లలితా సహస్రనామాలు పుట్టింది ఇక్కడే!

భక్తులు చేసే లలితా సహస్రనామ పారాయణాలతో ప్రతిధ్వనించే ఈ తిరుమేయచ్చూరు లలితాంబిక ఆలయాన్ని దర్శించుకుంటే... కోరిన కోర్కెలు నెరవేరతాయనీ, అనారోగ్యాలు నయమవుతాయనీ అంటారు.

Updated : 22 Feb 2024 14:57 IST

భక్తులు చేసే లలితా సహస్రనామ పారాయణాలతో ప్రతిధ్వనించే ఈ తిరుమేయచ్చూరు లలితాంబిక ఆలయాన్ని దర్శించుకుంటే... కోరిన కోర్కెలు నెరవేరతాయనీ, అనారోగ్యాలు నయమవుతాయనీ అంటారు. పార్వతీ పరమేశ్వరులు స్వయంభువులుగా వెలసిన ఈ ఆలయాన్ని వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించారని ప్రతీతి.

యిదు అంతస్తుల రాజగోపురంతో, ఆకట్టుకునే నిర్మాణశైలితో, నిత్యం ప్రతిధ్వనించే లలితాసహస్రనామ పారాయణాలతో అలరారే లలితాంబిక ఆలయం... తమిళనాడు, తిరువారూర్‌ జిల్లాలోని తిరుమేయచ్చూరులో ఉంటుంది. ఇక్కడ అమ్మవారు లలితాదేవిగా, శాంతనాయకిగా శ్రీచక్రంపైన ఆశీనురాలై, ప్రసన్నవదనంతో, అభయ ముద్రతో దర్శనమిస్తుంటే... పరమేశ్వరుడు మేఘనాథస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే లలితాసహస్రనామ స్తోత్రం పుట్టింది కాబట్టి ఇక్కడ అమ్మవారి సమక్షంలో ఆ పారాయణం చేస్తే సకల శుభాలూ కలుగుతాయని నమ్మకం. అందుకే ఇక్కడకు వచ్చే భక్తులు ఆలయ ప్రాంగణంలో కూర్చుని లలితను చదివేందుకు ప్రాధాన్యం ఇస్తారు.

స్థలపురాణం

భండాసురుడు అనే రాక్షసుడు దేవతల్నీ, రుషుల్నీ ఇబ్బందిపెడుతుండటంతో వాళ్లందరూ జగన్మాతకు మొరపెట్టుకున్నారట. దాంతో జగన్మాత ఆ అసురుడిని సంహరించిందట. ఆ తరువాత కూడా శక్తిస్వరూపిణి ఆగ్రహం చల్లారకపోవడంతో... అది గ్రహించిన పరమేశ్వరుడు దేవిని భూలోకానికి వెళ్లి మనోన్మణి పేరుతో తపస్సు చేయమంటూ ఆదేశించాడట. అలా దేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేసి కరుణామయిగా మారి, లలితాదేవిగా కొలువుదీరిందని కథనం. ఆ తరువాత లలితాదేవి
ఆదేశానుసారం అష్టవాగ్దేవతలైన వసిని, కామేశ్వరి, అరుణ, విమల, జయిని, మోదిని, సర్వేశ్వరి, కౌళిని కలిసి ఇక్కడే లలితాసహస్రనామాల్ని రచించారట. ఇది జరిగిన కొన్నాళ్లకు అగస్త్య మహర్షి కోరిక మేరకు హయగ్రీవుడు ఈ ఆలయంలోనే మొదటిసారి లలితాసహస్ర నామస్తోత్రాన్ని ఆ మహర్షికి ఉపదేశించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో శివపార్వతులతోపాటూ సూర్యారాధనకూ ప్రాధాన్యం ఇవ్వడం వెనుకా ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. ఓసారి సూర్యుడి రథసారథి అయిన అరుణుడు శివుడిని పూజించేందుకు కైలాసానికి వెళ్లాలనుకున్నప్పుడు... సూర్యుడు అతడి వైకల్యాన్ని గుర్తుచేస్తూ అవమానపరిచాడట. అయినా అరుణుడు వినకుండా శివుడిని దర్శించుకునేందుకు వెళ్లాడట. తన భక్తుడిని అవమానించడం సహించని పరమేశ్వరుడు సూర్యుడిని శపించడంతో కళతప్పి నల్లగా మారిపోయాడట. దాంతో సూర్యుడు ఇక్కడే పార్వతీపరమేశ్వరుల్ని పూజించి శాపవిమోచనాన్ని పొందాడంటారు. అందుకే ఇక్కడ సూర్యారాధనకూ ప్రాధాన్యం ఇస్తారనీ... అదేవిధంగా చైత్రమాసంలో ఏడు రోజులపాటు పరమేశ్వరుడిపైన సూర్య కిరణాలు పడతాయనీ చెబుతారు.

నేతిలో దేవి దర్శనం...

ఈ ఆలయంలో పర్వదినాలతోపాటు  రథసప్తమినాడు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే విధంగా శక్తిస్వరూపిణి అయిన లలితాదేవికి నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించినా విజయదశమి నాడు... చేసే నివేదనను చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. ఆ రోజున ఎక్కువ మోతాదులో పొంగలి, పులిహోర, దద్ధ్యోజనాన్ని వండి... ఓ వరుసక్రమంలో పేరుస్తారు. పొంగలిని ఓ చిన్న నీటిగుంటలా చేసి అందులో కాచిన నెయ్యిని ఎక్కువమొత్తంలో వేయడంతో అది చూడ్డానికి చిన్న నీటి కొలనులా ఉంటుంది. ఆ నేతిలో సర్వ ఆభరణాలు దాల్చి మందహాసంతో ఉన్న దేవి ప్రతిబింబం కనిపిస్తుందనీ... ఆ రూపాన్ని చూస్తే అనారోగ్యాలు నయమై, సకల శుభాలూ కలుగుతాయనీ భక్తుల విశ్వాసం. అందుకే విజయదశమినాడు వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు. అదే విధంగా ఇక్కడ షష్టిపూర్తి-  సహస్ర చంద్రదర్శన వేడుకల్ని చేసుకునేందుకూ భక్తులు వస్తుంటారు. ఈ ప్రాంతంలోనే శనీశ్వరుడు, వాలీ, సుగ్రీవుడు.. జన్మించినట్లుగా చెబుతారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఆయుష్షు - మృత్యుంజయ హోమాలు చేయించుకునేందుకూ ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ నవగ్రహ విగ్రహాలు లేకపోయినా పన్నెండు రాశులకు చిహ్నంగా పన్నెండు నాగమూర్తులు ఉంటాయి. పరమేశ్వరుడు పార్వతీదేవిని ప్రసన్నం చేసుకునే అరుదైన విగ్రహాన్నీ ఈ ఆలయంలో చూడొచ్చు.

ఎలా చేరుకోవచ్చు

తమిళనాడు, తిరువారూర్‌లోని పేరాలం రైల్వే స్టేషన్‌లో దిగితే అక్కడినుంచి ఆలయానికి వెళ్లేందుకు బస్సులూ ఆటోలూ అందుబాటులో ఉంటాయి. విమానంలో రావాలను కునే భక్తులు తిరుచ్చి విమానాశ్రయంలో దిగితే... అక్కడినుంచి ప్రైవేటు వాహనాలూ, బస్సుల్లో ఆలయానికి చేరుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..