నింగీ నేలల పర్వం

కొత్తదనానికి స్వాగతం పలికే పర్వం మకర సంక్రమణం. దేశమంతా ఈ పండుగ జరుపుకొంటున్నప్పటికీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకత కనిపిస్తుంది. సూర్య భగవానుడు మకరరాశిలో సంక్రమించే పుణ్యకాలం దివ్యత్వాన్ని సంతరించుకుంటుందని ధార్మిక గ్రంథాల వివరణ.

Published : 15 Jan 2023 00:43 IST

కొత్తదనానికి స్వాగతం పలికే పర్వం మకర సంక్రమణం. దేశమంతా ఈ పండుగ జరుపుకొంటున్నప్పటికీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకత కనిపిస్తుంది. సూర్య భగవానుడు మకరరాశిలో సంక్రమించే పుణ్యకాలం దివ్యత్వాన్ని సంతరించుకుంటుందని ధార్మిక గ్రంథాల వివరణ. ఆ సమయంలో చేసే స్నాన, దాన, తర్పణ, జపాది సత్కర్మలు విశేష శుభఫలాలను ప్రసాదిస్తాయన్న శాస్త్రోక్తిని విశ్వసిస్తూ, ఆయా విధులను శ్రద్ధాభక్తులతో పాటించడం సంప్రదాయం. సౌరమానం ప్రకారం ధనుర్మాసం పూర్తయి, మకరమాసం ఈ రోజునుంచి మొదలవుతుంది.

ఉత్తరాయణారంభమైన మకరసంక్రాంతికి మహాస్థానాన్ని నిర్దేశించాయి సనాతన శాస్త్రాలు. ఏడాదికి ఒకరోజుగా లెక్కించి (దేవమానం రీత్యా) పగలు ఉత్తరాయణమని, దక్షిణాయనం రాత్రి అనీ గణించారు. పగటి భాగమైన ఉత్తరాయణానికి తొలివేళ కనుక ఈ సంక్రాంతి- ఏడాదికే ‘శుభోదయం’. ఈ శుభోదయవేళ వత్సరమంతా శుభంకరంగా ఉండాలనే ఆకాంక్షతో పవిత్ర కర్మలతో ఈ దినాన్ని సార్థకం చేసుకోవడం సదాచారం. ప్రయాగవంటి పుణ్యతీర్థాల్లో స్నానమాచరించి, ఈశ్వరార్పణ బుద్ధితో దానాలను ఇవ్వడం, పితృదేవతలకు తర్పణాలను అర్పించడం- ప్రకృతిని నిర్వహించే దివ్యశక్తులపట్ల, తమ పూర్వతరాల పట్ల కృతజ్ఞతకు, భక్తిప్రపత్తులకు సంకేతాలు.

భోగితో పాతదనానికి స్వస్తిచెప్పి, సంక్రాంతితో నూతన కాంతులకు ఆహ్వానం పలికే రీతి ఈ పండుగలో కనబడుతుంది. రంగవల్లికలు, గొబ్బెమ్మలు, ఆటపాటలు, పంట చేతికందిన సస్యలక్ష్మీ వైభవం, వేడుకలు, కుటుంబ బంధాల అనురాగాలు... ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రశస్తితోపాటు సామాజికపర్వంగా, గొప్ప సంస్కృతిగా సంక్రాంతిని చిత్రించాయి. కొన్ని ప్రాంతాల్లో ‘తిలసంక్రాంతి’ అని వ్యవహరిస్తారు. తిలలనే స్నానానికి, దానానికి, పాకానికి వినియోగిస్తూ- తెల్లనువ్వులను స్నేహబాంధవుల కానుకగా, దేవతలకు వినియోగంగా చేసి, నల్ల నువ్వులను పితృదేవతలకు తర్పణంగా వాడతారు. కొత్త బియ్యాన్ని ఆవుపాలతో కలిపి పొంగించి, అందునా ఆరుబయట సూర్యకిరణ స్పర్శ కలిగేలా, వండి ఆదిత్యుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం అనేక ప్రాంతాల్లో ఆచారం. దీనివల్లనే ‘పొంగల్‌’ అనే పేరూ ఈ పండుగకు వర్తించింది.

సూర్యుడికి ప్రతీకలుగానే పతంగులను ఎగురవేయడం కొన్ని ప్రాంతాల వేడుక. గాలిపటాలకే గాక, పక్షులకు కూడా పతంగ శబ్దం ఉంది. వివిధ వర్ణాలను ప్రసాదించే ఆదిత్యుడికి నివేదనగా రంగురంగుల గాలిపటాలను ప్రదర్శిస్తారు. ‘పతంగం’ అనే మాటకు సూర్యుడు అని కూడా అర్థం ఉంది.

ఆకాశం అందించిన ప్రాణ-కాంతి-వర్ష శక్తులను స్వీకరించి నేలతల్లి పండించే సస్యాలను నింగినేలల కరుణాప్రసాదంగా గ్రహించడం మానవుడి కృతజ్ఞతా సంస్కారం. అందుకే వేద ఋషులు ఆకాశాన్ని తండ్రిగా, భూదేవిని తల్లిగా భావించి ఆరాధించారు. ఆకాశం, భూమి మధ్యలో జీవించేవారందరూ వారి సంతానమే. నింగీనేలా ఇచ్చే సంపదలు శ్రీలక్ష్మి, భూలక్ష్మి రూపాలుగా, రెండింటికీ మూలమైన పరమాత్మ శ్రీమన్నారాయణుడిగా సనాతన ధర్మఋషి విజ్ఞానం ఆవిష్కరించుకుని ఆరాధించింది. పంట చేతికందిన వేళ- కృతజ్ఞత, త్యాగం, పరస్పర సహకారం, వేడుకలూ వినోదాలూ అన్నీ కలిపి... ‘దేవతారాధన’ అనే దివ్యసూత్రంతో ముడిపెట్టి సంప్రదాయంగా అందించారు పెద్దలు. శ్రమఫలం లభించాక పంచుకొని ఆనందించడమే సంక్రాంతి వేడుక.

నూతన సంకల్పాలకు, సత్కార్యాలకు సంసిద్ధతకు శ్రీకారం చుట్టుకొని, సమూహ క్షేమాన్ని శ్రేయస్సును ఆశిస్తూ ప్రార్థించడమే పండుగలనాటి పవిత్ర పరమార్థం.

సామవేదం షణ్ముఖశర్మ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు