ఊరంతా సూర్యనారాయణుడు

ఆలయంపైన నలభై అడుగుల ఎత్తులో ఉండే సూర్యుడి విగ్రహం దాదాపు టౌను అంతా కనిపించడం కర్నూలు ప్రత్యేకం. ఇక మందిరంలో కొలువుదీరిన ప్రత్యక్ష నారాయణుడు అనారోగ్యాలను నయం చేస్తాడని అంటారు.

Published : 21 Jan 2023 23:56 IST

ఊరంతా సూర్యనారాయణుడు

ఆలయంపైన నలభై అడుగుల ఎత్తులో ఉండే సూర్యుడి విగ్రహం దాదాపు టౌను అంతా కనిపించడం కర్నూలు ప్రత్యేకం. ఇక మందిరంలో కొలువుదీరిన ప్రత్యక్ష నారాయణుడు అనారోగ్యాలను నయం చేస్తాడని అంటారు. దత్తపీఠం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సూర్యదేవాలయం... అరసవల్లి తరువాత రెండో అతి పెద్దదని చెబుతారు.

నిత్యపూజలూ, హోమాలూ, యాగాలూ... భక్తుల రద్దీతో కళకళలాడే ఈ సూర్యదేవాలయాన్ని గణపతి సచ్చిదానందస్వామి దత్తపీఠం ఆధ్వర్యంలో నిర్మించారు. కర్నూలు టౌనులో వర్ణరంజితంగా ఉండే ఈ ఆలయంపైన సప్తరథాలతో కదలివచ్చే సూర్యనారాయణుడి విగ్రహం నలభై అడుగుల ఎత్తు ఉంటుందనీ ఈ విగ్రహం దాదాపు కర్నూలు టౌను అంతా కనిపిస్తుందనీ అంటారు. ఇక, ఆలయం లోపలికి వెళ్తే గోడలపైన సూర్య నమస్కారాలకు చెందిన నమూనా విగ్రహలూ... పైకప్పు పైన పన్నెండు రాశులూ, నవగ్రహాలూ, దశావతారాల రూపాలనూ చూడొచ్చు. గర్భగుడిలోనూ సూర్యుడు పది అడుగుల్లో సప్త అశ్వాలతో దర్శనమిస్తాడు. అరసవల్లి తరువాత రెండో పెద్ద సూర్యదేవాలయంగా గుర్తింపు పొందిన ఈ మందిర నిర్మాణం ఎలా జరిగిందంటే... 

నిర్మాణం ఇలా..

కొన్ని సంవత్సరాల క్రితం... గణపతి సచ్చిదానంద స్వామి ఇక్కడ దత్త పీఠాన్ని ఏర్పాటు చేసినప్పుడు స్థానికులు తలా సెంటు భూమి చొప్పున ముప్ఫైఎనిమిది సెంట్ల భూమిని ఇచ్చారట. ఆ భూమిని లోకకల్యాణం కోసం ఉపయోగించాలనుకున్న సచ్చిదానంద స్వామి... సూర్యదేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారట. అలా 2014లో ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారనీ తరువాత దాతలూ ముందుకు రావడంతో సుమారు ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని నిర్మించి... 2019లో రథసప్తమినాడే విగ్రహ ప్రతిష్ఠ చేశారనీ అంటారు. మందిరంలో స్వామి ఛాయాదేవి, ఉషాదేవితో కలిసి భక్తులకు దర్శనమిస్తాడు. 

నిత్యహోమాలూ... పూజలూ...

ఉమ్మడి రాష్ట్రాల నుంచి రోజూ వందలమంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయంలో ప్రతి ఆదివారం సూర్య యంత్రానికి అభిషేకం, అరుణహోమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతి సంక్రమణానికీ మూలవిరాట్టుకు పాలాభిషేకాన్ని చేస్తారు. పౌర్ణమినాడు సత్యనారాయణస్వామి వ్రతం, సౌర యాగం జరిపిస్తారు. ఇక్కడ రోజూ చేసే నిత్యపూజలతోపాటు రోజుకో హోమం, అరుణ పారాయణం, వేద పారాయణం ఉంటుంది. అనారోగ్యాలతో బాధపడే భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని మొక్కుకుంటారనీ... తమ సమస్యలు నయమయ్యాక శక్తికొద్దీ గోధుమల్ని స్వామికి సమర్పించుకోవడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారనీ చెబుతారు ఇక్కడి అర్చకులు. ఈ ఆలయంలోని హనుమంతుడిని కార్యసిద్ధి ఆంజనేయుడిగా పిలుస్తారు. మనసులో ఏదైనా అనుకుని నలభైఒక్కరోజులు స్వామిని దర్శించుకుంటే కోరికలు నెరవేరతాయని చెబుతారు. ఈ ఆలయంలో సూర్యుడు, హనుమంతుడు కాకుండా వినాయకుడు, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, శివుడు, పార్వతి, దత్తాత్రేయుడి ఉపాలయాలనూ చూడొచ్చు.

ఎలా చేరుకోవచ్చు

ఈ ఆలయం... కర్నూలు- అనంతపూర్‌కు వెళ్లే హైవే మార్గంలో గుత్తి పెట్రోల్‌ బంకు దగ్గర ఉంటుంది. కర్నూలు వరకూ రైలు లేదా బస్సుల్లో చేరుకుంటే అక్కడి నుంచి ఆలయానికి వెళ్లేందుకు ఆటోలు అందుబాటులో ఉంటాయి.


ఆలయంపైన ప్రముఖుల విగ్రహాలు

సాధారణంగా ఆలయాల గోడలపైన పురాణకథలకు సంబంధించిన విగ్రహాలూ, గోవులూ, దేవతామూర్తులను చెక్కడం చూస్తుంటాం. కానీ రాజస్థాన్‌లోని బిట్స్‌పిలానీలో ఉన్న బిర్లామందిర్‌ శారదా పీఠంలో మాత్రం దేవతల విగ్రహాలతోపాటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన ప్రముఖ శాస్త్రవేత్తలూ, మహర్షులూ, తత్వవేత్తలూ, రాజకీయవేత్తల విగ్రహాలనూ చెక్కడం విశేషం. నిజానికి బిర్లామందిర్‌ అనగానే పాలరాయి నిర్మాణం, అందులో కొలువైన వేంకటేశ్వరస్వామి విగ్రహమే గుర్తొస్తుంది కదూ... బిర్లాసంస్థ నిర్మించే ఈ ఆలయాలు దేశవ్యాప్తంగానే ఉన్నా... బిట్స్‌పిలానీ క్యాంపస్‌లోని బిర్లామందిర్‌లో మాత్రం సరస్వతీదేవి దర్శనమిస్తుంది. పిలానీ శారదాపీఠంగా పిలిచే ఈ ఆలయాన్ని 1959లో ఆ సంస్థ నిర్మించింది. ఆకట్టుకునే నిర్మాణశైలితో ఉన్న ఈ ఆలయాన్ని దాదాపు డెబ్భై స్తంభాలపైనే కట్టారు. విద్యార్థులు ఉండే ప్రాంగణం కాబట్టి ఈ ఆలయం గోడలపైన దేవతలతోపాటూ... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన ప్రముఖుల విగ్రహాలనూ చెక్కారట. బాగుంది కదూ!

 యడ్లపాటి బసవ సురేంద్ర, కర్నూలు, ఈనాడు
 ఫొటోలు: సైదేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..