
వచ్చేస్తోంది.. మెటావర్స్ ప్రపంచం
ఇక అంతా వర్చువల్‌గానే..
రేసులో దిగ్గజ సంస్థలు
మనిషి పనిని సులభతరం చేసేది సాంకేతికత. కొత్త ఆవిష్కరణలతో మానవుడు ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతలను రూపొందిస్తూనే ఉన్నాడు. అంతర్జాలం, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ వంటి సాధనాలు..విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి. ఇప్పుడు వీటికి మించిన సాంకేతికత రానుంది. అదే ‘మెటావర్స్’. ఇంటర్నెట్ తర్వాత దీన్ని అతి పెద్ద మార్పుగా పేర్కొంటున్నారు. మనుషులను పూర్తిగా వర్చువల్ ప్రపంచంలో ఓలలాడించే ఈ సాంకేతికత.. ఆన్లైన్ అనుభూతిని సమూలంగా మార్చేస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఫేస్బుక్ సహా ప్రముఖ సంస్థలు.. ఈ సరికొత్త టెక్నాలజీపై దృష్టిపెట్టాయి.
రంగంలో జుకర్‌బర్గ్..!
ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్.. మెటావర్స్ సాంకేతికతపై దృష్టి పెట్టారు. ఫేస్‌బుక్‌ను ఓ సామాజిక మాధ్యమ సంస్థగా కంటే.. భవిష్యత్తులో మెటావర్స్ కంపెనీగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇప్పటికే వేలాది మందిని ఈ పని కోసం నియమించుకున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి విభాగాలనూ మెటావర్స్ పరిధిలోకి తీసుకురానున్నారు. దీనిపై ఫేస్బుక్ వార్షిక వర్చువల్ రియాలిటీ కాన్ఫరెన్స్‌లో జుకర్‌బర్గ్ ప్రకటన చేయనున్నారని ‘ది వర్జ్’ అనే పత్రిక వెల్లడించింది. ఫేస్బుక్ తాజా నివేదికలోనూ మెటావర్స్ గురించి వివరించింది. దీంతో టెక్ నిపుణుల దృష్టి దీనిపై పడింది. ఇదే అంతర్జాల భవిష్యత్ కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఈ పరిజ్ఞానం ఏమిటంటే..?
అంతర్జాలం రాకతో పనులన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. మెటావర్స్ వీటిని తలదన్నే సాంకేతికత. భౌతిక ప్రపంచంలోని మనుషులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లనుంది. ఆడుకోవడం, మాట్లాడుకోవడం, పని చేసుకోవడం.. ఇలా అన్ని పనులూ వర్చువల్‌గా రియల్‌టైమ్‌లో ఒకరినొకరు చూస్తూ చేసుకోవచ్చు. ఇంట్లో ఉంటూనే ప్రపంచంలో ఏ మూలన ఉన్న వ్యక్తినైనా కలవొచ్చు. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. నచ్చిన ప్రాంతాన్ని సందర్శించవచ్చు. వీడియో కాల్స్‌లో సహోద్యోగులను చూడటానికి బదులుగా.. వర్చువల్ వాతావరణంలో వారితో కలిసి పనిచేసుకోవచ్చు. హెడ్సెట్లు, అగ్మెంటెడ్ రియాలిటీ కళ్లద్దాలు, స్మార్ట్‌ఫోన్ యాప్‌లు, ఇతర పరికరాల సాయంతో ఈ మెటావర్స్‌ను అభివృద్ధి చేయనున్నారు. ‘‘ఇది తర్వాతి తరం కనెక్టివిటీ. ఈ విశ్వంలో ఇక్కడ ప్రతీదీ ఒకే చోట లభిస్తుంది. భౌతిక జీవితాన్ని గడిపినట్లే.. వర్చువల్‌గా మీ జీవితాన్ని గడుపుతారు’’ అని అధునాతన సాంకేతికతలపై పనిచేసే విశ్లేషకులు విక్టోరియా పెట్రాక్ వివరించారు. ‘మెటావర్స్’ పదాన్ని మొదటిసారి నీల్ స్టీఫెన్సన్ అనే రచయిత ఉపయోగించారు. 1992లో రాసిన సైన్స్ ఫిక్షన్ నవల ‘స్నో క్రాష్’లో దీని గురించి ప్రస్తావించారు.
వీడియో గేమ్స్ కంపెనీలకు వరం
ఫేస్బుక్ కాకుండా.. చాలా సంస్థలు మెటావర్స్‌పై పనిచేస్తున్నాయి. వీడియో గేమ్స్ కంపెనీలకు ఈ సాంకేతికత ఒక వరం లాంటిదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్ గేమ్స్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. ఇక వర్చువల్ ప్రపంచంలోకి అడుగుపెట్టి.. నెట్టింట ప్రత్యక్షంగా ఆడుకోవడమంటే.. గేమర్లకు సరికొత్త అనుభూతి అనే చెప్పాలి. ఎపిక్ గేమ్స్ అనే సంస్థ ఈ సాంకేతికతపై వేగంగా పనిచేస్తోంది. దీర్ఘకాలిక లక్ష్యాల్లో భాగంగా మెటావర్స్‌ను తీర్చిదిద్దేందుకు పెట్టుబడిదారుల నుంచి రూ.ఏడున్నర వేల కోట్లను సమీకరించింది. రోబ్లాక్స్ అనే మరో దిగ్గజ సంస్థ ఈ దిశగా అడుగులు వేస్తోంది. 3డీ ప్రపంచంలో నేర్చుకోవడం, ఆడుకోవడం, పని చేసుకోవడం, సామాజికంగా అనుసంధానమవ్వడం వంటి అంశాలపై దృష్టిసారిస్తోంది. ఇటాలియన్ ఫ్యాషన్ సంస్థ గూచీ.. జూన్‌లో రోబ్లాక్స్తో జట్టుకట్టింది. ‘డిజిటల్ ఓన్లీ’ పరికరాలను విక్రయించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కోకాకోలా, క్లినిక్ సంస్థలు డిజిటల్ టోకెన్లను విక్రయిస్తున్నాయి. మెటావర్స్కు ఇది తొలి అడుగు అని భావిస్తున్నారు. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే క్రిప్టోకరెన్సీకి డిమాండ్ పెరుగుతుందన్న చర్చలూ సాగుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Rishabh Pant : సూపర్ రిషభ్.. నువ్వొక ఎంటర్టైన్ క్రికెటర్‌వి
-
Politics News
Telangana News: యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
-
Politics News
Sanjay Raut: నాకూ గువాహటి ఆఫర్ వచ్చింది..!
-
Business News
Billionaires: కుబేరులకు కలిసిరాని 2022.. 6 నెలల్లో ₹1.10 కోట్ల కోట్లు ఆవిరి
-
Sports News
MS DHONI: రూ.40తో చికిత్స చేయించుకున్న ధోనీ.. ఎందుకో తెలుసా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Andhra News: నా చొక్కా, ప్యాంట్ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. సాంబశివరావు ఆవేదన