బంగారు తల్లులు

‘కంటేనే అమ్మ అని అంటే ఎలా.... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా’ అన్నారో కవి. మరి ఈ అమ్మలు కూడా అటువంటి ప్రేమస్వరూపులే. నవమాసాలూ మోసి జన్మనివ్వకపోయినా... అభాగ్యులకు అమ్మ ప్రేమను పంచుతున్నారు.

Updated : 11 Feb 2024 11:52 IST

‘కంటేనే అమ్మ అని అంటే ఎలా.... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా’ అన్నారో కవి. మరి ఈ అమ్మలు కూడా అటువంటి ప్రేమస్వరూపులే. నవమాసాలూ మోసి జన్మనివ్వకపోయినా... అభాగ్యులకు అమ్మ ప్రేమను పంచుతున్నారు.

ప్రేమను పంచుతూ...

కర్ణాటకకు చెందిన నక్షత్రను కన్నవారి చిన్నచూపు ఇంటికి దూరం చేసింది. పదహారేళ్ల వయసులో  దిల్లీ చేరి ఎన్నో బాధల్ని అనుభవించింది. చివరికి  బస్టాండ్‌లో తలదాచుకుంటూ పొట్టకూటి కోసం బిక్షాటన చేస్తూ దుర్భర జీవితాన్ని గడిపింది. తరవాత ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ సభ్యుల సాయంతో కష్టపడుతూనే మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసింది. కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేసింది. కానీ ఆమె కష్టాలన్నీ తీరిపోయాక తన బతుకేదో తాను బతకాలనుకోలేదు. అమ్మప్రేమకి దూరమైన అభాగ్యులకి ఆ ప్రేమను పంచాలనుకుంది. ఆర్థికంగా స్థిరపడ్డాక సొంతరాష్ట్రానికి వెళ్లి 2019లో ‘నమ్మనే సుమ్మానే’ (మనం మాత్రమే) పేరిట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల్నీ, అందరూ ఉండి అనాథలైన పెద్దవాళ్లనీ చేరదీయడం మొదలుపెట్టింది. నక్షత్ర మంచి పనుల్ని చూసిన కొందరు స్నేహితులు ఆమెకి ఆర్థిక సాయం చేయడం మొదలుపెట్టారు. దాంతో ఓ మూడంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకుని సకల సౌకర్యాలతో అనాథలను అమ్మలా చూసుకుంటోంది. ఖర్చుతో కూడుకున్నదే అయినా చిన్నారులకు మంచి స్కూళ్లలో చదువు చెప్పిస్తోంది. వృద్ధులకు కన్నబిడ్డలా సేవ చేస్తూ వారి బాగోగులు చూసుకుంటోంది. నక్షత్ర సేవలకు మెచ్చిన కర్ణాటక ప్రభుత్వం ‘రాజ్యోత్సవ’ పురస్కారంతో ఆమెను సత్కరించి- హోమ్‌ నిర్మాణానికి స్థలం కేటాయించింది. అభాగ్యులను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న నక్షత్ర అమ్మ మనసుకు సలాం కొట్టాల్సిందే కదా.


105 లీటర్ల చనుబాలు దానం

అమ్మపాలు అమృతంతో సమానం. ఏ అంగట్లోనూ దొరకని ఈ పాలు ఎన్నో పోషకాల మిళితం. మరి అమ్మలేని పసివారికీ ఆ అమృతం దొరికేదెలా. అందుకే తల్లిపాల బ్యాంకులు ఏర్పాటవుతున్నాయిగానీ... చనుబాల దాతలు సరిగా ముందుకు రాక పిల్లల ఆకలిని తీర్చలేకపోతున్నాయి. ఆ పరిస్థితుల్ని కళ్లారా చూసింది కోయంబత్తూరుకు చెందిన శ్రీవిద్య. ప్రసవమైన ఐదో రోజు నుంచే తన బిడ్డకు పాలు ఇస్తూనే ఎక్కువగా ఉన్న పాలను తీసి భద్రపరచడం మొదలుపెట్టింది. భర్త సహకారంతో వాటిని రోజుకోసారి తిరుపూర్‌ జిల్లాలోని అమృత బ్రెస్ట్‌ మిల్క్‌ కేంద్రానికి పంపుతుండేది. అలా దాదాపు ఏడు నెలలపాటు 105 లీటర్ల చనుబాలను దానం చేసింది శ్రీవిద్య. ఆ పాలు దాదాపు రెండున్నర వేల మంది చిన్నారుల కడుపు నింపాయని చెబుతున్నారు అమృత సంస్థ నిర్వాహకులు. అలా ఎక్కువ మొత్తంలో చనుబాలను దానం చేసిన శ్రీవిద్య ఈ మధ్యనే ఇండియన్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులోకి ఎక్కింది.


గుండె జబ్బున్నా దత్తత

సంతానం లేనివారు అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవడం సహజం. ఆ దత్తత తీసుకునే చిన్నారి రూపు రేఖలతోపాటు ఆరోగ్యం కూడా బాగుండాలని అనుకుంటారు. హోమ్‌లలో ఉండే అలాంటి చిన్నారుల్ని పెంచుకోవడానికే అందరూ మొగ్గుచూపుతుంటారు. కానీ పుణెకి చెందిన అమితా మరాఠే మాత్రం ఆరోగ్యం బాగాలేని చిన్నారిని దత్తత తీసుకుని కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకుంది. ఎన్నో సమస్యలు ఎదురైనా అనుకున్నది సాధించి అమ్మతనానికి కొత్త అర్థమిచ్చింది అమిత. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసిన అమితకు పెళ్లంటే ఇష్టం లేదు. కానీ, అమ్మ అవ్వాలనుకుంది. తన తల్లిదండ్రుల సహకారంతో ఒక పాపను దత్తత తీసుకుందామని స్థానిక అనాథాశ్రమాలను సంప్రదించింది. అలా ఒకరోజు ఓ ఆశ్రమంలో ఐదు నెలల పాపను చూసింది. ఆ పసిపాప  గుండెజబ్బుతో ఇబ్బంది పడుతోందనీ, ఎవరూ దత్తతకు ముందుకు రావట్లేదనీ తెలిసి బాధపడింది. తానే ఆ పాపని దత్తత తీసుకుని కొత్త జీవితాన్నివ్వాలని దరఖాస్తు చేసుకుంది. చట్టపరంగా సమస్యలన్నీ తొలగిపోయాక ఏడాదిన్నర వయసులో అమిత జీవితంలోకి వచ్చిన ఆ పాపకు అద్వైత అని పేరు పెట్టుకుంది. మొదట్లో పాపని ఆసుపత్రికి తీసుకెళితే ఆపరేషన్‌ చేసి గుండెలో రంధ్రం పూడ్చటం కష్టమే అన్నారు. కానీ అమిత ఉద్యోగాన్ని మానేసి పాపను కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టింది. మూడేళ్లలో మందులూ, అమిత ప్రేమతో అద్భుతం జరిగి- ఆపరేషన్‌ అవసరం లేకుండానే అద్వైత ఆరోగ్యం బాగైంది. అన్ని విధాలుగా పాప కోలుకున్నాకే అమిత మరో ఉద్యోగం చూసుకుంది. మరోవైపు ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఆరోగ్యం బాగాలేని పిల్లల్ని దత్తత తీసుకుని వారికి కొత్త జీవితాన్ని ఇవ్వమని అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..