గోవిందం... పరమానందం!

జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం.

Published : 15 Mar 2024 01:21 IST

జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం. ఆకాశంలో తారకామణులు హారతులు పడుతున్న సుందర దృశ్యం కనువిందు చేస్తుంది. ఆ దృశ్య సౌందర్యం ఉదయ సూర్యుడి వెలుగు వెల్లువలో కరిగిపోతుంది. భౌతికపరమైన వస్తు సముదాయం ఆహ్లాదకరమే తప్ప, నిత్యానంద మకరందం అందించలేదు. ఈ సత్యమెరిగిన ఆర్ష రుషులు ఆనందం బ్రహ్మ అని, పరమానందమే పరమ పురుషార్థమైన మోక్షమని, సాధన ద్వారా సాధించాలని ప్రబోధించారు.

ఆకాశాన్ని అందుకోవడం, ఆనందాన్ని పట్టుకోవడం ఆషామాషీ కాదు. ఆకాశం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ- అంటున్నది ఉపనిషత్తు. ఆకాశం కనిపిస్తుంది కాని అందదు. ఆనందం అనుభూతమే కాని కనిపించదు. అంతర్యామి అయిన ఆ భగవంతుడు రస స్వరూపుడు. ఆ పరమాత్మతో అనుబంధమే ఆనందం. ఆవేదనకు, ఆనందానికి మనసే కారణం. అదే బంధానికి, మోక్షానికి ఆదిమూలం. భావమే భవకారణం. అభావమే మోక్ష ప్రదాయకం! గోవిందుడి ఆనంద లీలా విలాసమే బృందావనంలో వెన్నెల రాత్రిళ్లు వెల్లివిరిసిన రాసం. రాసం అంటే క్రీడ, ప్రేమాస్పదమైన కేళీవినోదం. రాధాకృష్ణులు ప్రకృతి పురుషులు. రాధామాధవుల అద్వైత ప్రణయమే ఆనంద గోకుల బృందావన రాసక్రీడ అని గోపాల ఉపనిషత్తు చెబుతున్నది. బృందావనంలో అలా ప్రతి పున్నమి వెన్నెల రాత్రి ఆనంద గోవిందం వెల్లువై పారింది. బృందావన చందమామ చుట్టూ రాధతోపాటు గోపికారమణులూ తారలై రసమయ జగతిలో క్రీడించేవారు. పద్నాలుగు భువనాలూ ఊగేవి; దేవతలు దీవించేవారు. జీవరాశి మైమరచి పరవశించేది.

ఒకసారి, బృందావనంలో నందనందనుడు గోపికలతో రాసం సలుపుతుండగా ఆ దృశ్యం కంసుడి స్నేహితుడి కంటపడింది. వాడు పకపకలాడుతూ ‘ఇదేనా నీ బాగోతం... అమ్మాయిలతో సరసాలా నీ పని... నువ్వేం దేవుడివోయ్‌?’ అంటూ పరిహాసాలు గుప్పించాడు. గోపాలుడు చిరునవ్వు చిందిస్తూ ఉండగా, గోపమ్మలు నివ్వెరపాటుకు గురయ్యారు. వెన్నెల రాత్రి చీకటి నిశీథిగా మారింది. ఆనందానికి బదులు ఆక్రందనలు మొదలయ్యాయి. పోనుపోను రాక్షసుడి వాలకం శ్రుతిమీరి రాగాన పడింది. గోవిందుడిపైన దాడికి దిగాడు. ద్వంద్వ యుద్ధం మొదలైంది. క్షణంలో ఆ రాక్షసుడు యమపురికి రవాణా అయిపోయాడు.

గోపికలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. వెన్నెల కురిసినట్లు, బృందావనంలో మళ్ళీ ఆనందం వెల్లివిరిసింది. గోవిందుడు గోపికల చెవులకు విందు చేశాడు. ప్రేమ గొప్పదనాన్ని వినసొంపుగా, విప్పి చెప్పాడు. ‘ప్రేమ పలు రకాలు. పశు ప్రేమ, మానవ ప్రేమ, దివ్యప్రేమ, పరమ ప్రేమ... ఒకటి కన్నా మరొకటి ఉన్నతమైనవి. అన్నింటికన్నా మిన్న పరమ ప్రేమ!’ అని మాధవుడు గోపికలకు తేల్చి చెప్పాడు. పరమాత్మ పరమ ప్రేమ స్వరూపుడని నారద భక్తి సూత్రాలు చెబుతున్నాయి. పరమాత్మ పట్ల చెరగని అనురాగమే పరమ ప్రేమ... తరగని ఆనందం, వెరసి- పరమ ప్రేమానందం. గోకుల బృందావనం అనురాగ ఆనందయోగం, ఆత్మ పరమాత్మల సంయోగానికి నిదర్శనం!

ఉప్పు రాఘవేంద్రరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని