదిరిగానే సిల్క్‌ ఆర్గంజాకి కూడా చైనానే పుట్టినిల్లు. సాధారణంగా తేలిగ్గా ఉండే పట్టు దారాలతో నేస్తారీ వస్త్రాన్ని. అయితే కాలక్రమంలో సింథటిక్‌, పాలియెస్టర్‌, నైలాన్‌ వంటి వాటి నుంచీ తయారు చేస్తున్నారు. వీటిల్లో క్రిస్టల్‌ ఆర్గంజా, క్రష్డ్‌ ఆర్గంజా, శాటిన్‌ ఆర్గంజా, మిర్రర్‌ ఆర్గంజా వంటివెన్నో రకాలు ఉన్నాయి. అయితే, వీటిపైన స్క్రీన్‌ ప్రింటింగ్‌, డిజిటల్‌ ప్రింటింగ్‌ డిజైన్లను నిన్నమొన్నటి వరకూ ఇష్టపడ్డారు. తర్వాత త్రెడ్‌ ఎంబ్రాయిడరీ కూడా కొన్నాళ్లు అలరించింది. ఇప్పుడు రకమేదైనా విరిసిన సుమాలదే ఆధిపత్యం. ఆర్గంజా ఫ్యాబ్రిక్‌ పారదర్శకంగా కనిపిస్తూ, ఒకింత మెరుపుతో, లేలేత రంగుల్లో ఆకట్టుకుంటుంది. అందుకే డిజైనర్లు దీన్నే కాన్వాసుగా మార్చి తమ కుంచెలతో హరివిల్లు వర్ణాల్లో పూలనూ, లతలనూ అందంగా గీసేస్తున్నారు. త్రీడీ ఎఫెక్ట్‌లతో తీర్చిదిద్దుతున్నారు. సహజంగా కనిపించే ఈ పూలు మగువల మనసుని ఎంతగానో దోచుకుంటు న్నాయి. ఇక, అక్రిలిక్‌ పెయింటింగ్‌లకు చమ్కీలను చేర్చి వేసిన డిజైన్లు పార్టీవేర్‌గా తళుక్కున మెరుస్తున్నాయి. కుర్తా ఎంత సాదాగా ఉన్నా, ఇదొక్కటి చాలు కట్టుకున్న వారి లుక్కు మార్చడానికి. ఇలా హ్యాండ్‌ పెయింటింగ్‌ వేసిన వస్త్రం రెడీమేడ్‌గా దొరుకుతోంది. లేదంటే కాస్త సమయం వెచ్చించి మనమే వేసుకోవచ్చు కూడా.


బాక్సు బ్యాగుకి భలే క్రేజు!

ఫ్యాషన్‌ అంటే దుస్తులూ, నగలే కాదు... దానికి నప్పే యాక్సెసరీలు కూడా. పట్టుచీర కట్టినా... పాశ్చాత్య శైలినే అనుకరించినా మగువల చేతిలో బ్యాగు మాత్రం తప్పనిసరి. ఒకప్పుడు విలువైన వస్తువులూ, డబ్బులూ పెట్టుకోవడానికే బ్యాగుని వాడేవారు. కానీ, ఇప్పుడదో ఫ్యాషన్‌ స్టేటస్‌. అందుకే, సౌకర్యంతోపాటు స్టైల్‌నీ అందించే హ్యాండు బ్యాగు ఎంపికలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు ఈతరం మహిళలు. ఈ విషయం గమనించే... సందర్భానికీ, ఆహార్యానికీ నప్పేట్లు... ఆకృతిలో, అలంకరణలో వైవిధ్యం కనిపించేట్లు రూపొందించిన నయా డిజైన్లు ఎన్నింటినో మార్కెట్‌లోకి తెస్తున్నారు తయారీదారులు. అలాంటి వాటిల్లో ప్రస్తుతం బాక్సు బ్యాగు ట్రెండ్‌ నడుస్తోంది. చతురస్ర, దీర్ఘ చతురస్రాకారాల్లో రూపొందించిన ఈ హ్యాండ్‌బ్యాగులు చూడ్డానికి అచ్చం డబ్బాల్లానే ఉంటాయి. వీటిల్లో ఎక్కువ వస్తువుల్నే పెట్టుకోవచ్చు కూడా. ఈవెనింగ్‌ పార్టీలూ, గెట్‌టుగెదర్లకు ఈ బాక్సు బ్యాగులు భలే నప్పుతాయి. అయితే, ఈ తరహా బ్యాగులను భుజానికి వేలాడదీసుకునే బదులు మణికట్టుకి తగిలించుకుంటే ట్రెండీ లుక్‌ వస్తుంది. ఈ బాక్సు బ్యాగుల్లో సాదా లెదర్‌ రకాలు హుందాగా కనిపించేలా చేస్తాయి. ప్రింట్లతో పాటు పూసలూ, పూలూ వంటి హంగులు చేర్చినవి పార్టీలకు నప్పుతాయి. ముచ్చటైన ఆకృతుల్లో మురిపిస్తున్న ఇవి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు