ఐదొందల వికెట్లే లక్ష్యం!

కుల్‌దీప్‌ యాదవ్‌... భారత్‌ తరఫున వన్డేల్లో తక్కువ మ్యాచ్‌(88)లలో 150 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌. తాజాగా ఆసియా కప్‌లో తన స్పిన్‌ మాయాజాలం చూపించాడు.

Updated : 24 Sep 2023 15:41 IST

కుల్‌దీప్‌ యాదవ్‌... భారత్‌ తరఫున వన్డేల్లో తక్కువ మ్యాచ్‌(88)లలో 150 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌. తాజాగా ఆసియా కప్‌లో తన స్పిన్‌ మాయాజాలం చూపించాడు.
ఈ‘చైనామేన్‌’ బౌలర్‌ గురించి మరిన్ని విషయాలు...


కొత్త వెర్షన్‌లో

2019 ప్రపంచకప్‌ ఆడా.ఈసారి మళ్లీ ఎంపికయ్యా. మధ్యలో ఎన్నో ఒడుదొడుకులు. చాలా రోజులు జట్టుకి దూరమయ్యా. ‘21 ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాలేదు. ఆపైన గాయం అయింది. దాన్నుంచి కోలుకుని రనప్‌ మార్చడంతో వేగం పెరిగింది. ‘22 ఐపీఎల్‌లో దిల్లీ జట్టు ఎంపిక చేసింది. నా ధర రూ.6కోట్ల నుంచి రెండు కోట్లకు పడిపోయింది. అయితే, అన్ని మ్యాచ్‌లు ఆడిస్తామని దిల్లీ భరోసా ఇచ్చింది. ఆ సీజన్లో 21 వికెట్లు తీసుకోవడంతో ఆత్మవిశ్వాసం వచ్చింది. తిరిగి భారత జట్టులోకి వచ్చా.  


ప్రేమ కష్టం...

ఫుట్‌బాల్‌ అంటే ఇష్టం. బార్సిలోనా, లివర్‌పూల్‌ జట్లకి ఫ్యాన్‌ని. వీడియోగేమ్స్‌, టేబుల్‌ టెన్నిస్‌ ఆడుతుంటా. సినిమాలు చూస్తా. అమ్మాయిలతో మాట కలపాలంటే బెరుకు, ఇక ప్రేమలో ఎలా పడగలను. పెద్దల కుదిర్చిన పెళ్ళి చేసుకుంటా.


అక్రమ్‌ స్ఫూర్తితో...

చిన్నప్పుడు సరదాగా గ్రౌండ్‌కి వెళ్లేవాణ్ణి. తర్వాతే క్రికెట్‌మీద ఇష్టం ఏర్పడింది. వసీం అక్రమ్‌ని చూశాక ఫాస్ట్‌ బౌలింగ్‌ చేసేవాణ్ని. పదో ఏట కపిల్‌ పాండే దగ్గర శిక్షణకు చేరేటప్పటికి సన్నగా, పొట్టిగా ఉండేవాణ్ని. ఫాస్ట్‌బౌలింగ్‌కు సరిపోనని స్పిన్‌కి మారమంటే... అయిష్టంగానే అంగీకరించా. నా స్పిన్‌ బౌలింగ్‌ శైలిని చూసి ఆశ్చర్యపోయారు. ‘చైనామేన్‌ బౌలింగ్‌.. అరుదైన శైలి... కష్టపడితే ఫలితం ఉంటుంద’న్నారు.


కుటుంబ త్యాగాలు

నాన్న రామ్‌సింగ్‌ యాదవ్‌. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఇటుక బట్టీల వ్యాపారం ఉండేది. నా క్రికెట్‌ కోసమని కాన్పూర్‌కు మారి అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. వ్యాపారంలో ఎన్నోసార్లు నష్టాలు వచ్చాయి. అయినా క్రికెట్‌ మాన్పించలేదు. ఏడో తరగతికి వచ్చినప్పట్నుంచీ స్కూల్‌కి వెళ్లింది తక్కువ. ఉదయం, సాయంత్రం ప్రాక్టీసు చేసేవాణ్ని. నా చదువు గురించి అమ్మ బాధపడేది. నాకు సైన్స్‌ అంటే ఇష్టం. క్రికెటర్‌ కాకుంటే పైలట్‌ అయ్యేవాణ్ణేమో.


టర్నింగ్‌ పాయింట్‌...

నాకప్పటికి 16 ఏళ్లే... రాష్ట్ర అండర్‌-19కి ఆడుతూ... ముంబయిపైన ఏడు వికెట్లు తీశా. అది చూసి ముంబయి ఇండియన్స్‌(ఐపీఎల్‌) తీసుకుంది. ఓరోజు సచిన్‌ సర్‌ నెట్స్‌లో బౌలింగ్‌ వేయ మన్నారు. అప్పుడు ఒకసారి ఆయన్ని ఔట్‌ చేయడం మర్చిపోలేని అనుభవం. ఐపీఎల్‌ లైఫ్‌స్టైల్‌తో జాగ్రత్తగా ఉండాలనీ ఎక్కువగా తిరక్కుండా టైమ్‌కి నిద్రపోవాలనీ చెప్పారు. ఆ జట్టులో రెండేళ్లున్నా. అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడాక కోల్‌కతా తీసుకుంది.  


చాహల్‌తో దోస్తానా

యుజీ చాహల్‌, నేనూ ఒకేసారి జట్టులోకి వచ్చాం. 2018లో దక్షిణాఫ్రికాని వారి గడ్డపైన ఓడించడంలో కీలకపాత్ర పోషించాం. ప్రారంభంలో 34 మ్యాచ్‌లలో ఇద్దరం 135 వికెట్లు తీశాం. ఇప్పటికి టెక్నిక్‌ గురించి మాట్లాడుకుంటాం.


వార్న్‌ని  అనుసరిస్తూ...

ప్రఖ్యాత లెగ్‌ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ బౌలింగ్‌ వీడియో క్యాసెట్లు తెప్పించి శిక్షణ ఇచ్చారు కోచ్‌. నేనూ ఆస్ట్రేలియా జట్టు ఆడే మ్యాచ్‌లు టీవీలో చూసేవాణ్ని. 2017లో ఆస్ట్రేలియా  పర్యటనకు
వెళ్లినప్పుడు వార్న్‌ని కలిసి మాట్లాడా. రోజూ గ్రౌండ్‌లో కనిపించినప్పుడు పది నిమిషాలైనా నిలబడి సూచనలిచ్చేవారు.  ఒకసారి అయిదు వికెట్లు తీసి ఆ మ్యాచ్‌ని తనకు అంకితం ఇచ్చా. టెస్టుల్లో 500 వికెట్లు తీయడం నా లక్ష్యం.


ఇవి ఇష్టం

వంటకం: అమ్మచేసే రాజ్మా -చావల్‌
నటి: జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌
గాయకుడు: కిశోర్‌కుమార్‌
నగరం: న్యూయార్క్‌


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..