జీవనాధార ప్రకృతి

ప్రకృతి- జీవరాశికి మాతృక, సౌందర్యానికి ప్రతీక. మానసికోల్లాసానికి నెలవు, ఖేదపడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి నిర్వేదానికి ఉపశమనం, కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి మనిషిలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. అన్వేషణకు స్ఫూర్తినిస్తుంది. కవులకు కళాకారులకు ప్రేరణ కలిగిస్తుంది. చిత్రంలోని ప్రకృతి కంటినే ఆహ్లాదపరుస్తుంది.

Published : 20 Mar 2024 00:18 IST

ప్రకృతి- జీవరాశికి మాతృక, సౌందర్యానికి ప్రతీక. మానసికోల్లాసానికి నెలవు, ఖేదపడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి నిర్వేదానికి ఉపశమనం, కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి మనిషిలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. అన్వేషణకు స్ఫూర్తినిస్తుంది. కవులకు కళాకారులకు ప్రేరణ కలిగిస్తుంది. చిత్రంలోని ప్రకృతి కంటినే ఆహ్లాదపరుస్తుంది. సహజ ప్రకృతి పంచేంద్రియాలకు అనుభూతినిస్తుంది.

ప్రకృతి తల్లిలా పోషిస్తుంది. వైద్యుడిగా ఆకుల మూలికలతో రోగాలను నయం చేస్తుంది. మిత్రుడిగా మనోభావాలను పంచుకుంటుంది. గురువులా విద్య గరపుతుంది. అభ్యసించే నైపుణ్యం ఉంటే గడ్డిపరక నుంచి హిమగిరి వరకు ఏదో ఒక గుణాన్ని, జీవన విధానాన్ని నేర్చుకోవచ్చు. దేవతలకు, రాజులకు, రుషులకు కూడా గురువైన దత్తాత్రేయ- ప్రకృతిలోని ప్రతిదీ తనకు గురువే అంటారు. ఒకప్పుడు గురుకుల విద్య ప్రకృతి ఒడిలో జరిగేది. ప్రకృతి ఒడిలో పెరిగిన పశుపక్ష్యాదులకు, కృత్రిమ వాతావరణంలో పెరిగిన వాటికి భేదం సుస్పష్టం.

కృత్రిమత్వం పక్షపాతం తెలియని సహజత్వం ప్రకృతి లక్షణం. దానికి సర్వజీవులూ సమానమే. జీవులకే భేదభావాలు. ఇతర జీవులు భేద బుద్ధి ఉన్నా ఆహార వ్యవహారాల్లో నియమాలు పాటిస్తాయి. కేవలం మనిషి మాత్రమే భిన్నంగా ప్రవర్తిస్తాడు. మనిషి విలక్షణ బుద్ధిజీవి. పక్షిని చూసి గాలిలో, చేపను చూసి నీటిలో విహరించడం నేర్చాడు. మనిషిలా భూమిపై నివసించడం మాత్రం పూర్తిగా నేర్చుకోలేదు. ‘స్వార్థమే పరమార్థం’ అనే భావన పెరిగి ప్రకృతిలోని సర్వ వనరులను ఉపయోగించుకొని తిరిగి ఉపయోగపడని పరాన్నజీవి మనిషి. అతడు ప్రకృతిని వికృతపరచి భూతాపాన్ని పెంచిన భస్మాసురుడు. తన మనసును కలుషితం చేసుకోవడమే కాక- చివరకు పీల్చే గాలిని, తాగే నీటిని, పంటలు పండించే మట్టిని, నివసించే వాతావరణాన్ని, పైన రోదసిని కలుషితపరచి, ప్రకృతి సమతుల్యతను భగ్నంచేసి- కొరివితోతల గోక్కుంటున్నాడు.

మనిషి ప్రకృతిలో భాగమే కానీ వేరు కాదు. శరీరంలో ఏ భాగం దెబ్బతిన్నా అది లోపమే. ప్రకృతి కూడా అంతే. మనిషి భావోద్వేగ సమతుల్యత దెబ్బతింటే తనకు, సమాజానికి హానికరం. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే సర్వ జీవరాశికీ వినాశకరం. అందుకే ప్రకృతిని దాని సహజ స్థితిలోనే ఉండనివ్వాలి. మనిషి  ప్రకృతితో కలిసి నడవాలి, పెరగాలి. దానికి భంగం కలిగిస్తే ముప్పు తప్పదు.  
నిన్ను నీవు తెలుసుకో అంటారు రమణ మహర్షి. అప్పుడే సహజ ఆనందకర స్థితిలో జీవితాన్ని గడుపుతావు. నేటి ప్రకృతి వేత్తలు ప్రకృతిని గురించి తెలుసుకో అంటారు. నైసర్గిక ప్రకృతిని అర్థం చేసుకొని దానికి మానవ ప్రకృతిని సమన్వయం చేసుకుంటే ఈ ప్రపంచంలో ఎలా నడుచుకోవాలో అర్థం అవుతుంది.

ప్రకృతిలోని పంచభూతాలు సృష్టికి మూలరూపాలు, శక్తిస్వరూపాలు,  ప్రాణాధారాలు. ప్రకృతిలోని చెట్టు పుట్ట గుట్ట నదీనదాలు కూడా భారతీయులకు దైవస్వరూపాలే. నీలో, ఈ సర్వ ప్రకృతిలోని ప్రతి అణువులో ప్రాణశక్తిగా ఉండే పరమాత్ముడు భిన్న తత్వాలుగా భిన్న గుణాలతో విరాజిల్లుతున్నాడనే భావన కలిగినప్పుడు- జీవనాధారమైన ప్రకృతిని పూజించగలుగుతావు, ప్రేమించగలుగుతావు. ప్రకృతిని ప్రేమించనివాడు వ్యక్తుల్ని కూడా ప్రేమించలేడు. పర్యావరణాన్ని ప్రకృతిని నీవు రక్షిస్తే నిన్ను ప్రకృతి రక్షిస్తుంది. అప్పుడే ‘లోకాస్సమస్తా స్సుఖినోభవంతు’  అనే విశ్వ శ్రేయోకాంక్ష సఫలీకృతం అవుతుంది.

కస్తూరి హనుమన్నాగేంద్ర ప్రసాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని