పరమతత్వం

భగవంతుడు సర్వాంతర్యామి. సకల ప్రాణుల ఆలనాపాలనా చూసే సర్వముఖ శక్తిమంతుడు. భగవంతుడు తాను మార్పు చెందకుండా, దేనితోనూ సంబంధం లేకుండా, అన్నింటా తానే అయి జీవులన్నింటిలోనూ

Published : 11 May 2022 00:05 IST

భగవంతుడు సర్వాంతర్యామి. సకల ప్రాణుల ఆలనాపాలనా చూసే సర్వముఖ శక్తిమంతుడు. భగవంతుడు తాను మార్పు చెందకుండా, దేనితోనూ సంబంధం లేకుండా, అన్నింటా తానే అయి జీవులన్నింటిలోనూ ఉన్నాడని భగవద్గీత చెబుతోంది. భగవంతుడు అద్వితీయుడు. ఆయన అన్ని ప్రాణులకు ఆశ్రయదాత. గుణాతీతుడిగా ఉంటూ ప్రాణులన్నింటికీ చైతన్యాన్ని కలగజేస్తాడు. భగవంతుడి సర్వవ్యాపిత్వాన్ని, ఆత్మ సహజస్వభావాన్ని ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి.

భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. కానీ అందరూ భగవంతుడిలో లేరు అన్నారు రామకృష్ణ పరమహంస. పరమాత్మ తత్వం గురించి తెలుసుకుని ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేసేవారు భగవంతుడు తమలోనే ఉన్నాడని, తమకు అస్తిత్వాన్ని శక్తిని బలాన్ని భగవంతుడే ప్రసాదిస్తున్నాడని భావిస్తారు. మనం భగవంతుడితోనే జీవించి, తిరిగి ఆయన వద్దకే వెళుతున్నాం. సమస్త సృష్టి సాక్షాత్‌ భగవత్‌ స్వరూపమే. ఆయనే ప్రాణులన్నింటిలో చైతన్యం కలిగిస్తున్నాడు.

సర్వవ్యాప్తమైన ఏకత్వమే భగవంతుడు. పరమాత్మకు తరతమ భేదాలు ఉండవు. ఈ విషయాన్ని ముందు మనం మానసికంగా నమ్మాలి. అప్పుడే మనకు సకల చరాచర సృష్టిలో అదృశ్యంగా ఉండే భగవంతుడు కనిపిస్తాడు. అదే అసలైన జ్ఞానోదయం అన్నారు స్వామి వివేకానంద.

మనం ఏ రూపంలో భగవంతుణ్ని కొలిచినా, సంపూర్ణ శరణాగతి వల్లనే బాహ్యంగాను, ఆంతరంగికంగాను పవిత్రత కలుగుతుంది. మనిషి తానున్న స్థితిని గ్రహించి, తన జీవన మార్గాన్ని స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అప్పుడే లోపలి సృజనాత్మక శక్తి బహిర్గతమవుతుంది. మనిషి ఆశించే ప్రేమ, ఆనందం, శాంతి, సుఖం నిరంతరం ఉండాలంటే, ముందుగా పరమ తత్వాన్ని అర్థం చేసుకోవాలి, అనుభవించాలి, ఆస్వాదించాలి. పరమ   తత్వాన్నితెలుసుకుని, అందులో తాదాత్మ్యం చెందినవారిలో ఓ విధమైన తేజస్సు, కాంతి కనిపిస్తాయి. వారి చుట్టూ ఒక పవిత్రమైన కాంతి వలయం ఉంటుంది. వారి ఆలోచనల్లో, చేసే పనుల్లో ఔన్నత్యం, ఔచిత్యం ఉంటాయి. మాటల్లో దైవత్వం ధ్వనిస్తుంది. బాహ్యంగా తెలుసుకుంటున్న వాస్తవాల్లాగా అంతరంగ సత్యాలను తెలుసుకోవాలంటే సహజత్వం, సమానత్వం, జాగరూకత, నిర్భయత్వం, ఓర్పు, సంయమనం అనే లక్షణాలను అలవరచుకోవాలి.

బాహ్య తత్వమైన బ్రహ్మం జీవాత్మకు సంబంధించిన ఆత్మ ఒక్కటే. శాస్త్రవేత్తలు పరమాణు నిర్మాణాన్ని తెలుసుకుని విశ్వంలోని భౌతిక రహస్యాలను ఎలా కనుగొంటున్నారో, అదే విధంగా ఆధ్యాత్మిక జ్ఞానం పొందినవారు తమలోని ఆత్మను గుర్తిస్తే... పరమతత్వం బోధపడుతుందని రమణ మహర్షి అన్నారు.

పరమాత్మకంటే పరమ తత్వాన్ని గురించి ఆలోచించాలి. కర్తకంటే కర్తవ్యాన్ని ఆకళింపు చేసుకోవాలి. భగవంతుణ్ని కర్తగాచూడటం కంటే, ఆయన కార్యాచరణను సమస్త సృష్టిలో చూడగలగాలి. మానవ మేధకు అర్థం కాని భౌతిక సృజనలెన్నో ప్రకృతిలో ఉన్నాయి. అనితరసాధ్యమైన భగవంతుడి సృష్టి అనే భావన ఉంటే చాలు... అప్పుడవి మనకు అవ్యక్తమైన అనుభూతిని కలిగిస్తాయి. భగవంతుడు ప్రసాదించిన అర్హమైన స్థితిని అర్థం చేసుకుంటే, బాధలన్నీ పటాపంచలవుతాయి. అప్పుడే పరమాత్మ తత్వం బోధపడుతుంది.

పరమతత్వంలోనే శాశ్వత సత్యం దాగుంది. అందులోనే సకల ప్రాణుల ఉనికి అంతర్భాగమై ఉంది. శారీరకంగా, మానసికంగా ఎదగడానికి కావలసిన శక్తి మనిషిలోనే ఉంది. పరమతత్వం మీద మనకున్న నమ్మకమే మనలోని శక్తిని మేల్కొలుపుతుంది. అప్పుడు జనన మరణాలకు అతీతమైన  చైతన్యం నిరంతర స్రవంతిలా కొనసాగుతూనే ఉంటుంది.

- ఎం.వెంకటేశ్వరరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని