Published : 23 Jun 2022 00:56 IST

సుఖం-అసుఖం

ఏ పనీ చేయకుండా, ఎటువంటి కష్టం లేకుండా కంటినిండా నిద్ర, కడుపునిండా ఆహారం, కారణం లేని తిరుగుళ్లు... సుఖమని చాలామంది భావిస్తుంటారు. అది సుఖమా... తమోగుణ ప్రధానమైన నిర్లక్ష్యం, బద్దకం, సోమరితనమా? పశువులు, పక్షులు, జంతువులు తమ సుఖాన్ని కోరుకోవు. హితంగా, మితంగా, వాటి వాటి ధర్మాల్ని ఆచరిస్తూ నిరంతరం ఆకలి తీర్చుకొనే ఆహారాన్ని సంపాదిస్తాయి. రీతి, నీతి, నియమ పాలన ప్రకృతి ధర్మం. అందుకు విరుద్ధంగా మనిషి ప్రవర్తిస్తే మానవత్వం సిగ్గుపడుతుంది. అసలు లోకంలో సుఖం లేదని కఠోపనిషత్తు పేర్కొంది. లోకం అనిత్యం, అసుఖం అని ఉపనిషత్తు వాక్కు.

సుఖం కానిది అసుఖం- బాధ, కష్టం అసుఖానికి చెందుతాయి. సుఖం అనేది కష్టం నుంచే అందుతుందని పెద్దలు చెబుతారు. కష్టం, బాధ లేకపోతే సుఖం అనే అనుభూతి, అనుభవం కలగవు.

రోజంతా కష్టపడి సరిపడా ధనాన్ని సంపాదించి, భార్యా పిల్లలకు ఆహారాన్ని అందించి ఒళ్ళు తెలియకుండా నిద్రించే సామాన్యుడిది నిద్రాసుఖం. రాళ్లు కొట్టి అలిసిపోయి కఠిన శిలలపైనే పై పంచె పరిచి ఆదమరిచి నిద్రించే కష్టజీవికి సుఖం హాయినిస్తుంది. మెత్తటి పరుపుపై, చల్లటి గాలిని యంత్రం ద్వారా పొంది, నిద్ర రాక, అవస్థపడే మనిషికి అందివచ్చేది అసుఖం.

తొమ్మిది నెలలు గర్భవాసాన్ని, తదనుగుణమైన బాధా, కష్టం భరించి, ప్రసవ వేదనతో బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. కొంతమంది ఆరోగ్య సమస్యల్ని, బాధలను అనుభవిస్తారు. ఇక ఇలాంటి బాధలు పడలేమని వాపోతారు. అంతటి పురిటి కష్టాన్నీ కన్న బిడ్డ పరిష్వంగంలో తల్లి మరిచిపోతుంది.

నావ నడిపే సరంగు, వాహనం తోలే వాహకుడు- ఉద్యోగ ధర్మాన్ని రోజంతా నిర్వహించి, సాయంకాలం ఇంటికి చేరి కుటుంబంతో చిరునవ్వులు పంచుకుంటూ, ఉన్నది తిని హాయిగా పడుకునే సగటు జీవి సుఖం స్వర్గంలో కూడా ఉండదు.
కుంతీదేవి తనకు బాధలే ప్రసాదించమని శ్రీకృష్ణుణ్ని కోరింది. సుఖంలో భగవంతుణ్ని మరిచిపోతారు. దుఃఖంలో అనుక్షణం ఆయనే గుర్తుకొస్తాడు. భగవంతుడి ప్రార్థనలో, దర్శనంలో సుఖాన్ని పొందడం తనకు సంతోషం కలిగిస్తుందని కుంతీదేవి కోరుకుంది.
మతంగ మహర్షి ఆదేశించినట్లు శబరి- ఆశ్రమాన్ని శుభ్రం చేస్తూ కొన్ని సంవత్సరాలు వార్థక్యంతో ఎదురు చూసింది. తన గురువు మీద నమ్మకం, విశ్వాసం నిలిపింది. శ్రీరామ ఆగమనం, ఆతిథ్యంతో ఆమె సుఖ సంతోషాలను పొందింది. శాశ్వత కీర్తిని పొంది శబరి నదిగా వర్ధిల్లింది.

కష్టం తెలియకపోతే సుఖానికి అర్థం తెలియదు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎటువంటి కష్టం లేకుండా పెంచాలని కోరుకుంటారు. అది పొరపాటు. పిల్లలకు కష్టం తెలియాలి. ఆర్థిక స్థితిగతులు అర్థం కావాలి. కుటుంబ విలువలు, పెద్దల మన్ననలు అందాలి. అదే వారి భవిష్యత్తుకు మంచి మార్గాన్ని, సుఖవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. భగవంతుడు కూడా మానవుడిగా, ఇతర రూపాలుగా అవతరించి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అవతార లక్ష్యమైన లోకసుఖం సర్వజన సంక్షేమం సాధించాడు. ప్రతి కష్టం తరవాత వచ్చేది సుఖమే. అదే ఆనందపు స్వర్గధామం.

- రావులపాటి వెంకట రామారావు

Read latest Editorial News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని