35 ప్లస్‌ అయితేనేం..!

టీన్స్‌ నుంచీ ట్వంటీస్‌ మధ్య వయసుంటేనే క్రేజీ హీరోయిన్‌లవుతారన్నది అందరి భావన. కానీ ఈ ముగ్గురూ వయసుతో సంబంధం లేకుండా ప్రేక్షకులపైన గ్లామర్‌ ఖడ్గాలు రువ్వుతున్నారు.

Updated : 21 May 2023 09:32 IST

35 ప్లస్‌ అయితేనేం..!

టీన్స్‌ నుంచీ ట్వంటీస్‌ మధ్య వయసుంటేనే క్రేజీ హీరోయిన్‌లవుతారన్నది అందరి భావన. కానీ ఈ ముగ్గురూ వయసుతో సంబంధం లేకుండా ప్రేక్షకులపైన గ్లామర్‌ ఖడ్గాలు రువ్వుతున్నారు. 35 ఏళ్ళు దాటినా... సుమారు 20 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉంటున్నా...తమ అందం వసివాడలేదని చాటుతున్నారు. అన్నేళ్ళు నిలదొక్కుకోవాలంటే... పుట్టుకతో వచ్చిన అందమో, ఫిట్‌నెస్సో సరిపోదు. దాన్ని మించిన విషయాలు కొన్ని ఉండి తీరాలి. అవేమిటో వాళ్ళనే అడిగితే...


‘స్వీటీ’ అనుష్కా శెట్టి

నుష్క తొలిచిత్రం ‘సూపర్‌’ విడుదలయ్యేటప్పుడు తన వయస్సు పాతికేళ్ళు... అంటే ఒకప్పటి కథానాయికలు విరామం తీసుకునే వయస్సు. అయితేనేం, నాలుగేళ్ళ తర్వాత వచ్చిన ‘అరుంధతి’తో కథానాయిక ప్రాధాన్య సినిమాలకి కేరాఫ్‌గా మారింది. సైజ్‌ జీరో, రుద్రమదేవి, భాగమతి వంటివి తనకంటూ ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. ‘బాహుబలి’లో దేవసేనగా దేశాన్ని మెప్పించింది. త్వరలోనే కుర్రహీరో నవీన్‌ పోలిశెట్టితో కలిసి ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’లో ప్రయోగాత్మక పాత్రలో అలరించబోతోంది. కాస్త రిస్కున్నా సరే ఇలాంటి ప్రయోగాల వల్లే ఇండస్ట్రీలో తాను ఇంతకాలం నిలబడగలిగానని చెబుతోంది అనుష్క. ‘ఓ దశ తర్వాత కొత్త కథల కోసం వెతకడం ఒక్కటే నా పనైంది. ఆ కథల్లోని వైవిధ్యమైన పాత్రలకు తగ్గట్టు నన్ను నేను మలచుకున్నాను... కొత్త విషయాలు నేర్చుకున్నాను. వాటిలో పడి నా వయసుని మరచిపోయాను’ అంటూ నవ్వేస్తుంది.


‘లేడీ సూపర్‌స్టార్‌’ నయనతార

యనతార ఇండస్ట్రీకి వచ్చి ఈ ఏడాదితో ఇరవైయేళ్ళు. కెరీర్‌లో మొదటి పదేళ్ళు మామూలు గ్లామర్‌ బొమ్మలానే కనిపించినా... ఆ తర్వాత పూర్తిగా తన పంథా మార్చుకుంది. అందుకు కారణమూ చెబుతోంది - ‘నేను వచ్చిన కొత్తల్లో ఆడియో రిలీజ్‌ ఫంక్షనో విజయోత్సవమో ఏదైనా సరే... హీరోయిన్‌లని గౌరవించేవాళ్ళు కాదు. ఎక్కడో మూలన కూర్చోమనేవారు. ఆ పరిస్థితి మారితే బావుణ్ణను కున్నాను. నా వంతుగా కొత్త కథల్ని ఎంచుకోవాలనుకున్నాను. అలా ఎంచుకున్నవి వర్కవుట్‌ అయ్యాయి. నా వల్ల ఇండస్ట్రీ దృష్టి మారిపోయిందని చెప్పలేనుకానీ... ఇప్పుడు కొంతలో కొంత నయం’ అంటుంది నయన్‌. అద్సరే... ఇండస్ట్రీలో 20 ఏళ్ళకుపైగా అగ్రకథానాయికగా ఉండటమెలా సాధ్యమైందని అడిగితే ‘కెరీర్‌ పరుగులో ఎప్పుడూ ఎక్కడా ఆగింది లేదు. కాబట్టి, నేనెప్పుడూ సంవత్సరాలు లెక్కపెట్టుకోలేదు...’ అంటోంది గడుసుగా. అన్నట్టు బాలీవుడ్‌లో ఈ ఏడాది షారుఖ్‌ఖాన్‌తో కలిసి ‘జవాన్‌’ సినిమాలో కనిపించబోతోందీ లేడీ సూపర్‌స్టార్‌.


‘క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’ త్రిష

త్రిష కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఎన్నున్నా... 2017 చాలా కీలకం. ఇండస్ట్రీలోకి వచ్చాక తొలిసారి తన సినిమా ఏదీ విడుదలకానీ సంవత్సరం అది. ‘త్రిష ఇక మాజీ హీరోయిన్‌’ అన్నారు విమర్శకులు. కానీ తను భయపడలేదు. ‘96 (తెలుగులో ‘జాను’) సినిమాతో భగ్నప్రేమికురాలిగా సరికొత్తగా కనిపించి కొత్తతరం యువతనీ ఊపేసింది. తన కెరీర్‌ మరోసారి రాకెట్‌ స్పీడ్‌ని అందుకుంది. ఆ రాకెట్‌ చేరుకున్న మరో అద్భుతాకాశమే పొన్నియిన్‌ సెల్వన్‌. ఇందులోని కుందవై పాత్రతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది త్రిష. ‘నాయికగా నాకు అందం ముఖ్యమే కానీ... దానికన్నా నేనెప్పుడూ నా నటనకి మెరుగులు దిద్దుకోవడంపైనే దృష్టిపెట్టాను. నాది నటన అనిపించకుండా వీలున్నంత సహజంగా ఉండేలా శ్రమిస్తున్నాను. ఆ శ్రమకి కాసింత అదృష్టమూ కలిసి ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ వంటి చిత్రాలు వస్తున్నాయి. అవే నన్ను ఇంతకాలం ఇండస్ట్రీలో నిలబెట్టాయి’ అంటోంది త్రిష. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తమిళ మెగాస్టార్‌ విజయ్‌ హీరోగా ‘లియో’ సినిమాలో నటిస్తోంది త్రిష. అవి కాకుండా మరో రెండు భారీ చిత్రాలున్నాయి తన చేతిలో!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..