షోడశ గుణనిధి శ్రీరాముడు

పురుషుడు పుణ్యపురుషుడిగా రాణించాలంటే ఉత్తమగుణాలు అలవరచుకొని జీవనం సాగించాలని స్కాందపురాణం చెబుతోంది. ఉత్తములంటే ఎవరు, ఎటువంటివి ఉత్తమగుణాలని నారదుణ్ని అడిగాడు వాల్మీకి.

Published : 21 Feb 2024 01:19 IST

పురుషుడు పుణ్యపురుషుడిగా రాణించాలంటే ఉత్తమగుణాలు అలవరచుకొని జీవనం సాగించాలని స్కాందపురాణం చెబుతోంది. ఉత్తములంటే ఎవరు, ఎటువంటివి ఉత్తమగుణాలని నారదుణ్ని అడిగాడు వాల్మీకి. ఇతరులకు ఏ మాత్రం కష్టం కలిగించక, వారిని సదా ప్రేమిస్తూ, ప్రజోపకర చర్యలతో అందరి హృదయాలను చూరగొనే గుణాలు కలిగినవాడే ఉత్తముడు, అతడు పాటించే గుణాలే శ్రేష్ఠమైనవని చెప్పాడు నారదుడు. అటువంటి వ్యక్తి ఉత్తమ గుణాలను లోకానికి విశదపరచాడు.

త్వరగా కార్యాన్ని నిర్వహించమని ఇతరులు చెప్పేముందే దాన్ని నిర్వహించి మెప్పు పొందే లక్షణం ఉత్తములది. ఇది విజయానికి సోపానం. ఎల్లవేళలా శ్రీరాముడు దీన్ని ఆచరించి చూపించాడు. కార్యంపట్ల అలసట ప్రదర్శించక దీక్షతో ముందుకు సాగాలి. యుద్ధరంగంలో రాత్రింబగళ్లు పద్నాలుగు వేలమంది రాక్షసులను అలవోకగా జయించి, ఏ మాత్రం అలసట కనబరచనివాడు రాముడు. ధర్మాన్ని ఆచరించడం మహాపురుషుల లక్షణం. రాజ్యార్హత నీకే ఉందని భరతుడు ఎంత వేడినా, అతడి ప్రార్థనను సున్ని తంగా తిరస్కరించి ధర్మాన్ని, ధర్మస్వరూపాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించాడు రఘురాముడు. జటాయువు చేసిన మేలును గుర్తుంచుకొని అతడి అంతిమ సంస్కారాన్ని తానే స్వయంగా నిర్వహించి కృతజ్ఞతకు మారుపేరై నిలిచాడు రాఘవుడు.

అగ్నిసాక్షిగా ఏర్పరచుకొన్న స్నేహబంధాన్ని దృఢతరం చేస్తూ సుగ్రీవుణ్ని రాజును చేసేందుకు వాలి వధకు పూనుకొన్న సత్యవాక్పరిపాలకుడు రఘునందనుడు. తండ్రి ఆదేశాన్ని తలదాల్చి పితృవాక్పరిపాలన అనే దృఢవ్రతాన్ని చేపట్టిన వందనీయుడు దాశరథి. విశ్వామిత్రుడి వెంట కారడవుల్లో సాధారణ వ్యక్తిలా సంచరించి, కంద మూలాలు స్వీకరించి భూశయనం చేశాడు దశరథనందనుడు. గురువు చెప్పిన రాక్షసిమూకలను మట్టుపెట్టి ఆనందం కలిగించాడు. కబంధుడి వధానంతరం ఉదారహృదయంతో అతడికి అగ్ని సంస్కారం చేసిన కరుణాంతరంగుడు. శ్రద్ధాసక్తులు కనబరచి, క్రమశిక్షణతో సకల శాస్త్రాలు, వేదవేదాంగాలు నేర్చి వాటి ఆవశ్యకతను లోకానికి అందించాడు. కార్యదీక్షాదక్షుడై అపార పారావారధిని దాటి దుర్భేద్యమైన లంకను చేరి అరివీరభయంకరుడై శత్రుసేనను నిర్జించాడు.

అంతులేని భక్తివిశ్వాసాలతో తనను వేడిన మునిజన బృందాన్ని కాపాడేందుకు కంకణం కట్టుకొని శత్రుమూకలను చీల్చిచెండాడిన అభయమూర్తి. కోపాన్ని జయించినవారు జితక్రోధులు. తనను అడవికి పంపిన పినతల్లి కైకను కొంచమైనా నిందించక, శాంతవర్తనుడై ఆమె పాదాలకు ప్రణమిల్లిన పుణ్యమూర్తి శ్రీరాముడు. అపూర్వ తేజస్సుతో వెలుగొందుతూ శత్రువులకు కంటిపై కునుకు లేకుండాచేసిన కాంతిమంతుడు. ఇతరుల దోషాలను లెక్కించనివాడు, అసూయ అంటే తెలియనివాడు రాఘవుడు. తనవారి దోషాలను ఎంచక, రాజ్యాన్ని తృణప్రాయంగా త్యజించి, అడవులపాలైన రాముడు స్తవనీయుడు. ధర్మపరిరక్షణ కోసం వీరత్వం ప్రదర్శించి శత్రువులకు గుణపాఠం చెప్పమని బోధిస్తోంది రాజనీతి. యుద్ధంలో వైరివీరులను తుద ముట్టించి లోకకల్యాణానికి నాందిపలికాడు శ్రీరామచంద్రుడు. ఇన్ని గొప్ప గుణాల మేలుకలయికే రాముడి జీవితం అని చెప్పాడు నారదుడు. అందుకే ఆయన సకల గుణాభిరాముడు. వీటిలో కొన్నింటినైనా అందిపుచ్చుకొని ఆచరిస్తే మానవ జీవితం ధన్యమవుతుంది.

 మాడుగుల రామకృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని