దైవసన్నిధి

చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది.

Published : 13 Mar 2024 00:21 IST

చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది. ఎప్పుడైతే ఈ జీవితం తాత్కాలికమని గ్రహిస్తామో అప్పుడు శాశ్వతమైనదాని మీద శ్రద్ధ పెడతాం. ఆత్మకు మరణం ఉండదని ఆశ్చర్యపోవడం మొదలుపెడతాం... అప్పుడు మేల్కొంటాం.

మనం ప్రేమించేవారితో గడిపే కాలం ఎంతో విలువైనదిగా గుర్తిస్తాం. వారు కుటుంబ సభ్యులైనా, ఎవరైనా ప్రేమతో చూస్తాం. ఈ కలిసి గడిపే క్షణాలు శాశ్వతం కాదని తెలుసుకుంటాం. ప్రేమించేవారిపై విలువ ఎంతగానో పెరుగుతుంది. మనకు జీవితంలో వారెంత ముఖ్యమో గుర్తిస్తాం. ప్రతి ఒక్కరూ ప్రేమను ఆశిస్తారు. విలువనివ్వాలని కోరుకుంటారు. ప్రశంసించాలనుకుంటారు. ఇది అహాన్ని పెంచడం కాదు- ఒకరిపట్ల మరొకరికి ప్రేమ వ్యక్తీకరణ.

దేవుడు అనంత కరుణా మయుడు, కరుణా సంపన్నుడు. మనందరం మానసిక సాంత్వన, శాంతి, భౌతిక సంపద, ఆధ్యాత్మిక సంపదలను కోరుతూ దేవుణ్ని ప్రార్థిస్తాం. చిత్రమేమిటంటే- మన అహంభావాన్ని, కోపతాపాల్ని, ఈర్ష్యాద్వేషాల్ని, భౌతికవాంఛల పట్ల అనుబంధాలను తొలగించమని ఎప్పుడూ ఆయన్ని అడగం.

ప్రతి ఒక్కరికీ దేవుడి దయకోసం అభ్యర్థనలు పంపడానికి ఒక ప్రత్యేకమైన మార్గముంటుంది.

ప్రతిరోజూ తెల్లారుజామునే ఒక పాప గుడికొచ్చి, దేవుడి ముందు నిలబడి కళ్లు మూసుకుని నమస్కరిస్తూ కొన్ని నిమిషాలపాటు ఏదో తనలో తాను గొణుక్కొంటుంది. తరవాత కళ్లు తెరుస్తుంది. వంగి నమస్కరించి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా రోజూ జరుగుతుండటం చూసిన పూజారికి ఆమె చేసేదానిపై ఆసక్తి పెరిగిపోయింది.

ఓ రెండు వారాలు గడిచాక పూజారి ఉండబట్టలేక, ఆ ఉదయం దేవాలయానికి ఆ పాప రాకముందే చేరుకుని ఆమె చేసేదంతా గమనించాడు. తన చేతిని ఆమె తలపై ఉంచి ‘పాపా నువ్వు రోజూ రావడం చూస్తున్నాను. ఏం చేస్తున్నావు’ ముద్దుగా అడిగాడు. ‘నేను ప్రార్థిస్తున్నాను’ అంది. ‘కళ్లు మూసుకుని చేస్తున్నావేమిటి’... ‘నాకు ఏ ప్రార్థనా రాదు. తెలుగు అక్షరాలు మాత్రమే వచ్చు. అ... ఆ... ఇ... ఈ... ఉ... ఏదైనా అక్షరాలు లేకుండా ఉండదు కదా. నేను చెప్పే అక్షరాలను తనకు నచ్చినట్లు అమర్చుకోమంటున్నాను దేవుణ్ని. అదే నా ప్రార్థన’. ఆ పాపది ఎంత స్వచ్ఛమైన మార్గం- దేవుణ్ని చేరుకోవడానికి! ప్రార్థనలో హృదయం లేని మాటల కంటే, మాటల్లేని హృదయం కలిగి ఉండటం మంచిది.

హిందూ గ్రంథాల్లో దేవిని మాతృకర్ణరూపిణిగా కీర్తించారు. ఆమె రూపం అక్షరాలతో రూపొందింది. మనం మంచిమాటలు మాట్లాడినా, నిర్మలమైన ప్రసంగాలు చేసినా ఆ దేవిని ఆరాధించినట్లే.

రాత్రివేళ ఆకాశంలోకి చూసినప్పుడు నక్షత్రాలు తీసుకొచ్చే ఆధ్యాత్మిక సందేశాలను మనం గ్రహించాలి. ఇక్కడ ఎల్లకాలం ఉండమని మనకు అందుబాటులో ఉండే కాలాన్ని ఆనందంతో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరముందన్న ఎరుకతో జీవించాలి. మెరిసే నక్షత్రాలకన్నా అంతరంగంలోనే కొలువుండే ఆ దైవాన్ని చూసుకోగలిగితే బతుకు ధన్యం.

మంత్రవాది మహేశ్వర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని