సప్తర్షులు ప్రతిష్ఠించిన సంగమేశ్వరుడు..!

రెండు నదుల సంగమ స్థానంలో నిర్మించిన ఆలయం... స్వామిపైన సూర్యోదయం నుంచీ సూర్యాస్తమయం వరకూ పడే సూర్యకిరణాలు... శివలింగంపైన కనిపించే గోవు కాలి గిట్టల గుర్తులు... ఈ ప్రత్యేకతలన్నీ ఉమ్మడి కడప జిల్లాలోని సంగమేశ్వర ఆలయంలో కనిపిస్తాయి.

Updated : 29 Feb 2024 14:34 IST

రెండు నదుల సంగమ స్థానంలో నిర్మించిన ఆలయం... స్వామిపైన సూర్యోదయం నుంచీ సూర్యాస్తమయం వరకూ పడే సూర్యకిరణాలు... శివలింగంపైన కనిపించే గోవు కాలి గిట్టల గుర్తులు... ఈ ప్రత్యేకతలన్నీ ఉమ్మడి కడప జిల్లాలోని సంగమేశ్వర ఆలయంలో కనిపిస్తాయి. పద్నాలుగో శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని చోళులూ, విజయనగర రాజుల నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి, అన్నమాచార్యుల వరకూ ఎందరో దర్శించుకోవడం విశేషం.

చుట్టూ పచ్చని పంటపొలాలు, ఎత్తైన కొండలు, రెండు నదుల సంగమం దగ్గర నిరంతరం శివనామస్మరణతో కనిపిస్తుంది సంగమేశ్వర ఆలయం. భాస్కర క్షేత్రంగా పిలిచే ఈ ఆలయం ఉమ్మడి కడపజిల్లా, వీరపునాయుడిపల్లె మండలంలోని అనిమెలలో ఉంటుంది. పావని-పాపఘ్ని నదుల సంగమ స్థానంలో ఆలయాన్ని నిర్మించడం వల్ల ఈ స్వామికి సంగమేశ్వరుడనే పేరు వచ్చింది. సప్తర్షులు స్థాపించిన ఈ విగ్రహాన్ని ఎందరో  రాజులు దర్శించుకుని.. ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లుగా ఇక్కడున్న శిలాశాసనాలు తెలియజేస్తున్నాయి. సాధారణంగా ఇతర  శివాలయాల్లో
శివలింగం పైన ఎలాంటి గుర్తులు కనిపించవు. కానీ ఇక్కడ స్వామిపైన ఆవుకాలి గిట్టల గుర్తులతోపాటు శిఖ కూడా ఉంటుంది.  

స్థలపురాణం

పూర్వం... అనిమెల సమీపంలో ఉన్న శిఖరంపైన సప్తర్షులు నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఆ తరువాత గ్రామానికి తూర్పు వైపున పావని - పాపఘ్ని నదులు కలిసేచోట శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసుకునేవారట. కాలక్రమంలో ఆ శివలింగం భూమిలోకి పూడుకు పోవడంతో ఎవరూ పట్టించుకోలేదట. కొన్నాళ్లకు శివలింగం పూడుకుపోయిన ప్రాంతానికి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే పశువులు మేతకు వచ్చేవి. వాటిలో ఓ ఆవు మందతో పాటు మేత మేసి సాయంకాలం ఇంటికి వెళ్లే సమయంలో అక్కడున్న ఓ పుట్ట దగ్గర నిల్చుని పాలు జారవిడిచి ఒట్టి పొదుగుతో ఇంటికెళ్లేదట. కొన్నాళ్లకు ఆ ఆవు యజమానికి సందేహం వచ్చి గమనించి ఆవు పుట్టలోకి పాలు వదలడాన్ని చూసి... కోపంతో గొడ్డలిని విసిరేశాడట. ఆ గొడ్డలి పుట్టలో ఉన్న శివలింగంపైన పడటంతో ఆ అలికిడికి బెదిరిన ఆవు కాలి గిట్టతో శివలింగాన్ని తొక్కిందట. అతను మళ్లీ ఆవును కొట్టబోతే ఓ మహర్షి వచ్చి అడ్డుకుని పుట్టలో ఉన్న శివలింగాన్ని చూపించడంతో యజమాని భయపడ్డాడట. దీనికి పరిహారంగా శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పి ఆ మహర్షి వెళ్లిపోయాడట. అలా ఆ ఆవు యజమాని పుట్టను తవ్వించి శివలింగాన్ని పానవట్టంతో సహా వెలికితీసి ప్రతిష్ఠించాడని కథనం. దీనికి నిదర్శనంగా శివలింగంపైన గొడ్డలి దెబ్బ, గోవు కాలిగిట్టల గుర్తులతోపాటు శిఖ కూడా ఉంటుందని అంటారు. ఈ ఆలయాన్ని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామితోపాటు అన్నమాచార్యులు పలుమార్లు దర్శించుకుని స్వామికి పూజలు చేసినట్లుగా చెబుతారు.

ఇతర దేవతలూ కొలువుదీరి...

ఈ ఆలయాన్ని విజయనగర రాజుల వాస్తు పద్ధతిలో నిర్మించారు. ఉత్తరభాగంలో పాపఘ్ని, దక్షిణ భాగంలో పావనీ నదులు ఉంటే పడమరంవైపు లోయ,
ఉత్తరంవైపు అందమైన కొండ అందాల మధ్య ఈ ఆలయం కనిపిస్తుంది.

ఆలయానికి నాలుగు దిక్కులలో

మహాద్వారాలు శోభాయమానంగా స్వాగతిస్తాయి. ఈ ఆలయంలో త్రిమూర్తులతోపాటూ దుర్గ, వినాయక, కుమారస్వాముల విగ్రహాలనూ దర్శించుకోవచ్చు. అలాగే సూర్యోదయం నుంచీ సూర్యాస్తమయం అయ్యేవరకూ స్వామిపైన సూర్యకిరణాలు పడటాన్నీ భక్తులు చూడొచ్చు. వీటన్నింటితోనే ఈ ఆలయానికి భాస్కర క్షేత్రమనే పేరు వచ్చింది. ఇక్కడ శివలింగానికి రోజువారీ అభిషేకాలు చేయడంతోపాటూ...  కార్తిక మాసంలో, మహాశివరాత్రి సమయంలో విశేషమైన పూజలు ఉంటాయి.

ఎలా చేరుకోవచ్చు  

అనిమెల సంగమేశ్వరాలయానికి రైల్లో రావాలనుకునే భక్తులు యర్రగుంట్ల, కడప వరకూ వస్తే... అక్కడి నుంచి ఆలయానికి వెళ్లేందుకు బస్సులూ ఆటోలూ ఉంటాయి. బస్సుల్లో రావాలనుకుంటే... ఎర్రగుంట్ల-వేంపల్లెకు వెళ్లే బస్సు మార్గంలో వీరపునాయునిపల్లెకు చేరుకుని అక్కడి నుంచి ఆటోలో ఆలయానికి వెళ్లవచ్చు.

గుండ్రాతి రాజేష్‌గౌడ్‌, ఈనాడు, కడప

చిత్రాలు: నందకుమార్‌, న్యూస్‌టుడే, వీరపునాయునిపల్లె


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..