ధర్మ రక్షణ

సుపరిపాలన అనే మాట తరచుగా వింటుంటాం. రామాయణ మహా భారతాల్లో మంచి పరిపాలన అంటే ఏమిటో పాలకులకు ఎలాంటి లక్షణాలు ఉండాలో, ఏ గుణాలు ఉండకూడదో మహర్షులు చెప్పారు. అనేక క్లిష్ట సమయాల్లో ధర్మ స్థాపన యత్నాల్లో సంఘర్షణల్లో పురాణపురుషుల నుంచి మార్గదర్శనం లభించడం మన ఇతిహాసాల్లో కనిపిస్తుంది.

Published : 09 Mar 2024 00:29 IST

సుపరిపాలన అనే మాట తరచుగా వింటుంటాం. రామాయణ మహా భారతాల్లో మంచి పరిపాలన అంటే ఏమిటో పాలకులకు ఎలాంటి లక్షణాలు ఉండాలో, ఏ గుణాలు ఉండకూడదో మహర్షులు చెప్పారు. అనేక క్లిష్ట సమయాల్లో ధర్మ స్థాపన యత్నాల్లో సంఘర్షణల్లో పురాణపురుషుల నుంచి మార్గదర్శనం లభించడం మన ఇతిహాసాల్లో కనిపిస్తుంది.

విదురుడు ధర్మమూర్తి. కౌరవ రాజ్యానికి మంత్రి. బుద్ధిశాలి అయిన మంత్రి సలహాలు స్వీకరించడం రాజు కర్తవ్యం. విదురుడు ధృతరాష్ట్రుడికి హితవు చెబుతూ ‘నీ వందమంది కొడుకుల్లో నిజానికి చెడ్డవాడొక్కడే. అతడి వల్ల మిగిలిన వారందరూ చెడు మార్గంలో ప్రవర్తిస్తున్నారు... ఒక్కడు పాపం చేస్తే దాని ఫలాన్ని అందరూ అనుభవిస్తారు. నీ కొడుకు దుర్యోధనుడి అధర్మవర్తనం అధికారం కాపాడుకోవడం కోసం చేసే దుష్కార్యాలను తండ్రిగా, రాజుగా నువ్వు అడ్డుకోవడం లేదు. ధర్మాన్ని రక్షించని రాజు రాజ్యంలో ప్రజలకు సుఖశాంతులుండవు’ అన్నాడు. మితిమీరిన పుత్రవాత్సల్యం గల గుడ్డిరాజు చెవులకు ఈ మాటలు రుచించలేదు. ధర్మాన్ని రక్షించడం రాజు ప్రధాన ధర్మమనే మాటను విస్మరించాడు.

శ్రీకృష్ణుడు పాండవుల రాయబారిగా హస్తినాపురం వెళ్ళాడు. నిండుకొలువులో ధృతరాష్ట్రుణ్ని ఉద్దేశించి సంధివచనాలు పలికాడు. అధర్మం ధర్మాన్ని పీడిస్తున్నప్పుడు, ధర్మం తనకు న్యాయం చెయ్యాలని రాజసభకు వెళ్ళినప్పుడు సభలోనివారు ఉదాసీనంగా ఉండరాదని, ఏది ధర్మమో తెలిసికూడా మాట్లాడకుండా మౌనం వహించడం అత్యంత ప్రమాదకరమని కృష్ణుడు హెచ్చరించాడు.

ధర్మాన్ని గట్టెక్కించడానికి, సత్యానికి శుభం కలిగించడానికి దైవం ఉండనే ఉంటాడు. రాజు బాధ్యత ఏమిటి? ధర్మాన్ని కాపాడగలిగే శక్తి ఉండి కూడా ఎవరైతే ఉపేక్ష వహిస్తారో అది వారికే కీడు కలిగిస్తుంది. సమాజంలో సత్యం ధర్మం క్షీణిస్తున్న సమయంలో ఆ దుస్థితిని తొలగించగల శక్తిమంతులు కొందరుంటారు. కాని మనకెందుకులే అని నిర్లక్ష్యం వహిస్తారు. కౌరవ సభలో భీష్మద్రోణులు దక్షులైనా మిన్నకుండిపోయారు. చివరకు వారూ బలయ్యారు.

పాలకుడు ఎన్నడూ నిగ్రహం కోల్పోకూడదు. అధికార మదంతో విషయ సుఖాలు అనుభవించాలనుకోవడం అనైతికమే. పాలకులే కాదు, సమాజంలో బాధ్యతగల పదవుల్లో ఉన్నవారు  తమతమ రంగాల్లో గౌరవం పొందుతున్నవారూ చేసిన తప్పులు వ్యక్తిగతమైనా ఆమోదయోగ్యం కాదు. వారి ప్రతిభను, సేవల్ని గుర్తించాలి గాని వ్యక్తిగత బలహీనతల్ని పట్టించుకోకూడదని కొందరు చెప్పడమూ సబబు కాదు. సామాన్య ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సినవారు అధర్మం చేస్తే లోకానికి అది చెడు సందేశం అవుతుంది.

రాచరిక వ్యవస్థలోనే కాదు- ప్రజాస్వామిక పాలనలోనూ పాలన, అధికార వ్యవస్థలు అంచెలంచెలుగా ఉంటాయి. కింది వ్యవస్థ దోషాలను పైవారు సరిదిద్దాలి. ఏవైనా అధర్మాలు, అక్రమాలు జరుగుతున్నప్పుడు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకొని సరిదిద్దవలసి ఉంది. తనకు కప్పం కడుతున్న సామంతరాజు పాలనలో ధర్మహాని జరుగుతుంటే దాన్ని సరిదిద్దవలసిన విధి చక్రవర్తిది. ఏ కాలంలోనైనా పాలకులు, బాధ్యతగల పదవుల్లో ఉన్నవారి ప్రథమ కర్తవ్యం ధర్మరక్షణే. దాన్ని ఉపేక్షించడం అధర్మం.

డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని