ఎవరు వామనుడు?

భగవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన.

Published : 19 Mar 2024 00:51 IST

గవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన. మనిషిగా దిగి వచ్చిన దివ్యశక్తి- తిరిగి దైవ స్వభావాన్ని, ప్రకృతి చైతన్యాన్ని ఉపాసిస్తూ దేవతా స్వరూపుడిగా ఎలా ఎదగాలో ఈ లోకానికి స్వయంగా నేర్పించడాన్ని ‘ఆరోహణ’గా పేర్కొన్నారు. రామావతారాన్ని గమనిస్తే ఆ విషయం స్పష్టంగా మనకు బోధపడుతుంది.

దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనేవి అవతారమూర్తుల ప్రధాన లక్ష్యాలు. వామనావతారం మాత్రం దానికి భిన్నంగా సాగింది. వామనుడు చేసిందల్లా- బలిచక్రవర్తిని నిగ్రహించడం ఒక్కటే. బలి దుర్మార్గుడు కాదు సరికదా, దాతగా పేరొందినవాడు. అలాంటివాణ్ని శిక్షించడం దుష్టశిక్షణ కాదు. కాబట్టే భాగవతాన్ని వివరిస్తున్న శుకయోగిని ‘ఏ తప్పూ చేయని బలిని హరి వరుణపాశాలతో ఎందుకని బంధించాడు?’ అంటూ పరీక్షిత్తు ప్రశ్నించాడు. అప్పుడు శుక మహర్షి ఒక రహస్యాన్ని వెల్లడించారు.

అది ఏడో మన్వంతరం. దానికి భూలోక అధిపతి- వైవస్వత మనువు. దేవలోక అధిపతి- పురంధరుడు. ఆయనే ఇంద్రుడు. ఇది సృష్టి నిర్దేశించిన ఒక చట్టం. బలి ఆ చట్టాన్ని ధిక్కరించాడు. భార్గవులను బతిమాలి వారి సాయంతో విశ్వజిత్‌ యాగాన్ని నిర్వహించాడు. అగ్నిహోత్రుడి నుంచి దివ్యరథాన్ని, సింహ పతాకాన్ని, అభేద్య కవచాన్ని, ఎన్నో అమోఘ ఆయుధాలను సాధించాడు. వెంటనే దేవేంద్రుడిపై దండెత్తి ఆయన సింహాసనాన్ని ఆక్రమించాడు. చాలా తెలివిగా ఆలోచించి ‘నా కన్నా ముందు ఎందరో రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించినా, వారు ఎంతోకాలం ఆ పదవిని ఎందుకు నిలబెట్టుకోలేక పోయారు?’ అని కులగురువు శుక్రాచార్యుడితో సమాలోచనలు చేశాడు. దానికి శుక్రుడు గొప్పగా ప్రతిస్పందించాడు. ‘రాజా! ఇంద్ర పదవిని నిలబెట్టుకోవాలంటే పరాక్రమం ఒక్కటే చాలదు. తపోబలమూ కావాలి. యజ్ఞయాగాదులు నిర్వహించాలి. దేవతలను మెప్పించాలి. వేదవేత్తల దీవెనలు పొందుతూ ఉండాలి. ఉదాత్త స్వభావుడిగా మారాలి. రాక్షసులకు అది సాధ్యంకాదు. ఇంద్రపదవి దక్కగానే ఇష్టానుసారం ప్రవర్తిస్తూ వారు భ్రష్టులైపోతూ వచ్చారు. అందుకే మనవారెవరూ ఆ పదవిలో ఎక్కువకాలం మనలేకపోయారు’ అని శుక్రాచార్యుడు వివరించాడు.

బలి చక్రవర్తి వివేకి. గురువు సూచనలను అక్షరాలా పాటించాడు. మంచిపేరు తెచ్చుకొన్నాడు. ఇంద్రుడిగా శాశ్వతంగా ఉండిపోవాలన్నదే- వాటి వెనక అసలుసిసలు ఆంతర్యం. వాస్తవానికి ఆ మంచిపనుల కారణంగానే దరిమిలా ఎనిమిదో మన్వంతరం ‘సావర్ణి’లో తిరిగి ఇంద్రుడు అయ్యాడు. అంటే, ఆయన చేసిన సత్కార్యాలు వృథా కాలేదు. త్రిలోక ఆధిపత్యంపై మమకారం, రాక్షస కులంలో ఈ స్థాయి యజ్ఞయాగాదులు ఎవరూ చేయలేకపోయారన్న అహంకారం, సృష్టిక్రమాన్ని ధర్మాన్ని ధిక్కరించి విశ్వరాజ్యాంగ సంక్షోభానికి కారకుడు కావడం అనే మూడు దోషాలే- వామనుడి మూడు అడుగులై బలిచక్రవర్తిని పాతాళానికి అణిచేశాయి. రాక్షస గుణాలతో వామనత్వం వహించిన బలిని నిజానికి వామనావతారంలో శ్రీహరి ‘ఉద్ధరించాడు’. పాతాళ రాజ్యాభిషిక్తుణ్ని చేసి తపోబలంతో బలి దైవీగుణవంతుడు కావడానికి కారణం అయ్యాడు. అది శిక్ష కాదు- శిక్షణ. అవలక్షణాల నుంచి బలిని స్వర్గాధిపత్యం దిశగా ఆరోహణ చేయించడమే- వామన అవతార లక్ష్యం!

 ఎర్రాప్రగడ రామకృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని