ఆలోచనలే ఆయుధాలు

సకల సృష్టిలో మనిషి ఓ అద్భుత ప్రాణి. ఎన్నో తెలియని అనంత శక్తులు, ఆలోచనలు మనిషిలో దాగున్నాయి.

Published : 03 Dec 2022 00:25 IST

కల సృష్టిలో మనిషి ఓ అద్భుత ప్రాణి. ఎన్నో తెలియని అనంత శక్తులు, ఆలోచనలు మనిషిలో దాగున్నాయి. శిఖరాలకు ఎదగాలంటే  లోపల ఉన్న ఈ రెంటినీ సరైన సమయంలో కార్యాచరణలో పెట్టాలి. మనిషి చంద్రలోకంలో కాలు మోపాడు. రోదసికి ఎగిరాడు. గ్రహాంతర నౌకలు కనిపెట్టాడు. జలాంతర్గాములు సృష్టించాడు. విశ్వ సమాచారాన్ని క్షణాల్లో కళ్ల ముందుంచే అరచేతి పరికరాలు రూపొందించాడు. మనిషికి తప్ప మరే జీవికీ ఇవి సాధ్యం కావు. అద్భుతాలు సృష్టిస్తున్న మనుషులు మరో గ్రహం నుంచి దిగి రావడం లేదు. మన మధ్యే ఉంటున్నారు. నిరంతరం కఠోర శ్రమతో తమలో నిద్రిస్తున్న శక్తి సామర్థ్యాలను మేల్కొలిపి, వెలుగులోకి తెచ్చి అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. మన ఊహకు అందని ప్రకృతిని మనలో నిద్రిస్తున్న శక్తితో, ఆలోచనతో అనుసంధానం చేయాలి. అప్పుడే అద్భుతాలు గోచరమవుతాయి.

ఏదీ తనంత తానుగా మన దగ్గరికి రాదు. పండు కావాలంటే చెట్టెక్కాల్సిందే. విజయం కావాలంటే యుద్ధం చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోదౌర్బల్యానికి తావివ్వకూడదు. అది నిర్వీర్యులను చేస్తుంది. కురుక్షేత్ర సంగ్రామంలో బంధుజనాన్ని చూసి మనోదౌర్బల్యానికి లోనయ్యాడు అర్జునుడు. గీతోపదేశం చేసి, కర్తవ్యం బోధించి, యుద్ధం చేయించాడు శ్రీకృష్ణుడు. పిన్నవయసులోనే ఎంతోమంది నిరాశా నిస్పృహలకు, మనోదౌర్బల్యానికి లోనవుతున్నారు.  అనాలోచితంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఏమీ సాధించకుండా, బలవంతంగా ప్రాణాలు కోల్పోవడానికా ఇంతటి అత్యుత్తమమైన జన్మ ఎత్తింది? అర్థం చేసుకున్నవారికి ఈ ప్రశ్నలోనే జవాబు దొరుకుతుంది. సవాళ్లను అధిగమించాలంటే అందరికంటే భిన్నంగా, సమయస్ఫూర్తితో ఆలోచించాలి. అప్పుడు విజయమే నీ ప్రమేయం లేకుండా నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఆలోచనలను అనాలోచితం చేస్తే మెదడు మొద్దు బారుతుంది. ఎప్పటికప్పుడు ఆలోచనలకు పదును పెట్టగలిగేవారే సవాళ్లను ఎదుర్కొంటారు. ఆలోచనా వజ్రాన్ని ఎంత సానపడితే ఫలితం అంత ప్రకాశవంతంగా ఉంటుంది.

సరైన ఆలోచనా శక్తితో తనను తాను ప్రభావితం చేసుకోగలగాలి. అలాంటి వ్యక్తి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనగల ఆయుధంలా తనను తాను మలచుకోగలుగుతాడు.

మూసలో కొట్టుకుపోయే ఆలోచనల నుంచి బయటికి రావాలి. ఆలోచనలను స్వేచ్ఛా విహంగాల్లా మనో ఆకాశంలో ఎగరనివ్వాలి. సవాళ్లకు అప్పుడే సమాధానం లభిస్తుంది. కలాం వంటి అపురూప నక్షత్రాల పునర్దర్శనం కలుగుతుంది. కిందపడ్డా పైకి లేవడం తెలిసిన వారికే ఆలోచన పడి లేచే కడలి తరంగంలా పనిచేస్తుంది. ఎన్నో విఫల ఆలోచనల నుంచే ఒక విభిన్నమైన ఆలోచన ఉద్భవిస్తుంది. వైఫల్యాలను మన్నించవచ్చు. ఆగిన పని పునః ప్రారంభించవచ్చు. కానీ వైఫల్య పాఠాలను మాత్రం మరవకూడదు. ఒక అడుగు ముందుకేసి చూడు. గెలుపు అయితే ముందుకు నడిపిస్తుంది. ఓటమి అయితే ఆ తరవాత ఏం చేయాలో ఆలోచనను ప్రేరేపిస్తుంది.

‘దృఢ సంకల్పం, పవిత్ర ఆశయం, సదాలోచనలు ఎప్పుడూ సత్ఫలితాలనే ఇస్తాయి. వీటిని ఆయుధాలుగా గ్రహించినవారే అన్ని విఘ్నాలను ప్రతిఘటించి నిలువగలుగుతారు’ అన్నారు వివేకానంద. తెలుసుకోవాలన్న తపన, జిజ్ఞాస ఉన్నవారే ఆలోచనలను ఆయుధాలుగా మలచుకుని ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారు.

ఎం.వెంకటేశ్వరరావు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు