సుబ్రహ్మణ్య వైభవం

శివతేజస్సు, శక్తితత్వం ఏకీకృతంగా భాసిల్లే సుబ్రహ్మణ్యుడు ఆనందసిద్ధికి సంకేతం. సుబ్రహ్మణ్యం అంటే సువర్చస్సు కలిగిన రూపధారి అని అర్థం.

Published : 29 Nov 2022 00:37 IST

శివతేజస్సు, శక్తితత్వం ఏకీకృతంగా భాసిల్లే సుబ్రహ్మణ్యుడు ఆనందసిద్ధికి సంకేతం. సుబ్రహ్మణ్యం అంటే సువర్చస్సు కలిగిన రూపధారి అని అర్థం. ఆ వర్చస్సు జ్ఞాన సాధన ద్వారా స్వామికి చేకూరింది. జ్ఞానానికి శక్తి సమ్మిళితమైతే ఆత్మోన్నతి సాధించవచ్చని వేదం ప్రతిపాదించింది. ఆ వేద ధర్మానికి సమున్నత ప్రతీక కార్తికేయుడు. తారకాసుర సంహార నిమిత్తం అవతరించిన కారణజన్ముడు షణ్ముఖుడు.

మార్గశిర శుద్ధ షష్ఠినాడు సుబ్రహ్మణ్యుడు అవతరించాడంటారు. అందుకే ఈ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా, చంపాషష్ఠిగా, మంగళషష్ఠిగా, వరఫల షష్ఠిగా, గుహప్రియ వ్రతంగా వ్యవహరిస్తారు. స్కంద, శివ, బ్రహ్మవైవర్త పురాణాలు స్కందుడి ఆవిర్భావ ఉదంతాల్ని విశదీకరించాయి. మహాదేవుడి నుంచి వెలువడిన దివ్య యశస్సు అనంత తేజోకిరణమై పంచభూతాల సమన్వితంగా ఆకృతి దాల్చింది. ఆ సమ్మోహన రూపమే సుబ్రహ్మణ్యుడిగా వ్యక్తమైందంటారు. ఆరుగురు కృత్తికా దేవతల ఆశీర్వాద శక్తితో ఆరు ముఖాల షణ్ముఖుడిగా స్వామి తేజరిల్లాడు. ఈ షడాననాలు ఆరు విధాలతో కూడిన శివశక్తి రూపుడి మూర్తిమత్వాన్ని వెల్లడిస్తాయి. వీరం, అభయం, ఆనందం, యోగం, జ్ఞానం, విజయం- ఈ ఆరు అంశాలకు సుబ్రహ్మణ్యుడి షణ్ముఖాలు ప్రతిబింబాలు.

మార్గశిర శుద్ధ షష్ఠినాడే కుమారస్వామి తారకాసురుణ్ని సంహరించాడని, ఈ తిథినాడే దేవసేనాధిపత్యం పొందాడని స్కందపురాణం చెబుతోంది. బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడు సంపూర్ణ వైరాగ్యమూర్తి. ఆయన తన తపస్సు తప్ప ప్రపంచంలోని సుఖదుఃఖాల గురించి పట్టించుకోని స్థితప్రజ్ఞుడు. శివపార్వతుల మహిమా విశేషంవల్ల ఆ వైరాగ్య సంపన్నుడే ఆది దంపతులకు పుత్రుడిగా జన్మించాడంటారు. శివసంకల్పంతో సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా అవతరించి, జ్ఞానయోగ వరదాయకుడిగా వర్ధిల్లుతున్నాడు.

ప్రతి వ్యక్తీ తనలోనే అనంతమైన శక్తి ఒదిగి ఉందని జ్ఞానపూర్వకంగా తెలుసుకోగలగడమే- ‘అహం బ్రహ్మాస్మి’. ఈ విశేష అనుభూతినే తురీయావస్థ అంటారు. ఈ తురీయావస్థకు అధినాయకుడు సుబ్రహ్మణ్యుడు! సంపూర్ణమైన వ్యక్తిత్వ వికాసానికి జ్ఞాన యోగ మార్గాలు ఆలంబనగా నిలుస్తాయని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఆ పరంపరలో యోగశాస్త్రరీత్యా శక్తి మూలాధారం నుంచి సహస్రారానికి ప్రసరించినప్పుడు సాధకుడికి తేజస్సు రూపంలో దివ్యత్వం ఆపాదితమవుతుంది. కుండలినీ శక్తిని సర్పాకృతితో సమన్వయం చేస్తారు. ఈ సర్పం గుప్తంగా మనిషిలో అరిషడ్వర్గాలనే విషాన్ని విడుదల చేస్తుంటుంది. ఈ ఆరు శత్రువులు మనిషిలో సత్వగుణాన్ని హరించివేస్తాయి. ధ్యాన స్థితిలో ఉన్న వ్యక్తి వెన్నుపాము నిటారుగా ఉంటుంది. ఆ వెన్నుపాముకు శీర్షభాగం శిరస్సు. ఆ శిరస్సులో జ్ఞానమనే క్షీర భాండాన్ని నిక్షిప్తం చేసుకోవడం ద్వారా ప్రతి హృదయమూ నిష్కల్మషమై శోభిల్లుతుంది. ఈ యోగశాస్త్ర రహస్య విషయాల్ని ప్రతిఫలింపజేయడానికే సుబ్రహ్మణ్యస్వామి సర్పాకృతిలో అవతరించాడని పతంజలి యోగశాస్త్రం వివరించింది.

సుబ్రహ్మణ్యుడు శూలాయుధాన్ని ధరించి ఉంటాడు. బిందువుగా ఉండే శూలశీర్ష భాగం, దిగువన విస్తారమవుతుంది. సృష్టిలో అణువు నుంచి బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ చైతన్యానికి శూలాయుధం సంకేతం.

డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని