మాంత్రిక వాస్తవికత

స్పానిష్‌ రచయిత మార్క్వెజ్‌ రాసిన దృశ్యకావ్యమిది. ఇంగ్లిష్‌లో ‘వన్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌’. ఐంద్రజాలికుడైన మెల్కియాదిస్‌ తన మాతృభాష సంస్కృతంలో రాసిన ఈ ఏడు తరాల గాథకు కేంద్ర స్థలం మకోందో అనే ఊరు.

Updated : 26 Mar 2023 00:56 IST

మాంత్రిక వాస్తవికత

స్పానిష్‌ రచయిత మార్క్వెజ్‌ రాసిన దృశ్యకావ్యమిది. ఇంగ్లిష్‌లో ‘వన్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌’. ఐంద్రజాలికుడైన మెల్కియాదిస్‌ తన మాతృభాష సంస్కృతంలో రాసిన ఈ ఏడు తరాల గాథకు కేంద్ర స్థలం మకోందో అనే ఊరు. బుయెందియా కుటుంబపు ఏడు తరాల చరిత్ర మౌఖిక, లిఖిత కథన సంప్రదాయాలతో నడుస్తుంది. ఆధునిక కాలపు అయస్కాంతాలూ, టెలిస్కోపుల సైన్సే కాకుండా మూఢ నమ్మకాలూ, జానపద కథలూ కథనంలో భాగమై మాంత్రిక వాస్తవికతను ఆవిష్కరిస్తాయి. ‘మ్యాజిక్‌ రియలిజం’ అంటేనే గుర్తొచ్చే ఈ నవల అంతర్యుద్ధాలతో పాటు ప్రేమలూ, మోహాలూ, కాంక్షలూ, విరహాలూ, కలలూ, భయాల సమ్మిళితం. నవల అనువాదం ఆద్యంతం తెలుగు పలుకుబళ్లతో సరళంగా సాగుతుంది.          

వందేళ్ల ఏకాంతం (నవల)
అనువాదం: పి.మోహన్‌
పేజీలు: 254; వెల: రూ. 220/-
ప్రతులకు: ఫోన్‌- 9949052916

సీహెచ్‌. వేణు


క్యాంపస్‌ కథ

లభై ఏళ్లక్రితం ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న రచయిత అక్కడి తన అనుభవాలను అక్షరీకరించాలన్న తపనతో రాసిన నవల ఇది. రైతు బిడ్డ జగన్‌ మొదటిసారి నగరానికి వచ్చి యూనివర్సిటీలో చేరి విద్యార్థి నాయకుడిగా ఎదుగుతాడు. తోటి విద్యార్థినీ విద్యార్థుల అభిమానాన్ని చూరగొంటాడు. క్యాంపస్‌ రాజకీయాలూ మూగప్రేమలూ అంతస్తుల తారతమ్యాన్ని మరచి చేసే స్నేహాలూ కథను నడిపిస్తాయి. తీరా చదువైపోయేసరికల్లా విద్యార్థి నాయకు లంతా ఉద్యోగాల్లో కుదురుకోవడం, లోకం పోకడను తెలుసుకోలేని జగన్‌ అనామకంగా ఎందరో నిస్సహాయులైన గ్రామీణ విద్యార్థులకు ప్రతీకలా మిగిలిపోవడం కథ. నాటికీ నేటికీ సమాజంలో వచ్చిన మార్పుల్ని తెలిపే నవల.

దూరతీరాలు (నవల)
రచన: చల్లా జయపాల్‌ రెడ్డి
పేజీలు: 131; వెల: రూ.200/-
ప్రతులకు: ఫోన్‌- 9182205830  

పద్మ


సినిమా చరిత్రలో తెలంగాణ

తెలుగు సినిమా చరిత్ర విస్మరించిన పార్శ్వాన్ని చూపే పుస్తకమిది. సినిమా రంగానికి తెలంగాణ నుంచి సేవలందించిన వారి గురించి లోతుగా పరిశోధన చేసి దీన్ని అందించారు రచయిత. తెలంగాణ గడ్డమీద పుట్టిపెరిగిన ఎందరో ప్రముఖులు చిత్రసీమలో రాణించారు. వారిలో తొలిసినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకుని ‘తాళిబొట్టు మాధవరావు’గా పేరొందిన తిరునగరి మాధవరావు ప్రముఖులు. నాటకాల్లో ఆసక్తి చూపుతూ చక్కగా పాడుతున్న ఆయనను సినిమాల్లో ప్రయత్నించమని అందరూ ప్రోత్సహించడంతో మద్రాసు వెళ్లి దర్శకుడిగా మారి చిల్లరదేవుళ్లు, కన్నతల్లి, బహారోంకి మంజిల్‌ లాంటి సినిమాలు తీశారు. సినీ అభిమానులు చదవాల్సిన పుస్తకమిది.

చిల్లర దేవుళ్లు మాధవరావు
(జీవితం- సినిమాలు)
రచన: హెచ్‌. రమేష్‌బాబు
పేజీలు: 128; వెల: రూ.125/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

శ్రీ


మెట్రో కవితలు

ప్రజా రవాణాలో సరికొత్త అధ్యాయానికి తెరతీసిన మెట్రో రైళ్ల వ్యవస్థ ఆలోచన నుంచి ఆచరణ దాకా ఎదుర్కొన్న సవాళ్లెన్నో. మారిన ప్రభుత్వాలనూ మారని సమాజ ధోరణులనూ ఎదుర్కొంటూ, పరిష్కరించుకుంటూ అంత పెద్ద ప్రాజెక్టు సాకారం కావడం వెనక దాని రూపశిల్పి ఎన్వీయస్‌ రెడ్డి కృషి అపూర్వం. తొలినాళ్ల ఆశలతో మొదలుపెట్టి కష్టనష్టాల మీదుగా ప్రయాణించి కార్యసాధకులై నగర కీర్తిపతాకను ఎగరేసేవరకూ తమ అనుభవాలకు అక్షర రూపమిచ్చి ఆయనే రాసిన కవితలివి. పాలనాధికారిగా పనుల్లో మునిగి తేలుతూనే మాత్రాఛందస్సులో పలు అధ్యాయాలుగా రాసిన కవితలు మొత్తం మెట్రో చరిత్రను కళ్లకు కడతాయి.

మేఘపథం
రచన: ఎన్వీయస్‌ రెడ్డి

పేజీలు: 396; వెల: రూ. 500/-
ప్రతులకు: ఎమెస్కో బుక్స్‌

సుశీల



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..